హైదరాబాద్, మార్చి5 (నమస్తే తెలంగాణ): నాగర్‌కర్నూల్ జిల్లా ‘కుమ్మెర’ ఘటనను నిరసిస్తూ సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చిన రజక సంఘాల జేఏసీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ రజక సంఘం అధ్యక్షుడు పూసాల సంపత్, నర్సింహులు, రజక వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు ఆశయ్య, రజక రిజర్వేషన్ పోరాట సమితి నేత గోపి, శ్రీలక్ష్మి తదితరులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో ప్రభుత్వ తీరును నిరసిస్తూ రజక సంఘాలు శుక్రవారం ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చాయి. ఎట్టిపరిస్థితుల్లో శుక్రవారం ధర్నా నిర్వహిస్తామని పూసాల సంపత్ వెల్లడించారు.
రజకసంఘాల నేతలకు సీపీఎం మద్దతు
కుమ్మెర ఘటన బాధ్యులను కఠినంగా శిక్షించాలని సీపీఎం డిమాండ్ చేసింది. చికడపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్న రజక నేతలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, కార్యదర్శివర్గ సభ్యుడు బండారు రవికుమార్, సీనియర్ నాయకుడు డీజీ నరసింహరావు కలిశారు. రజకుల పోరాటానికి మద్దతు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి, నిందితులకు శిక్ష పడేలా చూడాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. లేదంటే సీపీఎం ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.