మహబూబాబాద్, డిసెంబర్26 (నమస్తే తెలంగాణ) : మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు శనివారం పర్యటించనున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి, 10 గంటలకు జిల్లా కేంద్రంలోని పీఎస్ఆర్ కన్వెన్షన్ హాలులో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్నారు. మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ వార్డు సభ్యులు, మాజీ కౌన్సిలర్లు, కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులతో నిర్వహించే ఈ సమ్మేళనంలో కేటీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించనున్నారు.
పార్టీ భవిష్యత్లో చేపట్టనున్న కార్యక్రమాలను నాయకులు, కార్యకర్తలకు వివరించనున్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ను సీఎం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగేలా శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే కేటీఆర్ వచ్చేందుకు రంగం సిద్ధం కావడంతో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తకళ్లపల్లి రవీందర్ రావు, మాజీ మంత్రి రెడ్యానాయక్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు అందరూ తరలి రావాలని జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత పిలుపునిచ్చారు.