భూపాలపల్లి సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ : బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులు, ప్రవేశపెట్టి అమలు చేసిన పథకాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచాయి. మనం మాత్రం చేసిన పనులు చెప్పుకోలేకపోయాం. మళ్లీ అదే పరిస్థితి రిపీట్ కావద్దు. అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెసోళ్లు గద్దెనెక్కారు. ఇప్పుడు ప్రజలు చేసిన తప్పును తెలుసుకుని చింతిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రతి గులాబీ కార్యకర్త ఇంటింటికీ వెళ్లి కలవండి.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కేసీఆర్ పాలనను గుర్తుచేయండి.. స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలి.
పోలీస్ కేసులకు, కాంగ్రెసోళ్ల దాడులకు భయపడవద్దు. బీఆర్ఎస్ పార్టీ, గండ్ర వెంకటరమణారెడ్డి మీకు అండగా ఉంటరు. గండ్ర నాయకత్వంలో కార్యకర్తలు పనిచేసి భూపాలపల్లిపై గులాబీ జెండా ఎగురవేయాలి. ఎక్కడికక్కడ లీగల్ సెల్ ఏర్పాటు చేసి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం. ముఖ్య నేతలు తమ గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీలను గెలిపించుకుని, వారి మండలంపై దృష్టిపెట్టాలి. భవిష్యత్‌లో టీబీజీకేఎస్‌ను సింగరేణిలో బలోపేతం చేసి మళ్లీ గుర్తింపు సంఘంగా గెలుస్తాం.
జయశంకర్ భూపాలపల్లి, జూలై 27(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కేసీఆర్ పాలనను గుర్తుచేయండి.. గండ్ర వెంకటరమణారెడ్డి నాయకత్వంలో పనిచేయండి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఆదివారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేటలో మాజీ సర్పంచ్ దివంగత కొడారి కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడ కార్యకర్తలతో మాట్లాడి అక్కడినుంచి భూపాలపల్లి జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పార్టీలో నిబద్ధత గల కార్యకర్తలు ఉన్నారని, వారు క్షేత్రస్థాయిలో వెళ్లలేకపోతున్నారని అన్నారు.
మధుసూదనాచారి 2001 నుంచి కేసీఆర్‌తో కలిసి నడుస్తున్నారని, ఆయనకు శాసనసభ స్పీకర్‌గా, మండ లి చైర్మన్‌గా, మండలి ప్రతిక్షనేతగా కేసీఆర్ అవకాశం ఇచ్చారని, చారికి అపారమైన అనుభవం ఉందని, ఆయన సేవలు పార్టీకి అవసరమని, ఆయన సేవలను ఎలా ఉపయోగించుకోవాలో కేసీఆర్‌కు తెలుసన్నారు. గండ్ర వెంకటరమణారెడ్డి సైతం చాలా సీనియర్ నాయకుడని, 2018 ఎన్నికల్లో ఆయన భూపాలపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందగా తన కోరిక మేరకు బీఆర్ఎస్లోకి వచ్చారని, ఆయన నాయకత్వంలో కార్యకర్తలు భూపాలపల్లి నియోజకవర్గంలో పనిచేసి భూపాలపల్లిపై గులాబీ జెండా ఎగురవేయాలని కోరారు.
మేడిగడ్డ ప్రాజెక్టును పక్కన పెట్టి తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేయాలని కాంగ్రెస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, లుచ్చా కాంగ్రెసోళ్లే మేడిగడ్డ బరాజ్‌ను ఏదో చేశారని, ఎంత వర్షం వచ్చినా నిలబడిన ప్రాజెక్టు ఎలా కూలుతుందన్నారు. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ కాదని 80 మీటర్ల దగ్గరి నుంచి 618 మీటర్ల ఎత్తుకు నీళ్లను తీసుకెళ్లే ప్రాజెక్టే కాళేశ్వరమని, 100 ఏళ్ల ముందుచూపుతో కేసీఆర్ ఈ ప్రాజెక్టును నిర్మించారని పేర్కొన్నారు. రైతులకు కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును రెండు పిల్లర్లు కుంగాయనే నెపంతో పక్కన పెట్టడం కాంగ్రెస్ కుట్రలో భాగమేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని రేవంత్‌రెడ్డి చెబుతుండగా అతని మామ మాత్రం 80వేల కోట్ల పనులే జరిగాయని చెబుతున్నాడని, మామకు ఉన్న సోయి అల్లునికి లేదని ఎద్దేవా చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రంగా పేరుగాంచిందని, ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హర్యానాను మించిపోయిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, తాటికొండ రాజయ్య, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, పుట్ట మధు, నన్నపునేని నరేందర్, దాస్యం వినయ్‌భాస్కర్, జడ్పీ మాజీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, నేతలు వాసుదేవరెడ్డి, నాగుర్ల వెంకన్న, గండ్ర గౌతంరెడ్డి, రాకేశ్‌రెడ్డి, ఆదిరెడ్డి, కళ్లెపు శోభ, రఘుపతిరావు, గొర్రె సాగర్, జోరుక సదయ్య, అన్నారెడ్డి, మల్లారెడ్డి పాల్గొన్నారు.
పార్టీ అధిష్టానం ఆదేశిస్తే కాళేశ్వరం మోటర్లు ఆన్ చేసి రైతులకు నీళ్లందించాలని నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధమని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు అనేక హామీలు ఇచ్చి అమలు చేతకాక ప్రజలను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని 18 నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెట్టినా, దాడులు చేసినా మిత్తితో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.
భూపాలపల్లిలో బీఆర్ఎస్ హయాంలో మంజూరీ చేసిన నిధులతోనే మళ్లీ శిలాఫలకాలు వేస్తూ తాము మం జూరు చేయించినట్లు ప్రచారం చేసుకుంటున్నారని, శిలాఫలకంపై బొమ్మలు వేసుకోవడం ఈ ఎమ్మెల్యేకే చెందుతుందని ఎద్దేవా చేశారు. చనిపోతే ఘోరీలపై వేసుకునే బొమ్మలు శిలాఫలకాలపై వేసుకుంటున్నారని, కాంగ్రెస్ నాయకులు ఎలాంటి భాష వాడితే తాము సైతం అదే భాషతో బదులిస్తామని స్పష్టంచేశారు. భూపాలపల్లిలో రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.
రేవంత్‌రెడ్డి అంటేనే మోసమని, నోరు తెలిస్తే అబద్ధాలని ప్రజలకు అర్థమైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు. అనేక ఆచరణకు నోచుకోని హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చారని ఇప్పుడు చేతులెత్తేస్తున్నారన్నారు.
గెలిచిన 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న రేవంత్ ప్రభుత్వం 18 నెలలు గడుస్తున్నా హామీల అమలు అడ్రస్ లేదన్నారు. కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం, మహిళలకు రూ.2500 పంపిణీ ఏమైందని ప్రశ్నించారు. ప్రజలు ఇప్పటికైనా కాంగ్రెస్ మోసాలను గమనించి స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని, గులాబీ కార్యకర్తలు సైనికుల్లా పని చేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు.