‘కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని ప్రాంతాలూ నాకు సమానమే.. ఇచ్చిన మాట ప్రకారం ములుగును జిల్లా చేసినం.. ఇక్కడ అడగకుండానే ఎన్నో పనులు చేసినం.. గిరిజనులకు పోడు పట్టాలు, రైతుబంధు ఇస్తున్నాం.. ఎన్నికల తర్వాత గిరిజనేతరులకు పట్టాలిస్తం. మళ్లీ అధికారంలోకి రాగానే భూపాలపల్లిని మరింత అభివృద్ధి చేసుకుందాం’ అని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు బడే నాగజ్యోతి, గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో ములుగు, భూపాలపల్లిలో శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలకు లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. నాగజ్యోతిని గెలిపిస్తే ములుగు ఓ జ్యోతిలా వెలిగిపోతుందని, ఆమె తండ్రి నాడు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల కోసం ప్రాణాలిచ్చాడని గుర్తుచేశారు. గండ్ర వెంకటరమణారెడ్డిని గెలిపిస్తే భూపాలపల్లి మరింత ప్రగతి సాధిస్తుందని, బీఆర్ఎస్ను ఆశీర్వదిస్తే రెండు నియోజకవర్గాల అభివృద్ధి బాధ్యత తనదేనని చెప్పారు.
ములుగు/జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ఎన్నికలు అనగానే ఆగం కావద్దని, అభ్యర్థి గుణగణాలు, అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ చరిత్రను పరిశీలించి ఓటు వేయాలని ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. బీఆర్ఎస్ను ఆశీర్వదిస్తే నియోజకవర్గాల బాధ్యత తానే తీసుకుంటానని చెప్పారు. ములుగులో నాగజ్యోతిని, భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులు బడే నాగజ్యోతి, గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో ములుగు, భూపాలపల్లిలో శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం ప్రసంగించారు.
‘తెలంగాణలో అన్ని ప్రాంతాలు నాకు సమానమే, ఇచ్చిన మాట ప్రకారం ములుగును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసినందుకు ఈ జిల్లాపై నాకు మరింత ప్రేమ ఉంది, ములుగు నాదే, నియోజకవర్గంలోని అన్ని సమస్యలను పరిష్కరించేందుకు మూడోసారి ముఖ్యమంత్రిని అయ్యాక ఇక్కడికి వచ్చి ములుగులో రెండు రోజులు ఉండి అన్ని సమస్యలను పరిష్కరిస్తా.. ఎవరి చేతిలో ములుగు నియోజకవర్గం ఉంటే బాగా అభివృద్ధి చెందుతుందో ప్రజలు ఆలోచించాలి. సమక్క-సారలమ్మలు ఉన్న ఈ నేలకు వందనం చేస్తున్నా, ఎన్నో సార్లు సమ్మక్క తల్లి, సారక్క తల్లికి తెలంగాణ రావాలని మొక్కుకొని బంగారం అప్పజెప్పిన. రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే జాతరలో మెరుగైన సౌకర్యాలు కల్పించాం. జాతరను మరింత అభివృద్ధి చేసే ప్రయత్నం చేసుకుందాం..
నాగజ్యోతి ప్రజలే నా తల్లిదండ్రులని చెబుతోంది. చినప్పటి నుంచి కష్టాల్లో పెరిగింది. కష్టపడి ఉన్నత విద్యావంతురాలైంది. సర్పంచ్ నుంచి జిల్లా పరిషత్ అధ్యక్షురాలి దాకా ఎదిగింది. నాగజ్యోతి ఎమ్మెల్యే అయితే ములుగు కూడా ఒక జ్యోతిలా వెలుగుతుంది. కాంగ్రెస్ పార్టీవాళ్లు ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నరు. నాటి ఇందిరమ్మ రాజ్యంలోనే నాగజ్యోతి తండ్రి బడే నాగేశ్వర్రావు ప్రజల కోసం పోరాటం చేసి అమరుడైండు. ఇందిరమ్మ రాజ్యం అంటే బానిస బతుకులు, ఎన్కౌంటర్లు, ఎదురుకాల్పులు. ప్రజలు నాగజ్యోతిని గెలిపిస్తే ఇక్కడ అన్ని సమస్యలు వంద శాతం పరిష్కరించే బాధ్యత నాది. కాంగ్రెస్ వాళ్లు వచ్చేది లేదు, సచ్చేది లేదు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలుపియకున్నా మీ మీద అలుగలేదు. ఇప్పుడు మాత్రం మీతోని పంచాయతీ పెట్టుకొని మరీ ఓట్లు అడుగుతాన్న. ములుగు అభివృద్ధి కావాలంటే గవర్నమెంట్ ఉన్న అభ్యర్థి గెలిస్తేనే అవుతది. నాగజ్యోతిని నిండు మనస్సుతో దీవించాలి.
ములుగు నియోజకవర్గంలో పోడు భూముల సమస్యలను పరిష్కరించాం. వాటిపై కేసులను ఎత్తేసి రైతు బంధు, రైతుబీమా వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటాం. కొంత మంది గిరిజనులు కాని వారికి సైతం పోడు భూములు ఉన్నాయి. అది కేంద్రం చేతిలో ఉంది. అయినా మీకు హామీ ఇస్తున్నా గిరిజనేతరులకు కూడా పోడు పట్టాలు ఇస్తా. పోయిన ఎన్నికల్లో ఇదే ములుగుకు వచ్చిన సమయంలో ములుగు జిల్లా కావాలని ప్రజలు కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రజలు ఓడగొట్టినా ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోవాలె కదా.. ఎందుకంటే ములుగు నాది కదా.. తెలంగాణలో ఏమూలైనా , ఏ పల్లె అయినా అభివృద్ధి చెందింది అంటే కేసీఆర్కు గౌరవమే కదా.. నవ్వేటోళ్ల ముందు తెలంగాణ జారి పడద్దని ఇక్కడ ఇచ్చిన మాట ప్రకారం జిల్లా చేసిన. జీవితంలో ఎవరైనా అనుకున్నారా ములుగుకు మెడికల్ కాలేజీ వస్తదని!. మెడికల్ కాలేజ్తో 400 పడకల దవాఖాన, నర్సింగ్ కా లేజీ, పారామెడికల్ కోర్సులతో పాటు బ్రహ్మాండమైన వైద్య సేవలు ప్రజలకు అందుతాయి. పోయిన సారి వరదలు వచ్చినప్పుడు రామన్నగూడెంలో పర్యటించిన, అపుడు ప్రజలు డయాలసిస్ సెంటర్ కావాలని కోరిన వెంటనే ఏర్పా టు చేసిన. కొన్ని సమస్యలున్నయని బడే నాగజ్యోతితో పాటు కొందరు నాయకులు నాకు చెప్పారు. ఎమ్మెల్యే ఏ పార్టీలోనైనా ఉండవచ్చు కానీ తప్పక ముఖ్యమంత్రిని కలవాల్సి ఉంటుం ది. ములుగు ఎమ్మెల్యే ఎన్నడూ రాలేదు, ఏం అడుగలేదు. మనకు తోచినవి, మన పార్టీ వాళ్లు చెప్పిన పనులు చేసినం తప్ప ఆమె ఏనాడూ ఇది కావాలని అడుగలే. ములుగు ముఖ్యంగా గిరిజన ప్రాంతం, ఇక్కడ ఎక్కువ సమస్యలు ఉంటయి. వాటిని పరిష్కరిస్తా..