హనుమకొండ, జనవరి 11: ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్నది. కార్మికుల హకులు కాలరాసేందుకే నూతన చట్టాలు తెచ్చింది. చర్చ లేకుండానే పార్లమెంటులో ఆమోదించింది. నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయబోమని తెలంగాణ సరారు తీర్మానం చేయాలి. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి తన వైఖరి చెప్పాలి’ అని ప్రణాళికా సంఘం మాజీ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఉద్యోగ, కార్మిక హకుల సాధన కోసం నిర్వహించిన జిల్లా స్థాయి సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మలిదశ తెలంగాణ ఉద్యమం విత్తనం వరంగల్‌లోనే పడిందని, అలాగే కేంద్రం తీసుకొచ్చిన నూతన కార్మిక చట్టాలు రద్దు చేసే వరకు జరిగే ఉద్యమం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందన్నారు.
ఎన్నో పోరాటాలతో సాధించుకున్న 49 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులకు అన్యాయం చేస్తున్నదన్నారు. ఢిల్లీని రైతులు దిగ్బంధం చేయడంతో వ్యవసాయ కార్మికులకు క్షమాపణ చెప్పి పార్లమెంటులో ఆమోదించిన బిల్లులను కేంద్రం ఏ విధంగా రద్దు చేసుకున్నదో.. అదేవిధంగా ఈ కార్మిక చట్టాలను సైతం వెనకి తీసుకునే వరకు పోరాటం చేయాలన్నారు. రాజ్యాంగ హకులను రక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకొని సమాజంలో వ్యత్యాసాలను పెంచేలా ధనవంతులు మరింత ధనవంతులుగా, పేదవారు మరింత పేదవారుగా జీవించే విధానాన్ని ప్రోత్సహించడం చాలా బాధాకరమన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత 10ఏండ్లలో పార్లమెంటులో ఎలాంటి చర్చ లేకుండానే అనేక బిల్లులు, చట్టాలను ఏకపక్షంగా ఆమోదించిందని ఆరోపించారు.
ఈ విధానం ప్రజాస్వామ్యానికి హానికరమన్నారు. లేబర్ కోడ్లను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వ్యతిరేకిస్తున్నా, సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటి వరకు తన వైఖరి చెప్పలేదని, వెంటనే చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మె సందర్భంగా వరంగల్‌లో పెద్దఎత్తున్ననిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఓరుగల్లు నుంచే పోరాటం ప్రారంభిద్దామని పిలుపునిచ్చారు.
దశాబ్దాల పోరాటంతో, రక్తం చిందించి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (వ్యాపారం సులభతరం చేయడం) అనే ముసుగులో, కార్మికుల జీవితాలను ఈజ్ ఆఫ్ ఫైరింగ్ (సులభంగా తీసివేయడం)గా మార్చేస్తోందని ఆరోపించారు. వచ్చేనెల 12న చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సదస్సులో పది రకాల తీర్మానాలు ఆమోదించారు. బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ మాట్లాడుతూ.. నాలుగు నూతన కార్మిక చట్టాల రద్దు కోసం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇప్పటికే రాష్ట్ర స్థాయి కార్మికుల కోసం సదస్సు నిర్వహించారని,
పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కార్మికుల పక్షాన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల రిటైర్డ్ బెనిఫిట్స్ సైతం చెల్లించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, దీంతో ఉద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ నాయిని రవి, జిల్లా కో కన్వీనర్ మల్లేశం, పోస్టల్ ఉద్యోగ సంఘాల నాయకుడు వెంకటేశ్వర్లు, విరమణ రైల్వే ఉద్యోగుల సంఘం నాయకుడు యాదవరెడ్డి, బీఎస్ఎన్ఎల్ కార్మిక సంఘం నాయకుడు సంపత్ రావు, వివిధ కార్మిక సంఘాల నాయకులు తేలు సారంగపాణి, కాటారపు రాజు, మంజులాయువరాజు, ఈసంపల్లి సంజీవ, జయరాం, బాబు, ధర్మరాజు, రఘు, స్వామి, భిక్షపతి, మహేందర్, రమేశ్, మంజుల, రమ, రాజు, సమ్మయ్య, గిరి, శ్రీధర్, శివరాజ్, చంద్రమోహన్, పరశురాములు, తిరుపతి, గోపాల్, రవి, కార్మిక నాయకులు పాల్గొన్నారు.