రుణమాఫీ సంబురాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లా అంతటా కార్యక్రమాలు పండుగలా జరిగాయి. రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న రాష్ట్ర సర్కారుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేశారు. క్రాప్‌లోన్ మాఫీ అయినట్లు సెల్ఫోన్లకు వస్తున్న మెసేజ్‌లను చూసి అన్నదాతలు మురిసిపోతున్నారు. ఈ సందర్భంగా పలుచోట్ల నారుమడులు, పంట పొలాల్లో కూలీలతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు సంబురాల్లో పాల్గొన్నారు. ములుగు జిల్లాకేంద్రంలోని తోపుకుంట వద్ద బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్ ఆధ్వర్యంలో నారుమడిలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. అనంతరం రైతులు, కూలీలకు స్వీట్లు తినిపించి ఆనందాన్ని పంచుకున్నారు. ఆ తర్వాత వారితో మమేకమై వరి నాట్లు వేశారు. అలాగే కన్నాయిగూడెంలోని రైతువేదిక వద్ద సంబురాల్లో ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ పల్లా బుచ్చయ్య పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం శివారు పంట పొలాల మీదుగా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీతో ర్యాలీగా వెళ్తూ ఉత్సాహంగా సంబురాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత నారుమడి వద్ద సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట, చెన్నారావుపేట, నర్సంపేట, గీసుగొండ, హనుమకొండ జిల్లాలో ఐనవోలు మండలాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు క్షీరాభిషేకం చేశారు.
– నమస్తే నెట్వర్క్, ఆగస్టు 4
కాజీపేట, ఆగస్టు 4 : సీఎం కేసీఆర్ రైతుల రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకొని అమలుచేస్తుండడం అభినందనీయం. గతంలో ఇచ్చిన మాట ప్రకారం దశలవారీగా రైతులకు రుణాలు మాఫీ చేస్తున్నరు. కరోనా వల్ల కొంత ఆలస్యమైనా రైతుల ఇబ్బందులు తీర్చేందుకు సీఎం కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారు.రుణమాఫీని తిరిగి ప్రారంభించి, నెలన్నరలో పూర్తిగా చెల్లిస్తామని సీఎం కేసీఆర్ చెప్పడం చాలా సంతోషం.
– పాలగుడుల రామస్వామి, ఆర్బీఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు, కాజీపేట
నర్సంపేట రూరల్, ఆగస్టు 4 : సీఎం కేసీఆర్ సార్‌కు రైతుల కష్టాలు బాగా తెలుసు. అందుకే అన్నదాతకు ఏ కష్టం రాకుండా అండగా ఉంటున్నడు. రైతు బాగు కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పక్కాగా అమలుచేస్తున్నడు. రుణమాఫీ పూర్తి చేయాలని నిర్ణయించడం చాలా సంతోషంగా ఉంది. ఇచ్చిన మాటకు కట్టుబడి క్రాప్‌లోన్ మాఫీ చేసినందుకు ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటం. రైతుబంధు, రైతుబీమా పథకాలు దేశంలో మరెక్కడా లేవు. వ్యవసాయం దండుగ అన్న నోళ్లను మూయించి వ్యవసాయం పండుగ చేసిండు.
– జినుకల నర్సయ్య, రైతు, మాధన్నపేట
నడికూడ, ఆగస్టు 4 : సీఎం కేసీఆర్ రైతుల పట్ల చూపుతున్న ఆదరణకు ధన్యులం. రుణమాఫీ చేస్తుండడంతో కొండంత ధైర్యం వచ్చింది. డబ్బులు కూడా జమవుతుండడంతో రైతులు మరింత ఉత్సాహంగా పంటలు వేస్తున్నారు. అప్పట్లో అకాల వర్షాలతో పంట నష్టపోయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకున్నది. చేతికొచ్చిన పంట నీటిపాలై ఇబ్బందులు పడిన చాలామంది రైతులకు భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్‌కు రైతుల కష్టాలు తెలుసు కాబట్టే ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడొద్దని రుణమాఫీ చేస్తున్నారు. రైతులకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది. సీఎం సారుకు మా కృతజ్ఞతలు.
– గోళ్ల రాజు, నడికూడ రైతు
శాయంపేట, ఆగస్టు 4 : రైతు రుణమాఫీని పూర్తి చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకొని అమలు చేస్తుండడంతో రైతులందరూ సంతోషంగా ఉన్నరు. గతంలో క్రాప్‌లోన్ తీసుకున్న నాకు వర్తించింది. 25శాతం మాఫీ అయింది. రెన్యూవల్ చేసుకుంటూ వస్తున్నా. ఇప్పుడు సీఎం కేసీఆర్ పూర్తిగా మాఫీ చేస్తున్నారు. రైతుల విషయంలో ఎంతో ఉదారంగా పథకాలను అమలుచేస్తూ అండగా ఉంటున్నారు. రైతుల కష్టసుఖాలు తెలిసిన మనసున్న మారాజు సీఎం కేసీఆర్. రైతుల బాధలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం రైతుల అదృష్టం.
– అమ్మ చంద్రమౌళి, పెద్దకోడెపాక