దశాబ్దాలుగా జఠిలమై కూర్చున్న పోడు సమస్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ శాశ్వత పరిష్కారం చూపడంతో గిరిపుత్రుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ పోడు భూముల విషయంలో గిరిజనులకు శుక్రవారం స్పష్టత ఇవ్వడంతో వారిలో ఉత్కంఠ తొలగిపోయింది. ఈ నెలాఖరు నుంచి పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టడంతో పాటు అడవుల సంరక్షణ బాధ్యతలు కూడా అప్పజెబుతామని సీఎం పేర్కొనడంపై ఏజెన్సీవాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఏ ఆధారంలేని ఎస్టీలకు గిరిజన బంధును కూడా అమలు చేస్తామని ప్రకటించడంతో వారిలో సంబురం రెట్టించింది. వాల్మీకి బోయలు, పెద్ద బోయలు, మధుర కాయితీ లంబాడాలు, మాలిసహబేదర్, కిరాతక, నిషాని, బాట్మధురాలు, చెమర్ మధురాలు, చెండువాళ్లు, తలయారి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని సీఎం తీర్మానించడం ఆయా కులాలవారిలో భరోసా నింపింది.
-ములుగు, ఫిబ్రవరి10 (నమస్తేతెలంగాణ)/శాయంపేట
ములుగు, ఫిబ్రవరి10 (నమస్తేతెలంగాణ)/శాయంపేట : ఎనోనేళ్లుగా ఎదురు చూస్తున్న పోడు సమస్యకు పరిష్కారం దొరు కుతుండడంపై గిరిజనుల్లో ఆనందం నెలకొంది. పోడు పట్టాల విషయ ంలో గిరిజనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం స్పష్టత ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతంలో పోడు చేసుకొని జీవనం సాగిస్తున్న గిరిజనులు తమకు భూ హక్కు పత్రాలు లేక ఇన్నేళ్లుగా ఇబ్బందులు పడుతూ వచ్చారు. రైతు బంధు, రైతు బీమా, ఇతర రాయితీలు అందక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వారి ఇబ్బందులను గుర్తించిన బీఆర్ఎస్ ప్రభు త్వం పోడు భూములకు పట్టాలు ఇస్తామని గతంలోనే ప్రకటించింది. ఇచ్చిన హామీకి కట్టుబడి పట్టాల పంపిణీ విషయంలో తీవ్రంగా కృషి చేసింది. పోడుదారుల నుంచి దరఖాస్తులు సేకరించి గత సెప్టెంబర్, అక్టోబర్‌లోనే సర్వే కూడా పూర్తి చేయించింది.
ఈ క్రమంలో అసెంబ్లీ వేదికగా పోడు పట్టాల పంపినీ విషయంలో సీఎం కేసీఆర్ శుక్రవారం స్పష్టతనిచ్చారు. అర్హులకు ఈ నెలలోనే పట్టాలు ఇస్తామని ప్రకటిస్తూనే మళ్లీ పోడు చేయకుండా పటిష్ట చర్యలు చేపడుతామని ప్రకటించారు. స్థానిక ఎంపీటీసీ, సర్పంచ్, గ్రామ పెద్దలు, ఇక గ్రామాల్లో పోడు చేయకుండా చూస్తామని లిఖిత పూర్వక హామీ ఇస్తేనే ఆయా గ్రామాల వారికి పోడు పట్టాలు ఇస్తామని తెలిపారు. హామీ ఇవ్వని గ్రామాలకు పట్టాలు ఇవ్వడం కుదరని తేల్చి చెప్పారు. పట్టాల పంపిణీ అనంతరం అటవీ ప్రాంతాల్లో సాయుధ దళాలను కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. గిరిజన సంక్షేమంతో పాటు అడవుల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వం ఉందన్నారు. అడవులను రక్షించుకుంటేనే మనుడగ సాధించగలుగుతామన్నారు. త్వరలోనే గిరిజనులకు పోడు పట్టాలు అందిస్తామని సీఎం ప్రకటించగానే గిరిజన గ్రామాల్లో ఆనందం నెలకొంది.
11కులాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు తీర్మానం
అన్ని కులాలు, మతాలకు సముచిత న్యాయం చేయడంలో తనకు ఎవరూ సాటి లేరని సీఎం కేసీఆర్ మరోమారు నిరూపించుకున్నారు. 11కులాలకు ఎస్టీ జాబితాలో చేర్చాలని తీర్మానించి ఇన్నేళ్లూ ఏ గుర్తింపునకూ నోచుకోనివారిలో ఆనందం నింపారు. కేంద్రం అనుసరిస్తున్న వైఖరి కారణంగా గిరిజనులకు ఎంతో అన్యాయం జరుగుతున్నది. గిరిజనులపై సానుకూలతతో రిజర్వేషన్లను పెంచాలని కేంద్రానికి సీఎం కేసీఆర్ ఎన్ని నివేదికలు పంపినా అనుమతించలేదు. గిరిజనుల రిజర్వేషన్లను 6 నుంచి 10శాతానికి పెంచాలన్న ప్రతిపాదనను పక్కన పెట్టి, గిరిజనులపై కేంద్రం వివక్ష చూపుతూ వస్తున్నది. అయినా కేంద్రం తీరును పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూనే గిరిజన బంధును కూడా అమలు చేస్తామని ప్రకటించారు. దీంతో పాటు ఎస్టీ జాబితాలోకి మరో 11కులాలను చేర్చాలని తీర్మానించారు. వాల్మీకి బోయలు, పెద్ద బోయలు, మధుర కాయితీ లంబాడాలు, మాలిసహబేదర్, కిరాతక, నిషాని, బాట్మధురాలు, చెమర్ మధురాలు, చెండువాల్లు, తలయారి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని సీఎం కేసీఆర్ తీర్మానించారు.
2005 అటవీ హక్కుల చట్టంతో 20వేల కుటుంబాలకు నష్టం
పోడు సమస్య పరిష్కారానికి 2005 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని కేంద్రం దిశా నిర్దేశం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పోడు భూముల పట్టాల జారీకి చర్యలు చేపట్టింది. 2005 చట్టం ప్రకారం పోడుకు పట్టాలు పంపిణీ చేస్తే ఎంతో మంది గిరిజన కుటుంబాలకు నష్టం వాటిళ్లే పరిస్థితి ఏర్పడింది. కేంద్రం పర్యావరణ వేత్తలను ఉసిగొల్పి గిరిజనులతో అడవులకు నష్టం వాటిల్లుతోందనే సాకుతో వారిని అడవులకు దూరంగా పంపే ప్రయత్నాలు చేస్తున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో గిరిజన గూడేలు, తండాలను ప్రత్యేక పంచాయతీ లుగా ఏర్పాటు చేశారు. గూడేలు, తండాల్లో గిరిజనులే ప్రజా ప్రతినిధులుగా మారి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పిం చారు. ఇప్పుడు పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూప డంతో పాటు గిరిజన బంధు కూడా అమలు చేస్తామని చెప్పి గిరిజనుల అభ్యున్నతిపై ఉన్న చిత్తశుద్ధిని చాటుకున్నారు.

రిజర్వేషన్‌పై కేంద్రం చిన్న చూపు
డోర్నకల్: గిరిజనుల రిజర్వేషన్‌పై కేంద్రం చిన్న చూపు చూస్తాంది. ట్రైబల్ యూనివర్సిటీ పెట్టలె. ఇచ్చిన హామీలను ఒక్కటీ నెరవేర్చలె. సీఎం కేసీఆర్ 10 శాతం రిజర్వేషన్ ఇయ్యాలని కేంద్రంతో కొట్లాడుతాండు. పోడు భూములకు పట్టాలిస్తామనడం సంతోషం. గిరిజన బంధు పెడ్తామనడం ఆయనకు గిరిజనులపై ఉన్న ప్రేమకు నిదర్శనం.
– అంగోత్ వెంకన్న, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు
మరువలేని రోజు
నర్సింహులపేట: గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్రానికి అసెంబ్లీ తీర్మానం పంపినా ఇయ్యక పోవడం దురదృష్టకరం. రాష్ట్రంల సీఎం కేసీఆర్ గిరిజనులకు 10 శాతం రిజర్వే షన్ ప్రకటించడం సంతోషదాయకం. ఇప్పటికే ఎవుసానికి 24 గంటలు, గృహాలకు 101 యూనిట్ల వరకు ఉచితంగ కరంట్ ఇస్తున్రు. ఇప్పుడు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించడం గిరిజనులకు మరువలేని రోజు.
– జాటోత్ దేవేందర్, వైస్ ఎంపీపీ, నర్సింహులపేట
10 శాతం రిజర్వేషన్ హర్షణీయం
దంతాలపల్లి: ఇప్పటి వరకు ఏ సర్కారు గిరిజనులను పట్టించుకున్న పాపాన పోలె. మన రాష్ట్రం వచ్చినంక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విధాల అదుకుంటుడు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిండు. పోడు భూములకు పట్టాలిస్తానని చెప్పిండు. గిరిజన బంధుతో గిరిజనుల పాలిట దైవంలా మారారు.
– గుగులోత్ పిటి వెంకన్న, తూర్పు తండా(దంతాలపల్లి)
సాహసోపేత నిర్ణయం
నర్సంపేట రూరల్: పోడు భూములకు హక్కు పత్రాలందించడం రాష్ట్ర ప్రభుత్వ సాహసోపే తమైన నిర్ణయం. గత ప్రభుత్వాలు పోడు రైతులను ఏమాత్రం పట్టించుకోలె. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో న్యాయం జరుగుతోంది. హక్కు పత్రాలతో రైతుబంధు కూడా పడుతుంది. దీంతో రైతన్నలు దీమాగా బతుకొచ్చు. మా పాలిట దేవుడు సీఎం కేసీఆర్.
– బానోత్ నీల, మంజ్యానాయక్తండా(నర్సంపేట)
ఉద్యోగ అవకాశాలు పెరుగుతయ్..
ఖానాపురం: గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచడం వల్ల విద్య, ఉద్యోగావకాశాలు పెరు గుతయ్. కేంద్రం మొండిచేయి చూపినా సీఎం కేసీఆర్ పట్టుబట్టి గిరిజన రిజర్వేషన్లను పెంచ డం చాలా సంతోషకరం. వచ్చే కొద్ది సంవత్సరాల్లోనే ఈ ఫలితాలను గిరిజన బిడ్డలు పొందు తారు. ముందుచూపుతో పనిచేసే ప్రభుత్వానికి గిరిజన బిడ్డలమంతా అండగా నిలబడతాం.
– బానోత్ శ్రీనివాస్, నాజీతండా(ఖానాపురం)
గిరిజనులు మరిచిపోరు..
చెన్నారావుపేట: అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఎస్టీల రిజర్వేషన్, పోడు భూముల సమస్యలను పరిష్కరించి పట్టాలిస్తామని చెప్పి గిరిజనుల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిండు. త్వరలో గిరిజన బంధు ఇస్తామనడం అభినందనీయం. 11 లక్షల ఎకరాల పోడు భూములను పంచిన తర్వాత గిరివికాసం పథకం ద్వారా నీటి సౌకర్యం, రైతుబంధును అందజేస్తామనడం సంతోషంగా ఉంది. ఇది సీఎం కేసీఆర్ చిత్తశుద్ధికి నిదర్శనం.
– బదావత్ విజేందర్, చెన్నారావుపేట
మా కష్టాలు తీరినట్లే..
గూడూరు: సర్కారు ఈ నెలాఖర్ల పోడు భూములకు పట్టాలిస్తే మా కష్టాలు తీరినట్లే. చాన ఏళ్లుగా పోడు ఎవుసం చేసుకుంటూ బతుకుతున్నం. ఇగ మాకు బ్యాంకుల లోన్లు, రైతు బంధు, రైతు బీమా వస్తది. చాలా ఆనందంగా ఉంది. గిరిజనులు కేసీఆర్ సారుకు రుణపడి ఉంటరు.
– వాంకుడోత్ కఠార్‌సింగ్, కలకత్తాతండా(గూడూరు)
గిరిజన బంధు ఇవ్వడం సంతోషం
పాలకుర్తి: గిరిజనుల కోసం ప్రత్యేకంగా గిరిజన బంధు అమలు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పడం సంతోషం. దీంతో ప్రతి ఒక్క గిరిజన బిడ్డ ఆర్థికంగా ఎదుగుతడు. గత ప్రభుత్వాలు పోడు భూములపై సరైన నిర్ణయం తీసుకోలె. సీఎం కేసీఆర్ ఆ సమస్యను పరిష్కరిస్తాననడంతో రైతుల ఆనందానికి అవధుల్లేవు.
– బనావత్ కిషన్, హట్యాతండ, పాలకుర్తి
తీరనున్న చిరకాల కోరిక
రఘునాథపల్లి: చాన ఏండ్లుగా పోడు భూముల సమస్య తీరలె. ఇప్పుడు పట్టాలిస్తే గిరిజనుల చిరకాల కోరిక తీరుతుంది. ఉమ్మడి రాష్ట్రంల నేతల మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. స్వరాష్ట్రంల గిరిజనుల బాధలను గుర్తించిన సీఎం కేసీఆర్ పోడు భూములకు పట్టాలివ్వడం హర్ష ణీయం. ఉచిత విద్యుత్, రైతుబంధు ఇస్తామనడంతో గిరిజనుల బతుకుల్ల కొత్త ఆశలు చిగురిస్తు న్నాయి.
– కొర్ర రాజేందర్‌నాయక్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు
మా జీవితాల్లో వెలుగులు..
స్టేషన్‌ఘన్‌పూర్: గతంల ఎవరూ దళితులు, గిరిజనులను పట్టించుకోలె. కేసీఆర్ సారు వారిని అన్ని తీర్ల ఆదుకుంటూ దేవుని లెక్క నిలుస్తున్నడు. పోడుదారులను గుర్తించిన ముఖ్యమంత్రి వారి భూములకు పట్టాలిస్తామనడం బాగుంది. రైతు బంధుతోపాటు గిరిజన బంధు కూడా ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించడం హర్షణీయం. ఇకపై గిరిజన జీవితాల్లో వెలుగు నిండడమే కాకుండా, వారి తలరాతలు మారుతయ్.
– లకావత్ చిరంజీవి, బీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇన్చార్జి
తెలంగాణలోనే గిరిజనులకు న్యాయం
తెలంగాణలో గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది. 2005 వరకు మాత్రమే ఉన్న పోడు దారులకు పట్టాలు పంపిణీ చేయాలన్న కేంద్రం నిర్ణయంతో ఎంతో మంది గిరిజనులకు అన్యాయం జరుగుతుంది. ఇవన్నీ గ్రహించిన సీఎం కేసీఆర్, ఈ నెలాఖరు వరకు మరో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించడం గిరిజనులపై వారికున్న చిత్తశుద్ధికి నిదర్శనమని చెప్పవచ్చు. కేంద్రం అవలంబిస్తున్న విధానాలతోనే గిరిజనులకు అన్యాయం జరుగుతోంది.
– ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ – మానుకోట మాజీ ఎంపీ, ములుగు జిల్లా వాసి
సీఎం కేసీఆర్ నిర్ణయం గొప్పది
కేంద్ర ప్రభుత్వం ఎంతో కాలంగా గిరిజన రిజర్వేషన్లపై దాటవేత వైఖరిని అవలంబిస్తున్నా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో గిరిజనులకు న్యాయం చేస్తున్నారు. 11కులాలను ప్రస్తుతం ఎస్టీలో చేర్చడం వల్ల వివిధ రంగాల్లో పోటీ తత్వం పెరుగుతుంది. కేంద్రం గిరిజన రిజర్వేషన్లను 12శాతానికి పెంచాలి. గిరిజన కులాలను అభివృద్ధి బాటలో నడిపేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం గొప్పది.
– పోరిక రాహుల్ నాయక్, సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు
ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి
పోడు భూముల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆమోదయోగ్యం. అయినా రెవెన్యూ శాఖ అధికారులతో పాటు ట్రైబల్ వెల్ఫేర్ అధికారులతో సమన్వయ పరిచి గిరిజన ప్రాంతాల్లో అర్హులకు పోడు పట్టాలు పంపిణీ చేయాలి. పోడు భూముల పరిష్కారానికి ఐటీడీఏ పరిధిలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
– పోడెం కృష్ణ ప్రసాద్, ఆదివాసీ నాయకుడు
రుణపడి ఉంటం
ఖానాపురం: పోడు భూములకు హక్కు పత్రాలతో పాటు రైతుబంధును ఇస్తామని అసెంబ్లీలో చెప్పిన సీఎం కేసీఆర్‌కు గిరిజన రైతులు జీవితాంతం రుణపడి ఉంటం. అటవీ అధికారుల నుంచి పోడు రైతులం అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నం. ఇక మా బాధలు తీరుతయ్. మా తండాల్నె 1500 ఎకరాలకు హక్కు పత్రాలు అందుతాయి. రైతుల బాధలు తెలిసిన ముఖ్య మంత్రి మనకు ఉండడం అదృష్టం. ఇకపై అడవులను నరకం. పోడుభూముల జోలికి వెళ్ల.
– బోడ బాలరాజు, బండమీది మామిడితండా(ఖానాపురం)
సీఎం కేసీఆర్ వెంటే మేము..
కురవి: సీఎం కేసీఆర్‌కు ముందు నుంచీ గిరిజనులపై ప్రేమే. గిరిజన బంధు అమలు చేస్తానని శాసనసభ సాక్షిగా చెప్పిండు. ఇప్పటికే తండాలు, గిరిజన గూడేలను గ్రామపంచాయతీలు గా చేసిండు. గతంల ఏ పార్టీ చేయలేని పని చేస్తాండు. ఆరు శాతం ఉన్న రిజర్వేషన్‌ను 10 శాతా నికి పెంచి కేంద్రం ఒప్పుకోకున్నా ధైర్యంగా ముందడుగు వేసిండు. ప్రతి విద్యార్థి గుండెల్లో చెరగని స్థానాన్ని దక్కించుకున్నడు. గిరిజనులు ఎప్పుడూ సీఎం కేసీఆర్ వెంటే ఉంటరు.
– గుగులోత్ రవినాయక్, విద్యార్థి ఉద్యమ నాయకుడు