ఎల్కతుర్తి, ఏప్రిల్ 17 : బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న బహిరంగ సభ ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. గడువు సమీపిస్తుండడంతో సభ ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్న నేతలు రేయింబవళ్లు అక్కడే ఉండి తమకు అప్పగించిన పనులు పూర్తి చేస్తున్నారు. సిద్దిపేట-వరంగల్-కరీంనగర్ రూట్ల లో వచ్చే వాహనాల కోసం ఇప్పటికే పార్కింగ్ స్థలాలను గుర్తించారు. సభకు వచ్చే చిన్న చిన్న రూట్లలో సైతం తాత్కాలిక రోడ్లను వేస్తున్నారు.
సిద్దిపేట రూట్‌కు ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రా వు, కరీంనగర్ రూట్‌కు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, వరంగల్ రూట్‌కు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు తీసుకొని పనిచేస్తుండగా, వీరితో పాటు మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్‌కుమార్, దాస్యం వినయ్‌భాస్కర్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు నిత్యం అందుబాటులో ఉంటూ వాహనాల పార్కింగ్, సభ ఏర్పాట్లు, మంచినీళ్ల బాటిల్స్, మజ్జిగ ప్యాకె ట్లు తదితర వసతులపై సమీక్ష చేస్తున్నారు. మైదా నం సుందరీకరణ ఇన్చార్జిలుగా బీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, నాగుర్ల వెంకన్న వ్యవహరిస్తున్నారు.
సభకు వచ్చే మూడు ప్రధాన రూట్లలోనే కాకుండా వ్యవసాయ భూముల నుంచి సైతం తాత్కాలిక రోడ్లను నిర్మిస్తున్నారు. సభకు వచ్చే ప్రజల కోసం ఇప్పటికే 10 లక్షల వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకె ట్లు ఆర్డర్ ఇవ్వగా, అవసరమైతే మరో 5 లక్షల వరకు తెప్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు నిర్వాహకులు చెప్తున్నారు. అలాగే సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే చికిత్స అందించేందుకు నాలుగు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచనున్నారు.
ఆయా రూట్లల్లో మెడికల్ క్యాంపులను సైతం నిర్వహించనున్నారు. అత్యవసర చికిత్స అందించేందుకు స్థానికంగా ఉన్న ఫంక్షన్హాల్లో తాత్కాలికంగా 20 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ జెండాలను రోడ్ల వెంట అమ్ముతుండడంతో అభిమానులు ఉత్సాహంగా వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఏదేమైనా బీఆర్ఎస్ రజతోత్సవ సభతో ఎల్కతుర్తి గులాబీమయంగా మారుతున్నది.