తాము సాగుచేసే పంటల వివరాలను ఎవరు నమోదు చేస్తారని, ఎలా పరిశీలిస్తారనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వానకాలం, యాసంగిలో వేర్వేరు పంటలు సాగు చేస్తామని.. ప్రభుత్వ సిబ్బంది ఎప్పుడు వచ్చి నమోదు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అదునుకు పెట్టుబడి సాయంగా ఇవ్వాల్సిన రైతుబంధు అధికారుల నివేదిక తర్వాతే ఇచ్చే అవకాశం ఉంటుందని, ఇలా అయితే అవసరమైన సమయంలో సాయం ఎలా అందుతుందని అంటున్నారు.
రైతు భరోసా అమలుపై రాష్ట్ర ప్రభుత్వం మొదటినుంచీ వాయిదాలతో దాటవేస్తున్నది. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా గతేడాది డిసెంబర్ 9న అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఆ తర్వాత గడువును నెలకోసారి మార్చుతూ వస్తున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ గడువును ఏకంగా ఆగస్టు 15కి పెంచారు. వానకాలం పంటల సీజన్ జూన్ 1నుంచి మొదలవుతుంది. రైతులకు అప్పుడే పెట్టుబడి సాయం అవసరమవుతుంది. విత్తనాలు, నాట్లువేసే సమయంలో ఉండే ఖర్చులకు రైతుబంధు ఉపయోగపడుతూ వస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఆగస్టు 15 అని చెబుతుండడంతో పెట్టుబడి ఖర్చుల కోసం రైతులు బ్యాంకులు, ప్రైవేట్ వ్యాపారుల దగ్గర అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తున్నది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రైతుబంధు రూపంలో అదునుకు పెట్టుబడి సాయం అందేదని, ఆరేళ్ల తర్వాత సాయంపై అయోమయం నెలకొన్నదని రైతులు వాపోతున్నారు.
పెట్టుబడి సాయంపై రైతుల్లో అందోళన రోజురోజుకూ పెరుగుతున్నది. రైతుబంధును రైతుభరోసాగా పేరు మార్చిన కాంగ్రెస్ సర్కారు సీజన్లో మొదట్లోనే సాయం అందించాల్సి ఉన్నప్పటికీ ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో అన్నదాతల్లో అయోమయం నెలకొంది. దీనికి తోడు ఐదెకరాలకే రైతుభరోసా వర్తిస్తుందని ఒక మంత్రి, అందరి సాగు వివరాలు పరిశీలించి ఇస్తామని మరో మంత్రి, పంటలు ఉన్న భూములను పరిశీలించి ఇస్తామని ప్రభుత్వ పెద్దలు.. ఇలా విభిన్నమైన ప్రకటనలు చేస్తుండడంతో అసలు పెట్టుబడి సాయం వస్తుందా? రాదా? అనే సందేహం వారిలో వ్యక్తమవుతున్నది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రందిలేకుండా అదునుకు రైతుబంధు పడేదని , ఈ కాంగ్రెస్ అచ్చినంక అంతా ఆగమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– వరంగల్, మే 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
జయశంకర్ భూపాలపల్లి, మే9(నమస్తే తెలంగాణ): కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రైతులు నిమ్మలంగా ఉండె. నీళ్లకు, కరెంటుకు ఎలాంటి ఇబ్బంది లేకుండె. పంటకు ముందే పెట్టుబడి సాయం అందేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పంట చివర్ల రైతుబంధు సాయం ఇచ్చిండ్రు. అది కూడా 5 ఎకరాల లోపే. అందరికీ అందలే. వానకాలం పంటలు వేసినంక సర్వే చేశాక రైతుబంధు ఇస్తరట. అంటే మల్ల పంట చేతికొచ్చే టైం దగ్గర పడుతది. పేద రైతులకు పెట్టుబడి సాయం ఎక్కడ ఆసరా అవుతది. పెట్టుబడికి అప్పులు తెచ్చు కోవాలె. అవి వడ్డీకే సరిపోవు. యాసంగి వడ్లు అమ్ముకునే టైంలో రైతుబంధు డబ్బులు వచ్చినయి. ఇక వానకాలం రైతుబంధు డబ్బులు ఎప్పుడొస్తయో తెల్వదు.
– గౌడ మహేశ్, రైతు, భూపాలపల్లి
దేవరుప్పుల: వానకాలం, యాసంగికి ముందే రైతుబంధు పైసలు వేయాలె. పెట్టుబడి డబ్బులు టైముకు రైతుల ఖాతాలల్ల పడితె ఇత్తనాలు, కూలీలు, ఎరువులకు అక్కరకొస్తయి. రియల్ ఎస్టేట్, రోడ్లకు పోయిన భూములు తీసేయండి. అంతేగాని రైతులను చిన్నపెద్దఅని చూడక ఎన్నెకరాలు ఉన్నా అందరికి పెట్టుబడి పైసలిస్తేనే బాటుంటది. పంటలను ప్రభుత్వం కొనడం, రైతు బంధు, కరెంట్, సాగునీరు పుష్కలంగా ఇయ్యడంతో రైతు కుటుంబాలు ఈ మధ్యనే ఇగురుపెడుతున్నయ్. ఇంతలోనే ఈ ప్రభుత్వం రైతు బంధు మీద తాకట్టుపెడుతాంది.
– బిళ్ల అంజమ్మ, రైతు, కామారెడ్డిగూడెం