Bhudan Lands | ఖమ్మం నగరంలోని భూదాన్ భూముల్లోని పేదల ఇండ్ల కూల్చివేతల తర్వాత అక్కడి డ్రోన్ విజువల్స్ ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. మంగళవారం నాడు భారీ పోలీసు బందోబస్తు నడుమ బుల్డోజర్లతో నేలమట్టం చేసిన అనంతరం ఇండ్ల దృశ్యాలు ఈ విజువల్స్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు గుడిసెలు, పక్కా ఇండ్లతో కిటకిటలాడిన ఆ కాలనీ ఇప్పుడు పూర్తిగా మట్టిగుట్టలు, కూలిన గోడలు, శిథిలాలతో కనిపిస్తోంది.
ఖమ్మం నగరంలోని భూదాన్ భూముల్లో ఇండ్లు కట్టుకొని ఉంటున్న పేదలపై కాంగ్రెస్ ప్రభుత్వం మంగళవారం మబ్బులనే బుల్డోజర్లతో దండయాత్ర చేసింది. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో నిరుపేదల ఇండ్లను నేలమట్టం చేసింది. ఖమ్మం అర్బన్ పరిధి వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలో ఉన్న భూదాన్ భూముల్లో 12 ఏండ్లుగా ఖమ్మంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన నిరుపేదలు గుడిసెలు, కొంతమంది పక్కా ఇండ్లు కట్టుకొని నివాసముంటున్నారు. గడిచిన పదేండ్లలో వెలుగుమట్ల ప్రాంతం ఓ పెద్దకాలనీగా మారింది. కాలనీ ప్రజలంతా ఒక్కటై తమకు పట్టాలు మంజూరు చేయాలని గత ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించారు. కేసీఆర్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నించినా భూదాన్ భూముల వివాదం కోర్టులో ఉండటంతో నాడు ఇవ్వడం సాధ్యం కాలేదు. ఈ క్రమంలో స్థానికంగా భూములు కలిగిన కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ భూముల్లో ఉంటున్న పేదలను అక్కడ లేకుండా చేయాలనే ప్రయత్నాలు సాగిస్తూ వచ్చారు.
ఖమ్మం వెలుగుమట్లలో పూర్తిగా నేలమట్టమైన ఇండ్లు
Drone footage pic.twitter.com/Ue0dkqpmFF
— Telugu Scribe (@TeluguScribe) February 27, 2026
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. వారికి అనుకూల అమాత్యుడూ అదే పార్టీలో ఉండటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కలిసొచ్చిన అంశంగా మారింది. నిరుడు కూడా అమాత్యుడి సాయంతో ఓ దఫా రెవెన్యూ, పోలీసులను ప్రయోగించి కాలనీలోని పలు ఇండ్లను కూల్చివేయించారు. అక్కడ నివసించే బడుగుబలహీన వర్గాలవారి ఇండ్లను పూర్తిగా నేలమట్టం చేస్తేనే తమ భూముల ధరలు పెరుగుతాయనే కుటిలబుద్ధితో కొందరి పేర్లతో కోర్టుల్లో కేసులు సైతం వేయించారు. అక్కడ ఇండ్లు కట్టుకున్న పేదలకు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేయించారు. అయినా ఖాళీ చేయకపోవడంతో ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చి వేలాది మంది పోలీసుల బందోబస్తు నడుమ పేదల ఇండ్లను మంగళవారం నేలమట్టం చేయించారు.