భూమి కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేయించుకుని, పన్నులు చెల్లిస్తూ, పట్టాదారు పాస్‌బుక్ పొందిన వ్యక్తికి ఒక్కసారిగా తన భూమి ‘నిషేధిత జాబితా’లో ఉన్నదని తెలిస్తే ఏమైపోతాడు? తాను ఏ తప్పూ చేయకపోయినా ఆస్తిని అమ్ముకోలేని, బ్యాంకు రుణం పొందలేని పరిస్థితి ఎదురైతే ఎలా ఉంటుంది? ఒక్కమాటలో చెప్పాలంటే కాళ్ల కింద నేల హఠాత్తుగా కుంగిపోయినట్టు ఉంటుంది. తెలంగాణలో సెక్షన్ 22ఏ అమల్లో నెలకొన్న గందరగోళం సామాన్య ప్రజలకు ఇలాంటి చేదు అనుభవాలనే మిగులుస్తున్నది.
రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-ఏ కింద ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, ఇతర రక్షిత లేదా వివాదాస్పద భూములను అక్రమంగా విక్రయించకుండా అడ్డుకోవడం అవసరమే. చట్టంలో ఏమున్నదనేది కాదు, దాని అమల్లోని సమన్వయ రాహిత్యం, రికార్డుల్లోని తప్పులు, అధికార యంత్రాంగం అనుసరిస్తున్న హడావుడి విధానం అసలు సమస్య. అవకతవక నిర్ణయాలతో సామాన్య జనాలకు నరకం చూపిస్తున్నది అవివేక, అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం.
22-ఏ షాక్‌తో రియల్ రంగం ఒక్కసారిగా కుంగిపోయింది. అమ్మేవారికీ, కొనేవారికీ కండ్లు బైర్లు కమ్మే పరిస్థితి వచ్చింది. బిడ్డ పెండ్లికో, ఆరోగ్యం బాగు చేసుకొనేందుకే అత్యవసరంగా అమ్ముకోలేని దైన్యం ఏర్పడింది. ‘నా ఇల్లు నాదేనా?’ అనే అభద్రతలో కొట్టుమిట్టాడుతున్నారు సామాన్యులు. నిషేధిత జాబితాలో తమ ఇల్లు లేదా జాగ ఉన్నదీ లేనిదీ రిజిస్ట్రేషన్‌కు వెళ్లేదాకా ఎవరికీ తెలియని భయానక హిచ్ కాక్ సస్పెన్స్. ఎప్పుడు ఎవరి వంతో తెలియని రష్యన్ రౌలెట్ గేమ్‌లా తయారయ్యాయి రియల్ ఎస్టేట్ లావాదేవీలు.
‘ధరణి’ కన్నా మెరుగైన ‘భూ భారతి’ తెస్తున్నాం అంటూ కాంగ్రెస్ పాలకులు ఆడుతున్న నాటకం బండారం బట్టబయలైంది. అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ‘నక్కలు బొక్కలు వెదుకును’ అన్నట్టుగా భూదాహంతో వెంపర్లాడటం తప్ప ప్రజల బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదు సీఎం రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ. లగచర్ల, కంచ భూముల విషయంలో ఈ ధోరణిని మనం చూశాం. న్యాయస్థానాలు సర్కార్‌కు పలు సందర్భాల్లో తలంటు పోశాయి కూడా. నిషేధిత జాబితా అంటూ ఉంటే దానిని వెబ్సైట్లో ఎందుకు పెట్టలేదని హైకోర్టు సర్కార్‌ను నిలదీయడం గమనార్హం. ప్రజలకు అత్యవసరమైన కీలక సమాచారాన్ని అందుబాటులో ఉంచకపోవడం ప్రభుత్వ ఉద్దేశాలను అనుమానాస్పదం చేస్తున్నది. నిషేధిత జాబితాపై ప్రజల్లో గగ్గోలు బయలుదేరేసరికి సర్కార్ జవాబు చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ముందుగా సీఎం తప్పు జరిగిందని ఒప్పుకోవడం, ఆపై రెవెన్యూ మంత్రి క్షమాపణ చెప్పడం కేవలం కంటితుడుపు చర్య మాత్రమే. ‘సారీ’ చెప్తే సరిపోతుందా? అనేది ప్రశ్న. నష్ట నివారణ చర్యల్లో భాగంగా నెపం అధికారుల మీదకు నెట్టేస్తున్నారు. సీఎంకు, మంత్రికి తెలియకుండానే అధికారులు నిషేధిత జాబితా తయారుచేశారా? ఒకవేళ అధికారుల అత్యుత్సాహం వల్లనే అలా జరిగిందని అనుకున్నా, అప్పుడది సర్కార్ అసమర్థతకు నిలువెత్తు నిదర్శనం కాదా? జరిగిన నష్టానికి, ప్రజల గోసకు ఎవరు బాధ్యత వహించాలి?
అందుకే ప్రభుత్వం 22ఏ క్లీనప్ డ్రైవ్ యుద్ధప్రాతిపదికపై చేపట్టాలి. రాష్ట్రవ్యాప్తంగా నిషేధిత జాబితాపై పునఃపరిశీలన జరిపి తప్పుగా చేర్చిన ప్రైవేటు పట్టా భూములను వెంటనే తొలగించాలి. బాధితుల కోసం జిల్లా స్థాయిలో ప్రత్యేక ట్రైబ్యునల్ లేదా ఫాస్ట్‌ట్రాక్ కమిటీ ఏర్పాటు చేయాలి. దరఖాస్తుల పరిష్కారానికి గరిష్ఠ కాలపరిమితి విధించాలి. అధికారుల తప్పిదం వల్ల జరిగిన నష్టాలకు జవాబుదారీ వహించాలి. ప్రభుత్వ భూమిని కాపాడటం ఎంత ముఖ్యమో, అమాయక పౌరుల భూమి హక్కును కాపాడటం కూడా అంతే ముఖ్యం. సెక్షన్ 22ఏ అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట కావాలి తప్ప సామాన్యుడి ఆస్తి హక్కులకు అడ్డుగోడ కాకూడదు. రికార్డులను సరిచేయకుండా జాబితాలు పెంచడం, ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పడం, చివరకు కోర్టుల గడప తొక్కేలా చేయడం పరిపాలన అనిపించుకోదు. 22ఏ కింద తప్పు జరిగితే బాధ్యత ప్రజలది కాదు, వ్యవస్థదే. ఆ వ్యవస్థను సరిచేయాల్సింది కూడా ప్రభుత్వమే.