ఆత్మకూరు, ఏప్రిల్ 10 : బీఆర్ఎస్ రజతోత్సవ సభతో కాంగ్రెస్ పతనం ఖాయమని, సభను అడ్డుకునేందుకు ఎవరెన్ని కుట్రలు చేసినా ఆగదని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న గులాబీ పండుగకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్‌లోని జీఆర్ఎస్ గార్డెన్లో ఆత్మకూరు, దామెర మండలాల బీఆర్ఎస్ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మహాసభ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
అనంతరం మాట్లాడుతూ 27న ప్రతి గ్రామంలో పండుగలా జెండా ఆవిష్కరణ నిర్వహించి సభకు రావాలన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత శ్రేణులపై ఉందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. బీఆర్ఎస్లో పదవులు అనుభవించి ఇతర పార్టీల్లో చేరిన వారిని ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ తీసుకునేది లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత పార్టీ సీనియర్ నాయకులు రాజకీయాల్లో యువతను ప్రోత్సహించాలన్నారు. అధికార పార్టీ నాయకులు పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారని, ఎవరికీ భయపడేది లేదన్నారు.
దేశంలోని ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. చావు నోట్లో తల పెట్టి కేసీఆర్ తెలంగాణ సాధిస్తే నేడు కాంగ్రెస్ నాయకులు పదవులు అనుభవిస్తున్నారన్నారు. కేసీఆర్, కేటీఆర్ సహకారంతో దేశానికే తలమానికంగా కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో వస్త్ర పరిశ్రమను స్థాపించుకున్నామన్నారు. ఇప్పుడు అందులో పని చేస్తున్న కార్మికులను తొలగించి కాంగ్రెస్ కార్యకర్తలను పెడుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ గళం.. బలం.. బలగం బీఆర్ఎస్ ఒక్కటేనని, సభకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని చల్లా పేర్కొన్నారు. సమావేశంలో రెండు మండలాల మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.