ఏటూరునాగారం, జనవరి 26 : జాతీయ రహదారిపై వేస్తున్న బీటీ లేయర్ బీటలువారుతున్నది. వేసిన కొద్ది గంటలకు పగుళ్లు ఏర్పడి ప్రయాణికులకు నర కం కనిపిస్తున్నది. రోడ్డు పటిష్టత కోసం వేస్తున్న బీటీ పట్టు లేకుండా పోయి ఒక వైపు వేస్తుంటేనే మరో వైపు లేచిపోతున్నది. నాసిరకం పనులతో ప్రమాదాల బారిన పడుతున్నామని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే వెంకటాపురం, వాజేడు, మంగపేట మండలాల నుంచి ఓవర్ లోడుతో ఇసుక లారీల రాకపోకలు సాగిస్తుండడంతో జాతీయ రహదారి చాలా చోట్ల ప్రమాదకరంగా మారి అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.
ఏటూరునాగారం నుంచి తాడ్వాయి వరకు రెండించుల లేయర్‌తో వేస్తున్న బీటీ లేయర్ అప్పుడే పగుళ్లు తేలితే త్వరలో జరగనున్న మినీ మేడారం జాతర నాటికి ఎలా ఉంటుందో అర్థం కాకుండా ఉంది. అటవీ ప్రాంతంలో రోడ్డు ఇలా ఉంటే రాత్రి వేళ ప్రయాణం ఎలా చేయాలంటూ వాహనదారులు వాపోతున్నారు. జాతర ముందు పగుళ్లు తేలేలా రోడ్డు పనులు చేస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏటూరునాగారం-తాడ్వాయి మధ్యలోని 11 కిలోమీటర్ల పొడవునా రూ. 9 కోట్లతో బీటీ లేయర్ వేస్తున్నారు.
చిన్నబోయినపల్లి నుంచి తాడ్వాయి మధ్యలో ప్రస్తుతం కొన్ని కిలోమీటర్ల వరకు ఒక వైపు తారు వేయగా అనేక చోట్ల పగిలిపోయి ప్రజాధనం రోడ్డుపాలైంది. ఈ రోడ్డుపై మల్లూరు, బొగత జలపాతంతో పాటు త్వరలో జరగనున్న మేడారం జాతరకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఒకవైపు వేసిన బీటీ పగుళ్లు ఏర్పడడంతో తప్పని తెలిసినా వాహనదారులు మరోవైపున్న పాత రోడ్డుపై నుంచి వెళుతున్నారు.
రోడ్డు పటిష్టత కోసం చేస్తున్న బీటీ పనులు నాణ్యతతోనే జరుగుతున్నాయి. బీటీ ఆరక ముందే లోడు వాహనాలు వెళుతున్నాయి. దీంతో రోడ్డు అక్కడక్కడా దెబ్బతింది. బీటీ వేసి రోలింగ్ చేసిన అనంతరం కింద ఉన్న పాత రోడ్డుకు అతుక్కునేందుకు కనీసం రెండు, మూ డు గంటలు పడుతుంది. ఆ తర్వాత వాహనాలు వెళ్లాలి కానీ వాహనదారులు బీటీ పచ్చిగా ఉన్నపుడే వెళుతున్నారు. దీనికి తోడు పాత రోడ్డు నున్నగా ఉండడంతో సరిగా అతుక్కోక లోడు వాహనం వెళ్లినపుడు తారు కదలడంతో పగులుతున్నది. దెబ్బతిన్న చోట బీటీ తొలగించి ప్యాచ్ పనులు చేస్తున్నారు. నాలుగేళ్ల పాటు రోడ్డు దెబ్బతిం టే మరమ్మతుల బాధ్యత కాంట్రాక్టర్‌దే.
– కుమారస్వామి, ఎన్‌హెచ్ డీఈఈ