గీసుగొండ, అక్టోబర్ 14 : దసరా పండుగ వేళ కొండా, రేవూరి వర్గీయుల గొడవతో ధర్మారం సహా గీసుగొండ మండలంలో ఒక్కసారిగా హైటెన్షన్ నెలకొనడంతో ఆ ప్రాంతం పోలీ సు పహారాలోకి వెళ్లింది. ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఫొటో లేదని ఇరువర్గాలు బాహాబాహికి దిగి రచ్చరచ్చ చేయడంతో స్థానికంగా అలజడి రేగడంతో బందోబస్తు కట్టుదిట్టం చేశారు.
తన వర్గీయులపై కేసులు నమోదు చేయడమే గాక పోలీసులు కొట్టారని ఆరోపిస్తూ ఆదివారం సాయంత్రం గీసుగొండ పోలీస్‌స్టేషన్‌కు మంత్రి సురేఖ వెళ్లి పోలీసులతో వాగ్వాదానికి దిగడం, తన వర్గీయులతో పాటు రేవూరి వర్గీయులపై కేసు నమోదు చేయాలని పట్టుబట్టడంతో సీపీ చర్య లు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో మంత్రి అక్కడినుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈమేరకు ఆదివారం రాత్రి నుంచే ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో ధర్మారంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
గ్రామంలో పోలీసులు పికెటింగ్ పాయింట్ పెట్టి గస్తీ కాస్తున్నారు. కొత్త వారిని రానివ్వకుండా బయటకు పంపుతున్నారు. డీసీసీ, ఏసీపీ తిరుపతి పో లీస్ష్టేషన్లో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఎలాంటి గొడవలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తున్నారు. ప్రజలు రోడ్లు మీద గుంపులు గుంపులుగా ఉండకూడదని పోలీసులు సూచిస్తున్నారు.
గొడవకు సంబంధించి ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు సీఐ మహేందర్ తెలిపారు. కొండా వర్గానికి చెందిన బండి రాజ్‌కుమార్, ముస్కు సురేశ్, కూస రాజ్‌కుమార్, శివప్రసాద్, ముస్కు రాజ్‌కుమార్, రాజు, మహేశ్వర్, వంశీలపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విచారణ అనంతరం సోమవారం రేవూరి వర్గానికి చెందిన పిట్టల అనిల్‌పై కేసు నమోదు చేశామని తెలిపారు.
ఇరువర్గాల దాడిలో గాయపడ్డ పిట్టల అనిల్‌ను పరామర్శించేందుకు జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్రెడ్డి వెళ్తున్న విషయం తెలుసుకున్న పోలీసు లు సీపీ అంబర్ కిశోర్ఝాకు సమాచారం చేరవేశారు. సీపీ వా రితో ఫోన్లో మాట్లాడి ఇప్పుడే గ్రామానికి వెళ్లొద్దని మళ్లీ గొడవలు జరిగే ఆస్కారం ఉందని విజ్ఞప్తి చేయడంతో వారు పరామర్శకు రాలేదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.