రాయపోల్, మార్చి 16 : భద్రాచలంలో సీతారాముల కల్యాణానికి సమర్పించే గోటి తలంబ్రాల కార్యక్రమం ‘గోటి తలంబ్రాల దీక్ష’ రాయపోల్ మండల్ రాంసాగర్ గ్రామంలో ఘనంగా జరిగింది. రామాలయం కమిటీ ఆధ్వర్యంలో సోమవారం గోటి తలంబ్రాల దీక్ష కన్నులపండువగా సాగింది.
శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు భద్రాచలం నుండి గోటి తలంబ్రాలను తీసుకొచ్చారు. 108 కలశాలలో ఆ తలంబ్రాలను నింపి బాజా భజంత్రీల నడుమ.. గ్రామ పురవీధుల గుండా భగవన్నామ స్మరణతో భారీ ర్యాలీగా హనుమాన్ దేవాలయం నుండి రామాలయానికి చేరుకున్నారు.

అనంతరం భక్తుల చేత 3 గంటల పాటు రామనామ స్మరణ చేయించిన రామకోటి రామరాజు.. గోటితో వడ్లను ఓలిచి తలంబ్రాలుగా మార్చారు. భక్తులు అక్కడే ఆ గోటి తలంబ్రాలను ఆయనకు అందజేశారు. నాలుగోసారి సీతారాముల కల్యాణానికి 3 క్వింటాల గోటి తలంబ్రాలు తెలంగాణ రాష్ట్రం నుండి అందిస్తూన్నామని రామకోటి రామరాజు తెలిపారు.

తాము భద్రాచలం వెళ్లలేక పోయినా, మేము గోటితో ఒలిచిన తలంబ్రాలు రాములోరి కల్యాణానికి వెళ్లడం ఎన్నో జన్మల పుణ్యఫలం అని భక్తులు ఆనందాన్ని వెలిబుచ్చారు. తమకు ఇంతటి అదృష్టాన్ని కల్పించిన రామకోటి రామరాజును రామాలయం కమిటీ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రామాలయం కమిటీ సభ్యులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.
