జరభద్రం
కట్ట మైసమ్మ కలలోకి వచ్చినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ ఆలోచనలో పడింది. మేడిగడ్డలో మూడు పిల్లర్లు దెబ్బతిన్న విషయాన్ని కథలు, కథలుగా అల్లి రాజకీయ ప్రయోజనం పొందింది చాలు, మీ అధికార దాహానికి రాష్ట్రంలోని జలాశయాలు ఎండబెట్టి రైతుల పొట్ట కొడుతారా? అని ఆ దేవత అల్టిమేటమ్ ఇచ్చిందేమో. నీటిపారుదల శాఖ మంత్రి ఈ విషయంపై ఇప్పుడు నోరు విప్పుతున్నారు. ఆ ప్రాజెక్టు ప్రస్తావన ఎప్పుడు వచ్చినా అది రిపేరుకు సాధ్యం కానేకాదని, లక్ష కోట్లు గత ప్రభుత్వం గంగలో పోసిందని చెప్పే మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఇప్పుడు మాట మార్చారు. త్వరలో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బరాజ్‌ల మరమ్మతు పనులు మొదలు పెడుతామనే విషయాన్నీ బయటపెట్టారు.
గోదావరి నీళ్లు అధికంగా లభించే కాళేశ్వరం వద్ద 2016లో నిర్మాణం మొదలైన ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 2019 నాటికి సిద్ధమైంది. రాష్ట్రంలోని పంటలకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందిస్తూ, పరిశ్రమల నీటి అవసరాలు తీర్చేవిధంగా రూపొందించిన ఈ బహుళార్థక ప్రాజెక్టు తెలంగాణ గడ్డు సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం. రాష్ట్రంలో ఒక్కసారిగా పంటల దిగుబడి ఊహించని రీతిలో పెరుగడానికి, తాగునీటి సమస్య తీరడానికి ఈ ఆధునిక దేవాలయమే మూలహేతువు. ఎన్నికల ముందు తాము ఇచ్చిన హామీలను దాటవేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టు మరమ్మతులకు ముందుకు రాలేదు. రూ.80 లక్షల కోట్లతో నిర్మితమైన ఈ భారీ ప్రాజెక్టులో నష్టం జరిగింది స్వల్పమే. ముందుగా దానిని అంచనా వేసి, విషయాన్ని నిగ్గు తేల్చండి అని బీఆర్ఎస్ నేతలు ఎన్నిసార్లు అడిగినా పాలకుల నుంచి సమాధానం రాలేదు. మరమ్మతులు అనగానే కేంద్ర పరిశీలన బృందాలు రావాలంటూ ఆ విషయాన్ని ఢిల్లీ పెద్దల మీదికి మళ్లించి చేతులు దులుపుకొనేవారు. కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకే వస్తుంది, అవసరమైతే నిపుణులను పంపించే బాధ్యతను తాము తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేస్తున్నది. ఈ ఊగిసలాటలోనే సుమారు మూడేండ్ల కాలం గడిచిపోయింది.
కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు లేకున్నా రైతన్నలకు ఎలాంటి నీటి సమస్య రాలేదని, అది తమ గొప్పతనమే అని రేవంత్ ప్రభుత్వం భుజాలు చరుచుకుంటున్నది. రానున్న అయిదు, పదేండ్ల కాలంలో ఏదో ఒక రూపంలో నీటి ఎద్దడి తీవ్రమవుతుంది. అలాంటి గడ్డుపరిస్థితుల్లోనే ఆనకట్టల్లో దాచుకున్న నీరు ఉపయోగపడుతుంది. అదే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రధాన కారణం. వర్షపాతం తగినంత ఉండని దుర్భిక్ష ప్రాంతాలకు సైతం ఈ ఎత్తిపోతల పథకం ఎంతో మేలు చేసింది. ఎడారిలాంటి భూమిలోని నీళ్లు పరవళ్లు తొక్కి కోరిన పంటకు తోడు నిలిచింది.
ఈ వర్షాకాలం మనదేశం ఎల్ నినో బారిన పడింది. మన రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కన్నా సుమారు 35 % తక్కువ వర్షాలు కురిశాయి. జూలైలో కురిసిన భారీ వర్షాలు నీటిని సమృద్ధిగా నేలకు అందించాయి. అయితే మేడిగడ్డ బరాజ్ వరద నీటిని ఆపలేదంటూ..వర్షాన్ని ఒడిసి పట్టకుండా సముద్రంపాలు చేసింది కాంగ్రెస్ సర్కార్. నెపం గత ప్రభుత్వంపై నెట్టి ఊర్కోవచ్చునని అనుకున్న పాలకులకు ప్రజల నుంచి గట్టి వ్యతిరేకత ఎదురయ్యింది. ప్రస్తుత పరిస్థిత్లుల్లో ప్రాజెక్టు సామర్థ్యాన్ని అంచనా వేసి వరద నీటిని కొంతైనా బరాజ్‌లో నిలువ చేసుకోవచ్చని ఢిల్లీ, పుణె జలరంగ నిపుణులు సూచించారు. వృథాగా ఖాళీ అవుతున్న జలాశయాలను చూస్తూ నొచ్చుకున్న ప్రతిపక్షాలు, కరువు కాలాన ఈ మొండితనం పనికి రాదని ప్రభుత్వాన్ని నిలదీశాయి. కానీ అలా చేస్తే ప్రాజెక్టు దెబ్బతిని ఊర్లు కొట్టుకుపోతాయనే భయాలు కల్పిస్తూ పాలకులు కాలం వెళ్లబుచ్చారు తప్ప ప్రజల దుస్థితిపై ఏమాత్రం ఆలోచించలేదు. నీటి సమస్యను పట్టించుకోకపోతే తమ మనుగడకే ప్రమాదమని గ్రహించిన సర్కార్, ‘చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు’ మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బరాజ్‌ల మరమ్మతులకు సిద్ధపడుతున్నది. పై మూడు ప్రాంతాల్లో పునరుద్ధరణకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం విషయంలో నిపుణులు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు మంత్రి ఉత్తమ్ ప్రకటన ద్వారా తెలుస్తున్నది. మేడిగడ్డ బరాజ్‌లో కుంగిపోయిన ఏడో నెంబర్ బ్లాక్‌ను పూర్తిగా మూసివేసి కాంక్రీట్ గోడను కట్టాలని, సుందిళ్ల, అన్నారం బరాజ్‌ల పునాదుల కింద పడిన బుంగలను గ్రౌటింగ్‌తో పూడ్చి, డయాఫ్రమ్ వాల్‌ను షీట్ పైల్స్ టెక్నాలజీతో సరిచేయాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది.
ఇన్నాళ్లూ ఈ మరమ్మతు పనులకు ప్రభుత్వం ముందుకు రాకుండా, లక్ష కోట్ల నష్టం అనే దుర్మార్గ ప్రచారంతో కాలం వెళ్లదీసింది. రాబోయే రోజుల్లో వచ్చే అనుకోని వర్షాల వచ్చే నీరును వదులుకోవడానికి జనం సిద్ధంగా లేరు. వారే స్వయంగా వెళ్లి ప్రాజెక్టు గేట్లు మూసివేస్తే ప్రభుత్వం దోషిగా నిలబడక తప్పదు. మూడేండ్లు అవుతున్నా కాళేశ్వరం పునరుద్ధరణ పనులు ఎందుకు చేపట్టడం లేదనే జనం ప్రశ్న పదునెక్కుతున్నది. వచ్చే వర్షాకాలానికైనా ఈ ప్రాజెక్టులు పనికొచ్చేలా చేయకపోతే ప్రజలు ఊరుకోరనే భయం పాలకులను వెంటాడుతున్నది. అయితే, ప్రభుత్వం ఈ మరమ్మతులకు వేసిన అంచనా వ్యయం రూ.1,500 కోట్లు మాత్రమే. ఈ మాత్రం ఖర్చుకు ఇంతకాలం ముందుకు రాకుండా, పచ్చి స్వార్థంతో ప్రజలను కరువు కోరల్లోకి నెట్టివేస్తున్నది.
బద్రి నర్సన్