కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణ చేపట్టాలని నిర్ణయించడంపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక తప్పుల తడక అంటూ నినదించాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం సైతం ఆందోళనలకు దిగాయి. ధర్నాలు, రాస్తారోకోలతో నిరసనలు చేపట్టాయి.
తెలంగాణకు వరప్రదాయినిగా నిలిచే కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కారు కుట్రలు, కుతంత్రాలను సహించేది లేదని హెచ్చరించాయి. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోరిక మేరకు బనకచర్లకు లైన్ క్లియర్ చేసేందుకే నిరర్ధక ప్రాజెక్టుగా కాళేశ్వరాన్ని చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి దృష్టి మరల్చేందుకే ప్రభుత్వం నాటకాలాడుతున్నదని దుయ్యబట్టాయి. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నదని, వెంటనే సీబీఐ విచారణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని హెచ్చరించాయి.
కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు
దేవరుప్పుల/తొర్రూరు/కొడకండ్ల, సెప్టెంబర్ 2 : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ప్రజల దృష్టి మరల్చానికే రేవంత్‌రెడ్డి అనేక కుయుక్తులు చేస్తున్నాడని, అందులో భాగంగానే సీబీఐ విచారణకు అసెంబ్లీలో తీర్మానం చేశారని, ఎన్ని కుట్రలు పన్నినా కాళేశ్వరం విషయంలో తుది విజేత కేసీఆరేనని పేర్కొన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో, కొడకండ్ల మండల కేంద్రంలోని అమరవీరుల చౌరస్తా వద్ద, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు బస్టాండ్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో చేపట్టారు.
ఆ యా కార్యక్రమాల్లో మాజీ మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే మోసమని, ఇన్నాళ్లు సీబీఐ బీజేపీ జేబు సంస్థ అని చెప్పుకొచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరం కేసును సీబీఐకి ఎలా అప్పగించారని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై రెండేండ్లు కాలయాపన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తుచిత్తు ఓడిపోతుందని వారి సర్వేలోనే తేలడంతో, ప్రజల దృష్టిని మరల్చడానికి సీబీఐ డ్రామాకు తెరలేపారని అన్నారు. కాళేశ్వరంపై ఎన్ని కపటనాటకాలాడినా కేసీఆర్ క్లీన్‌చిట్‌తో బయటకు వస్తారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో తెలంగాణ సస్యశ్యామలమైందని, భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయన్నారు.
కేంద్ర, రాష్ర్టాల నుంచి అన్ని అనుమతులు తీసుకొని పేరుమోసిన కంపెనీ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో జరిగిన చిన్న పొరపాటును కాంగ్రెస్ ప్రభుత్వం భూతద్ధంలో పెట్టి ప్రజలకు చూపే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇలాంటి సమస్యలు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో జరిగాయని, సరిదిద్దాల్సింది పోయి.., రాద్దాంతం చేయడం సరి కాదన్నారు. ఘోస్ కమిషన్ నివేదిక తప్పుల తడకగా ఉందని, న్యాయస్థానాలు నిజం నిగ్గు తేల్చుతాయని, ఆనాడు రేవంత్‌రెడ్డి నిజస్వరూపం బయటపడుతుందన్నారు. మేడిగడ్డ పిల్లర్లు క్రాక్ ఇస్తే ఎందు కు రిపేర్ చేయరని ఎర్రబెల్లి ప్రశ్నించారు.
రూ.150 కోట్ల నుంచి 200 కోట్లు ఖర్చు వస్తుందని అంచనా వేయగా, ఆ ఖర్చంతా తామే పెట్టుకుంటామని సద రు కంపెనీ చెబుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదని ఎర్రబెల్లి అన్నారు. కాళ్వేశరం అన్ని దశల నిర్మాణానికి రూ.94వేల కోట్ల ఖర్చుకాగా లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ నాయకులు ప్రచా రం చేస్తున్నారని అన్నారు. ఇదే విషయాన్ని అసెంబీల్లో ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని రేవంత్‌రెడ్డి సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించి చేతులు దులుపుకున్నారని అన్నారు.
ఘోష్ కమిషన్ మేడిగడ్డను రిపేరు చేయాల ని తెలిపిందని అంటే మిగతా ప్రాజెక్ట్ ఓకే అన్నట్లే కదా అని దయాకర్‌రావు అన్నారు. కార్యక్రమాల్లో జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్, బీఆర్ఎస్ దేవరుప్పుల మండలాధ్యక్షుడు తీగల దయాకర్, నాయకులు పల్లా సుందరరాంరెడ్డి, బస్వ మల్లే శ్, ఏల సుందర్, ధరావత్ రాంసింగ్, జోగు సోమనర్సయ్య, బస్వ వెంకన్న , చింత రవి, జలేందర్‌రెడ్డి, జోగేశ్వర్, ప్రవీణ్, మోహన్, కృష్ణమూర్తి, శ్రీనివాసరెడ్డి, నవీన్, సోమిరెడ్డి, రాజన్న పాల్గొన్నారు.
దేశం గర్వించే ప్రాజెక్ట్‌పై అసత్య ప్రచారం
బయ్యారం, సెప్టెంబర్ 2 : తెలంగాణ జాతిపిత, స్వరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియానాయక్, జడ్పీ మాజీ చైర్పర్సన్ అంగోత్ బిందు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీబీఐ విచారణకు నిరసనగా మంగళవారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ వద్ద నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం గర్వించేలా సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి, రైతుల పంట పొలాలకు సాగు నీరందించినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే వందల కిలో మీటర్ల పైప్లైన్లు, లిఫ్ట్ ఇరిగేషన్లు, 19 బరాజ్‌లు అని, అందులో మేడిగడ్డ ప్రాజెక్ట్‌లోని రెండు పిల్లర్లు కుంగితే మొత్తం కూలిందని విష ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నట్లు తెలిపారు. రాత్రికి రాత్రే తెలంగాణ వర ప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీబీఐ విచారణ చేపడుతున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడం హేయమైన చర్య అని అన్నారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు తాత గణేశ్, నాయకులు గంగుల సత్యనారాయణ, ఎనుగుల ఐలయ్య, బానోత్ లక్ష్మణ్, జర్పుల శ్రీను, రేపాల వెంకన్న, వీరభద్రం, రాజేశ్, రాంకోటి, కొండల్, శోభన్ నాయక్ పాల్గొన్నారు.
రాజకీయ పబ్బానికే ఆరోపణలు
వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 2 : కాంగ్రెస్ హైకమాండ్ మాత్రమే కాదు.. సీఎం రేవంత్‌రెడ్డి తాతలు దిగివచ్చినా కేసీఆర్‌ను టచ్ చేయలేరని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదంతో ఆంధ్రా పాలకుల కబంధ హస్తాల నుంచి తెలంగాణను సాధించిన కేసీఆర్ ఒక శిఖరమని, ఆయనపై బురదజల్లే ప్రయత్నాలు చేసినా, ఇబ్బందులకు గురిచేయాలని చూసినా తెలంగాణ ప్రజలు ఏకమై కాంగ్రెస్ పార్టీని, నాయకులను కుదిపేస్తారని పేర్కొన్నారు. మంగళవారం వరంగల్ చౌరస్తాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించడాన్ని తప్పుబడుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నన్నపునేని మాట్లాడుతూ.. తలాపునకు నీళ్లు పెట్టుకొని చాప దూపకు ఏడ్చినట్లుగా ఉన్న పరిస్థితిని మార్చి నీళ్లు లేక బీడుపడిన కోటి ఎకరాలకు సాగునీటిని అందించి పచ్చని పంట భూములుగా మార్చాలని, తాగునీరు లేక ఎండుతున్న పల్లెల గొంతులను తడపాలనే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసి జనాలను మభ్యపెడుతున్నదన్నారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేసీఆర్‌పై బురదజల్లుతుందన్నారు.
అసెంబ్లీలో ప్రాజెక్ట్‌పై వివరణ ఇస్తున్న సమయంలో ఏడుగురు మంత్రులు అడ్డుపడి సభామర్యాదకు భంగం కలిగించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని, సీబీఐ, ఈడీలపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం కొనసాగుతున్నదని ఆరోపిస్తూనే., తిరిగి విచారణ సీబీఐతో చేయిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 2029లో కాంగ్రెస్‌కు ఓటర్లు చిప్ప చేతులో పెట్టడం ఖాయమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి, మరుపల్ల రవి పాల్గొన్నారు.