ములుగు, జూన్14 (నమస్తే తెలంగాణ) : పోలీసులను లక్ష్యంగా చేసుకొని అడవుల్లో మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందు పాతర్ల కారణంగా అమాయక ప్రజలు బలవుతున్నారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పౌర హక్కుల సంఘం నాయకులు వారి చర్యలను ఖండించాలని ములుగు ఎస్పీపీ శబరీష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆత్మ రక్షణ కోసం మందు పాతర్లు అమర్చుతున్నామని చెప్పుకునే మావోయిస్టులు తమ తప్పును కప్పి పుచ్చుకునేందుకు పోలీసుల పైకి తప్పును నెడుతున్నారని అన్నారు. పౌర హక్కుల సంఘం నాయకులు ఘటన జరిగిన ప్రదేశాలను సందర్శించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి నిజనిజాలను నిర్దారించుకోవాలని సూచించారు. తమ ఉనికిని చాటుకునేందుకు సాధారణ ప్రజలు, యాత్రికులు, భక్తులను సైతం టార్గెట్ చేస్తూ కాలి బాటల వెంట మందు పాతరలు అమర్చి వారి ప్రాణాలు బలిగొంటున్నారన్నారు.
మావోయిస్టులపై ఏదైనా జరిగినప్పుడు స్పందించే పౌర హక్కుల సంఘం నాయకులు సామాన్య ప్రజలకు అన్యాయం జరిగితే స్పందించకపోవడం బాధాకరమన్నారు. కర్రె గుట్టలను గెర్రిల్లా బేస్ క్యాంపులుగా ఏర్పాటు చేసుకొని సామాన్య ప్రజలను టార్గెట్ చేస్తూ వారిని అడవుల్లోకి రానివ్వకుండా ఉండాలనే ఏకైక లక్ష్యంతో మావోయిస్టులు మందు పాతర్లను అమర్చి భయాందోళనలు కలిగిస్తున్నారని తెలిపారు. ఆదివాసీ ప్రజలు ఈ విషయాన్ని గమనించి జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రజల ప్రాణాలు రక్షించడమే ధ్యేయంగా అటవీ ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేసి మందు పాతరలను బాంబు స్వాడ్ బృందాలతో నిర్వీర్యం చేస్తున్నామన్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ధైర్యంగా ఉండాలని, గ్రామాలలో ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు.