మహబూబాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ)/ మడికొండ : బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఉమ్మడి జిల్లాలోని రెండు నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు మానుకోట శివారులోని శనిగపురంలో నిర్వహించే మహబూబాబాద్ నియోజకవర్గ సభ, మధ్యాహ్నం 3గంటలకు నగర శివారులోని భట్టుపల్లిలో నిర్వహించే వర్ధన్నపేట నియోజకవర్గ సభకు హాజరవుతారు. ఈ మేరకు ఆయాచోట్ల హెలిప్యాడ్లు, సభావేదికలను సిద్ధం చేశారు. ఆయా చోట్ల ఏర్పాట్లను మంత్రి సత్యవతి రాథోడ్, చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, అరూరి రమేశ్, మేయర్ గుండు సుధారాణి పరిశీలించారు. మానుకోట పట్టణంతో పాటు, వరంగల్ నగర శివారు అంతటా గులాబీమయమైంది. సభలను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే సన్నాహక సమావేశాలు నిర్వహించి భారీగా జన సమీకరణకు ఏర్పాట్లు చేశాయి. బతుకమ్మలు, బోనాలు, వివిధ కళారూపాలు, డప్పులు, కోలాట నృత్యాలతో సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ సభ అనంతరం మధ్యాహ్నం 2గంటలకు మానుకోటకు సీ ఎం కేసీఆర్ చేరుకుంటారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ, బీఆర్ఎస్ మానుకోట జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ సీఎం సభ కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలు, ఒక మున్సిపాలిటీ నుంచి 70 వేలకు పైగా ప్రజలను సభకు తరలించే ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది జనవరి 12న మహబూబాబాద్ జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్, సమీకృత కలెక్టరేట్‌ను, బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. తాజాగా ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా మానుకోట నియోజకవర్గ కేంద్రానికి వస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో నయా జోష్ నెలకొంది. సభాస్థలం, హెలిప్యాడ్ ఏర్పాట్లను గురువారం మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్‌రెడ్డి పరిశీలించారు. 500 మందితో పోలీస్ బందోబస్తు చేపడుతున్నారు. నెల్లికుదురు మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చే వాహనాల కోసం శనిగపురం వద్ద, ఇనుగుర్తి, కేసముద్రం, గూడూరు, మహబూబాబాద్ రూరల్ మండలాల నుంచి వచ్చే వాహనాల కోసం ఫాతిమా సూల్ సమీపంలో, బాలాజీ గార్డెన్ వద్ద పారింగ్ ఏర్పాట్లు చేశారు.-
గ్రేటర్ వరంగల్ 44వ డివిజన్ భట్టుపల్లి శివారులో నిర్వహించే వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు సుమారు 8వేల మందికిపైగా తరలివచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. సభాస్థలం, పార్కింగ్, హెలిప్యాడ్ ఏర్పాట్లను గురువారం బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, మేయర్ గుండు సుధారాణి, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు పరిశీలించారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు కలుగకుండా నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. బారికేడ్లు పెట్టారు. 20 ఎకారాల్లో సభాస్థలం, 100 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. తాగునీరు, మజ్జిగను పంపిణీ చేయనున్నారు. పోలీసులు హెలిప్యాడ్, సభావేదిక పరిసరాలను డాగ్‌స్కాడ్, మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేశారు.