హనుమకొండ, మార్చి 10: తెలంగాణ ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన బీఆర్ఎస్ పార్టీకి, ఓరుగల్లుకు విడదీయరాని అనుబంధం ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మె ల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ నిర్వహణ కోసం వరంగల్ నగర శివారులోని ఉనికిచర్ల, భట్టుపల్లిలోని స్థలాలను పరిశీలించారు. అనంతరం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
బీఆర్ఎస్ పార్టీ 25వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా ఏప్రిల్ 27వ తేదీన వరంగల్‌లో రజతోత్సవ సభ నిర్వ హించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారన్నారు. ఈ వేడుకలు ఏడాది పాటు జరపనున్నారని, వరంగల్‌లో ప్రారంభమవుతాయని తెలిపారు. ఉద్యమాల ఖిల్లా వరంగల్‌లో అనేక బహిరంగ సభలు నిర్వహించామని, గతంలో 15 లక్షల మందితో మహాగర్జన నిర్వహించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉందన్నారు. 14 ఏళ్ల పోరాటం, 10 ఏళ్ల పాలన రెండింటి మేళవింపే రజతోత్సవాలని ఆయన పేర్కొన్నారు. సభకు వరంగల్ నగర సమీపంలోని రెండుమూడు చోట్ల స్థలాలను పరిశీలించామని, కచ్చితంగా ఎక్కడ అనేది ఇంకా నిర్ణయించలేదని చెప్పారు.
ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకమైన మిలియన్ మార్చ్ జరిగిన రోజు అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఉన్నప్పుడు హుజూరాబాద్, దుబ్బాక, మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయిందని, అమ్ముడుపోవడం ఆయనకు అలవాటని విమర్శించారు. సమావేశంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, బానోత్ శంకర్‌నాయక్, నన్నపునేని నరేందర్, తాటికొండ రాజయ్య పాల్గొన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినూత్న ఆలోచనలు, ఆందోళనలకు రూపకర్త అని, తెలంగాణ ప్రజల సామాజిక, చారిత్రక అవసరాలకు అనుగుణంగా బీఆర్ఎస్ను స్థాపించారన్నారు. పదేండ్ల కేసీఆర్ పాలన దేశానికే దిక్సూచిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. దేశంలో అత్యంత ఎకువ వరి ధాన్యం పండించే రాష్ట్రంగా తీర్చిదిద్దారన్నారు. తెలంగాణలో అమలు చేసిన అనేక కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు.
ఉచిత కరెంటు, సాగునీరు, రైతుబంధుతో వడ్ల ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిందని, హామీలు ఇవ్వని రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి ఎన్నో పథకాలను అమలు చేసిందని వివరించారు.
పక రాష్ట్ర ముఖ్యమంత్రి బనకచర్ల నుంచి గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్‌కు తరలించుకుపోతుంటే బీజేపీ, కాంగ్రెస్‌లు మౌనంగా ఉంటే బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించిందన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పెదవులు మూసుకుంటే 42 రోజులు అసెంబ్లీని స్తంభింపజేశామన్నారు. రాష్ట్రంలో ఆరుగురితో మంత్రి పదవులకు రాజీనా మా చేయించి కొట్లాడిన పార్టీ బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. ఇచ్చిన హామీఅమలు చేయని చరిత్ర కాంగ్రెస్‌ది అయితే, ఇవ్వని హామీలను సైతం అమలు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్‌ది అన్నారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ మాట వినాలని, ఆయనను చూడాలని కోరుకుంటున్నారన్నారు.