ఏటూరు నాగారం : తరగతి గదుల్లో విద్యార్థులకు విద్యాబోధనతోపాటు డ్రగ్స్ పై అవగాహన కల్పించాలని స్థానిక సీఐ శ్రీనివాస్, ఎస్ఐ తాజుద్దీన్ సూచించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇస్తున్నారు. గురువారం శిక్షణ కార్యక్రమానికి హాజరైన వారు మాట్లాడారు. యువత డ్రగ్స్‌కు బానిసలై మత్తులో తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న విధానాన్ని ఉపాధ్యాయులకు డిజిటల్ ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
పాఠశాల పునఃప్రారంభం నుంచి విద్యార్థులకు ఈ అంశంపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులకు ప్రత్యేక గౌరవస్థానం విద్యార్థుల్లో ఉందని అందుకే తరగతి గదిలో ఉపాధ్యాయులు బోధించే ప్రతి అంశాన్ని విద్యార్థులు నాటకపోతాయని పేర్కొన్నారు. అవగాహన కల్పించడం ద్వారా వారి భవిష్యత్తును కాపాడినట్లు అవుతుందని, ప్రతి ఒక్కరు మత్తు పదార్థాలను తరిమికొట్టేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ మల్లయ్య మండల పరిధిలోని పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, రిసోర్సు పర్సన్లు పాల్గొన్నారు.