నర్సంపేట నియోజకవర్గం ఐదేళ్లలో విశేష ప్రగతి సాధించింది. బీఆర్ఎస్ సర్కారు చొరవతో నియోజకవర్గ రూపురేఖల్ని మార్చడంలోస్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తనదైన ముద్రవేశారు. గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్న ప్రతిపక్ష నాయకులు ఈ ప్రాంతాన్ని గానీ ఇక్కడి సమస్యలను పట్టించుకోక నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో నిధుల వరద పారడంతో పాటు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మెడికల్ కళాశాల, హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్, జిల్లాస్థాయి ఆస్పత్రి, క్రిటికల్ కేర్ సెంటర్, తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ లాంటి ఇవ్వని హామీలనూ పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చింది. ఇలా ఉద్యమనేత, ఎమ్మెల్యే పెద్ది చొరవతో అనతికాలంలోనే నర్సంపేట అన్నింటా అద్భుతమైన అభివృద్ధి సాధిస్తోంది. కాగా రేపు నర్సంపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రానుండగా ఎమ్మెల్యే పెద్ది ఆధ్వర్యంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
వరంగల్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : నర్సంపేట శాసనసభ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి బరిలో దిగిన పెద్ది సుదర్శన్‌రెడ్డి ఎమ్మెల్యేగా తన మార్క్ చాటారు. అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. తెలంగాణ ఉద్యమ నేతగా ప్రభుత్వంలో తనకున్న చనువుతో అనుకున్నది సాధించారు. ప్రత్యేక ప్రాజెక్టులను తీసుకొచ్చి ఇక్కడ ప్రగతిని పరుగు పెట్టించారు. శాసనసభ్యుడిగా గత ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధితో ఎన్నికల ప్రచారంలో జనంలోకి వెళ్తున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధిని కొనసాగేందుకు మళ్లీ ఆశీర్వదించాలని పెద్ది ప్రజలను కోరుతున్నారు.
నర్సంపేట నియోజకవర్గాన్ని సాగునీటి రంగంలో అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే పెద్ది సఫలీకృతులయ్యారు. కృష్ణా బేసిన్‌లోని ఈ ప్రాంతానికి గోదావరి జలాలను తీసుకొచ్చారు. దేవాదుల ప్రాజెక్టు మూడో దశలోని రామప్ప బ్యాలెన్సింగ్ రిజర్వాయ ర్ నుంచి ఎత్తిపోతల ద్వారా నీరు నర్సంపేటకు చేరుతున్నాయి. రూ.336 కోట్లతో రామప్ప- పాకాల ఎత్తిపోతల ప్రాజెక్టు, రూ.225 కోట్లతో రామప్ప-రంగాయచెరువు ఎత్తిపోతల ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. దీంతో రామప్ప రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలు ఖానాపురం మండలంలోని పాకాల సరస్సు, నల్లబెల్లి మండలంలోని రంగాయచెరువులోకి వస్తున్నాయి. ఈ నీరు గొలుసుకట్టు పద్ధతిన చెరువుల్లోకి చేరుతుంది. దీంతో ఈ నియోజకవర్గంలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఏటా రెండు పంటలకు నీరందుతోంది. ఈ ఎత్తిపోతల ప్రాజెక్టులకు తోడు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చిన్నకోర్పోలు వట్టివాగుపై చెక్‌డ్యాం కం రోడ్డు బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.3.24 కోట్లు, ఇదే వట్టివాగుపై నాగారం వద్ద చెక్‌డ్యాం కం బ్రిడ్జి నిర్మాణానికి రూ.18.60 కోట్లు, చెన్నారావుపేట మండలంలో మున్నేరువాగుపై చెక్‌డ్యాం కం బ్రిడ్జి నిర్మాణానికి రూ.18.70 కోట్లు మంజూరు చేయించారు. రెండేళ్ల క్రితం పాకాల, మున్నేరు, వట్టివాగు, పెద్దవాగులపై రూ.36 కోట్లతో చేపట్టిన 13 చెక్‌డ్యాంల నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయి. ఇవి పూర్తయితే వాగుల్లో 38 కిమీ వరకు నీరు నిల్వ ఉండనున్నది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ఈనెల 13న నర్సంపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొనున్నారు. రెండో విడుత ఉమ్మడి జిల్లాలో ఇదే మొదటి సభ కానుండగా బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. సాయంత్రం నిర్వహించే సభకు ఎమ్మెల్యే, నర్సంపేట బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు వేలాది మంది తరలిరానుండగా ఎక్కడా ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు.
వ్యవసాయరంగంపై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రత్యేక దృష్టిపెట్టారు. రాష్ట్రంలో మరెక్కడా లేని రీతిలో నియోజకవర్గానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ మంజూరు చేసింది. ఇందుకోసం ఇటీవల కన్నారావుపేట వద్ద ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. వ్యవసాయ యంత్రీకరణ సబ్సిడీ ప్రాజెక్టు కింద ప్రభుత్వం రాష్ట్రంలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు కొద్ది నెలల క్రితం రూ.75 కోట్లు మంజూరు చేయగా వాటిలో నర్సంపేట ఒకటి. రూ.37.50 కోట్లతో ఈ నియోజకవర్గంలో రైతులకు ఈ ప్రాజెక్టు ద్వారా 50శాతం సబ్సిడీపై ప్రభుత్వం వ్యవసాయ యంత్రాలు, పరికరాలు, పనిముట్ల పంపిణీ చేపట్టింది. 2022-23, 2023-24లో నియోజకవర్గంలో కురిసిన వడగండ్ల వర్షం వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ప్రభుత్వం రూ.52 కోట్ల పరిహారం పంపిణీకి నిర్ణయించింది. ఈ నియోజకవర్గంలో పంట ఉత్పత్తుల నిల్వ కోసం రూ.80 కోట్లతో లక్ష టన్నుల కెపాసిటీ గోదాముల నిర్మాణం చేపట్టింది. రైతు ఉత్పత్తి సంఘాలను పెద్ద మొత్తంలో ఏర్పాటు చేసి వాటికి ఆధునిక వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను పంపిణీ చేస్తుంది.
మోడల్ సిటీగా నర్సంపేట మారుతున్నది. రాష్ట్రంలోనే ప్రథమంగా పీఎన్జీ ఇక్కడ అందుబాటులోకి వచ్చింది. తద్వారా రూ.730కే గ్యాస్ సరఫరా అవుతున్నది. కొద్ది నెలల క్రితం మంత్రి కేటీఆర్, పెద్దితో కలిసి ప్రారంభించారు. అలాగే 12 కి.మీ సెంట్రల్ లైటింగ్, 9 కి.మీ అంతర్గత బీటీ రోడ్ల మరమ్మతులు, 3 కి.మీ సీసీ బైపాస్ రోడ్డు విస్తరణ, రూ.9 కోట్లతో సైడ్ డ్రైనేజీ కాల్వలు నిర్మించారు. రూ.6 కోట్లతో ‘పాకాల ఆడిటోరియం’ పనులు తుది దశలో ఉన్నాయి. రూ.5 కోట్లతో వెజ్ అండ్ నాన్‌వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ త్వరలో పూర్తి కానున్నది. రూ.7 కోట్లతో కుమ్మరికుంట మోడల్ పార్కు, జంక్షన్ల పనులు జరుగుతున్నాయి. ఇటీవల టీయూఎఫ్ఐడీసీ నుంచి రూ.20 కోట్లు మంజూరయ్యాయి.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా నర్సంపేట నుంచి సుదర్శన్‌రెడ్డి విజయదుందుబి మోగించారు. తొలిసారి శాసనసభలో అడుగుపెట్టిన ఆయన నియోజకవర్గాన్ని అన్నింటా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కదిలారు. ఈ ప్రాంతంపై సంపూర్ణ అవగాహనతో ప్రజల అవసరాలను తీర్చే దిశగా ప్రణాళికలు రూపొందించి దశలవారీగా ఆచరణలోకి తెచ్చా రు. ఉద్యమంలో మొదటినుంచీ బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వెంట నడిచారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆశీస్సులు, ఐటీ మంత్రి కేటీఆర్, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సహకారంతో నర్సంపేటకు నిధులు భారీగా తెచ్చారు. మరే రాష్ట్రంలోనూ లేని విధంగా జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీని కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేయగా వరంగల్‌కు సంబంధించిన కాలేజీని నర్సంపేటకు మంజూరు చేసింది. జిల్లాకేంద్రంలో కాకుండా ఒక నియోజకవర్గ కేంద్రంలో కాలేజీ ఇవ్వడం రాష్ట్రంలో ఇదొక్కటే కావడం విశేషం. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతోనే ఇది సాధ్యమైంది. రూ.183 కోట్లతో నర్సంపేటలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి ఇటీవల మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశా రు. దీనికితోడు నర్సంపేటలో ప్రభుత్వం జిల్లా ఆసుపత్రి నిర్మాణం చేపట్టింది. రూ.70 కోట్లతో ఇక్కడ 450 పడకల జిల్లా ఆసుపత్రి నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. సాధ్యమైనంత త్వరలో ఈ జిల్లా ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నది. నర్సంపేటలో రూ.30 కోట్లతో 50 పడుకల క్రిటికల్ కేర్ సెంటర్‌ను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. దీని నిర్మాణం కోసం ఇటీవల మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే నర్సంపేటలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రక్తనిధి కేంద్రం, కిడ్నీ డయాలసిస్ సెంటర్, గతేడాది ఇక్కడ రూ.11 కోట్లతో నెలకొల్పిన తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ పనిచేస్తున్నది. ఎమ్మెల్యే పెద్ది నర్సంపేటను ఇలా హెల్త్‌హబ్‌గా తీర్చిదిద్దడంలో తన ప్రత్యేకతను చాటారు.