‘ఓటు వజ్రాయుధం. మీ చేతిలో ఉండే బ్రహ్మాస్త్రం. మీ తలరాతను మారుస్తది. భవిష్యత్‌ను నిర్ణయిస్తది. అందుకే ఆషామాషీగా, అడ్డగోలుగా కాదు.. ఆలోచించి, రాయేదో.. రత్నమేదో తెలుసుకొని ఓటేయాలి.’ అని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సూచించారు. పెద్దపల్లి జడ్పీచైర్మన్, మంథని బీఆర్ఎస్ అభ్యర్థి పుట్టమధూకర్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మంథని ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. ‘ఈ రోజు మంథనిలో ఉన్న ప్రతి బీసీ బిడ్డకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న. బీసీ బిడ్డలకు అవకాశం వస్తలేదని పేపర్లు, టీవీల్లో చూస్తున్నం. ఇప్పుడు ఓ బీసీ బిడ్డకు అవకాశం వచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఐక్యతను చాటాలి. ప్రతి బలహీనవర్గాల ఇంట్లో చర్చ జరగాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బీసీ బిడ్డ మధును గెలిపిస్తే ప్రత్యేక నిధి కింద మంథనికి రూ.వెయ్యి కోట్లు కేటాయిస్త. రోజంతా మంథనిలో ఉంట. నియోజకవర్గ అవసరాల మీద సమీక్ష పెడుదాం. మీకేం అవసరమో.. మధుకు బాగా తెలుసు. ఆయన బాగా తిరుగుతున్న వ్యక్తి. అవసరమైతే వెయ్యి కోట్లు ఖర్చు చేసి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దే బాధ్యత నాది. ఇది నా మాటగా కార్యకర్తలు గ్రామగ్రామాన ప్రజలకు వివరించాలి.’ అని సూచించారు.
కరీంనగర్, నవంబర్7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/పెద్దపల్లి (నమస్తే తెలంగాణ): ఎన్నికలవేళ ఆగం కావొద్దని, ఆలోచించి ఓటు వేయాలని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఓటు తలరాతను మారుస్తుందని, ఐదేండ్ల భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని చెప్పారు. ఆషామాషీగా అలవోకగా, డబ్బులు ఇచ్చారని ఓటు వేయద్దని, విచక్షణతో ఆలోచించి ఓటు వినియోగించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ నాయకులు 24 గంటల కరెంట్, రైతుబంధు, ధరణి వద్దంటున్నారని, అవి కావాలో.. వద్దో.. మీరే ఆలోచించాలని కోరారు. నేను ఇక్కడ చెప్పే ముచ్చట్లన్నీ మీరు గ్రామాల్లోకి వెళ్లి చర్చ పెట్టాలని, నిజమేదో.. అబద్ధమేదో తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంథనిలో మంగళవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన హాజరయ్యారు. ఓవైపు ప్రజాస్వామ్యంలో ఓటు విలువను తెలియజెబుతూనే.. మరోవైపు ఆగమై ఓటు వేస్తే జరిగే పరిణామాలను ప్రజలకు పూస గుచ్చినట్లుగా వివరించారు. పుట్ట మధూకర్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పీవీ హయాంలో మొదలు పెట్టి పక్కకు పెట్టిన 66 గ్రామాలను కలిపే 108 కిలో మీటర్ల రింగు రోడ్డు, 20 బ్రిడ్జిలను పట్టుబట్టి పూర్తి చేయించాడని గుర్తు చేశారు. అట్లాంటి మధూకర్‌ను గత ఎన్నికల్లో ఓడగొట్టి, ‘మీరు ఆయన పట్టు బడితిరి’ అంటూ చలోక్తి విసిరారు.
నియోజకవర్గ ప్రజలు మధును గెలిపిస్తే తాను ఒక కానుక ఇస్తానని, మంథని అభివృద్ధి కోసం రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తానని ప్రకటించారు. తాను ముఖ్యమంత్రిగా.. ఆయన ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలందరితో ఒకరోజు ఉంటానని, ఈ ప్రాంత సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మంథనిలో ఎమ్మెల్యేగా పుట్ట మధూకర్‌ను గెలిపించి ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామంటున్న కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలుపాలని కోరారు. ఇకడ పుట్టి పెరిగిన వ్యక్తిగా ప్రజల కష్టాలు పుట్ట మధుకు బాగా తెలుసన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడినా తన దృష్టికి తీసుకొచ్చాడని, పంకెన, పలిమెల, మోదేడు గ్రామాల అభివృద్ధికి పట్టు బట్టి నిధులను తీసుకువచ్చాడని గుర్తుచేశారు. ఇక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పటికే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారని, ఆయన తండ్రి కూడా ఎమ్మెల్యేగా.. స్పీకర్‌గా పనిచేశారని, అయినా మంథని నియోజకవర్గ ప్రజల కష్టాలను తీర్చింది, కన్నీళ్లను తుడించిది, బాధలను దూరం చేసింది మాత్రం మధూకరేనని స్పష్టం చేశారు. ఈ మట్టిలో పుట్టిన బిడ్డ ఎమ్మెల్యే అయినంకనే ఈ ప్రాంతం వెలుగులు చూసిందన్నారు. ముడ్డికి మన్నంటి పనిజేసేటోడే సిపాయని, అందుబాటులో ఉండి పనిచేసేటోడే పుట్ట మధూకర్ అని చమత్కరించారు.
‘టిక్‌టాక్‌గా తయారై హైదరాబాద్‌కు పరిమితమయ్యే ఎమ్మెల్యే కావాలా..? మీ కోసం నిత్యం పనిచేసే మధు కావాలో? ప్రజలు ఆలోచించాలని సూచించారు. మధు ఎమ్మెల్యేగా గెలిచినంక నెలలోనే మంథని మండలం గుంజపడుగు, బోర్లగూడెం గ్రామాలు కేంద్రంగా కొత్త మండలాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల్లో గెలిచి కనబడకుండా పోయే నాయకులు కాదు, గెలిచినా.. ఓడినా మీ మధ్యనే ఉండే మధును భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ‘మన పార్టీ ప్రజా ప్రతినిధులను నాయకులను కాంగ్రెస్ పార్టీ వాళ్లు సంతలో పశువులను కొన్నట్టు కొంటున్నరని పుట్ట మధు అధైర్య పడుతున్నడు. పుట్ట మధు రంది పడకు. పోయేటోడు పోతడు.. ఉండేటోడు ఉంటడు. అది వట్టి ముచ్చటకాదు. వాళ్లు పోతే ఆ ఊళ్లెనే రియాక్షన్ ఉంటది. వ్యతిరేకత వస్తది. పోయినసారి జరిగిన నష్టం వాళ్లకు తెలిసింది. నువ్వు ఉంటే ఎంత లాభం ఉంటదో వాళ్లకు తెలుసు. ఎవరెన్ని కథలు పడ్డా. గ్యారెంటీగా మళ్లా బీఆర్ఎస్ సర్కారే వస్తది’ అన్నారు. ఏతా వాతా ఎటు చూసుకున్నా మంథని ఎమ్మెల్యేగా పుట్ట మధూకర్ గెలిస్తేనే మంథని నియోజకవర్గం అభివృద్ధి అవుతుందని చెప్పారు. ‘ఎందుకంటే నాతో సహా రాష్ట్ర కేబినెట్ మొత్తం తెలిసినోడు ఆయన ఏ పని ఉన్నా చేసుకొని వస్తడు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తడు. రాష్ట్రంల ఎట్లా బీఆర్ఎస్ సర్కారే వస్తది’ అని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ కూడా బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని, మరోసారి పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేసి మోసపోవద్దని సూచించారు. సభలో ఎంపీ బోర్లకుంట వెంకటేశ్, భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ పాల్గొన్నారు.
నేను బలహీన వర్గాల బిడ్డను. సీఎం కేసీఆర్ సహకారంతో ఇంతటి స్థాయికి చేరుకున్న. మూడోసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన్రు. గోదావరి సాక్షిగా చెబుతున్నా.. నేను మీ మట్టిలో పుట్టిన బిడ్డను. ఈ మట్టిలో పెరిగిన. ఇక్కడే మరణిస్త. ఇక్కడ గొప్పగొప్ప నాయకులు పాలించిన్రు. కానీ ఏమీ చేయలె. ప్రాజెక్టులు కడతమని చెప్పి పైపులు తెచ్చి రోడ్ల మీద వేసిన్రు. మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇచ్చి జేబులు నింపుకున్నరు. వానకాలం పెద్దంపేట వాగు పొంగితే కడుపుతో ఉన్న మహిళలు మంథనికి వచ్చే పరిస్థితి లేకుంటే. ఇక్కడే పసిద్ధి అయిటోళ్లు. పేగును కట్ చేసేందుకు కత్తెర లేకుండే. రాళ్లతోటి పేగులు కట్ చేసే పరిస్థితి ఉండే. ఇది కాంగ్రెస్సోళ్ల పాలన. నన్ను గతంలో ఎమ్మెల్యేగా గెలిపిస్తే రూ. 25 కోట్లతో ఓడేడు బ్రిడ్జిని నిర్మించిన. మంథని నుంచి పెద్దంపేటకు రోడ్డు వేయించిన. అంత మంచిగనే ఉన్నది. ఇప్పుడు ఎన్నిలప్పుడు నియోజకవర్గానికి వస్తున్న ఎమ్మెల్యే ఇక్కడి పైసలు పెట్టి నాయకులను కొంటున్నడు. కానీ, సీఎం సారు జెరా మాకు కొన్ని పనులు జేసిపెట్టాలి. నియోజకవర్గం నుంచి భూపాలపల్లి జిల్లాకు పోయేందుకు రోడ్లు కావాలి. మహదేవ్పూర్ ప్రాంతానికి చెందిన గిరిజన బిడ్డలు మాడా పరిధిలో ఉన్నామా? లేదా ఐటీడీఏ కింద ఉన్నామో తెలియక ఆగమైతున్నరు. వారికి దయతలిచి ఐటీడీఏ ఏర్పాటు చేయాలి. ఇప్పటికే రెండు మూడు మండలాలు ఏర్పాటు చేసిన్రు. ఇప్పుడు మంథని మండలంలోని గుంజపడుగు, మహాముత్తారం మండలంలోని బోర్నపల్లిని మండలాలు జేయాలి. మంథనిలో రెండు బీసీ గురుకులాలు ఏర్పాటు చేయాలి. గోదావరి తీరంలోని సుందిళ్ల, అన్నారం బరాజ్‌ల ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలి.
కరీంనగర్, నవంబర్7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి/పెద్దపల్లి) : మంథనిలో బీఆర్ఎస్ అభ్యర్థి, జడ్పీ చైర్మన్ పుట్ట మధు అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాదసభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అధినేత కేసీఆర్ హాజరై సభకు అశేషంగా వచ్చిన జనాన్ని చూసి సుదీర్ఘ ప్రసంగం చేశారు. ప్రతిపక్ష పార్టీల తీరును ఎండగడుతూ.. స్వరాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ప్రసంగించారు. మంథనిలో బీసీ బిడ్డ పుట్టమధును లక్ష మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ముందు అనేక విషయాలను ప్రజల ముందు ఉంచారు. కాంగ్రెస్ నాయకులు రైతుబంధు దుబారా అంటున్నారు? మనం ఇస్తున్న రైతు బంధు దుబారా అంటారా? దానిని కొనసాగించాలా..? వద్దా..? అంటూ ప్రశ్నించగా.. సభికులంతా చేతులెత్తి కొనసాగించాంటూ నినాదాలు చేశారు. సభ మొత్తం చేతులెత్తడంతో.. ‘కెమెరాలు అటువైపు తిప్పండి’ అని కేసీఆర్ చెప్పడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. అలాగే 24 గంటల కరెంటు అవసరం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంటున్నారు.
అవసరం ఉన్నదా..? లేదా..? చెప్పాలని ప్రశ్నించగా.. మరోసారి రైతులంతా ఉండాలంటూ నినాదాలు చేశారు. రైతుకు తన భూమిపై హక్కు కల్పించాలన్న లక్ష్యంతో చేపట్టిన ధరణి కార్యక్రమాన్ని రద్దు చేసామంటున్నారు? ఉండాలా..? వద్దా..? చెప్పాలని ప్రశ్నిచడంతో కొనసాగించాలంటూ నినాదాలు చేసారు. రాహుల్‌కు ఎద్దెర్కనా..? ఎవుసమెర్కనా..? అని అడుగడంతో సభలో మరోసారి నవ్వులు విరిశాయి. ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచన చేయాలని, అభ్యర్థుల గుణగణాలను చూడాలని పిలుపునిచ్చారు. ప్రధానంగా ఈ ఎన్నికల్లో రాయి ఎవరో..? రత్నమెఎవరో.. చూసి ఓటు వినియోగించుకోవాలని, అభ్యర్థితోపాటు ఆ పార్టీ చరిత్రను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. మంథని నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల నుంచి ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ఊరూవాడా ఒక్కటై కదలి వచ్చాయి. ప్రతి పల్లె నుంచి సభాస్థలి వరకు.. దారులన్నీ గులాబీ మయమయ్యాయి. సీఎం కేసీఆర్ రాగానే.. ‘కేసీఆర్ జిందాబాద్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.