పాలకుర్తి, ఏప్రిల్ 16 : తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దిన ఘనత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఊరూరా ఉద్యమస్ఫూర్తితో కథనాయకులై కదలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం పాలకుర్తిలో బీఆర్ఎస్ మండల విస్తృ్తత స్థాయి సమావేశాన్ని మండల అధ్యక్షుడు పసునూరి నవీన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ రజతోత్సవ సభను పండుగ వాతావరణంలో జరుపుకోవాలన్నారు. ఊరూరా పార్టీ జెండాను ఆవిష్కరించి సభకు రావాలని కోరారు. కాంగ్రెస్, సీఎం రేవంత్‌రెడ్డివి బ్రోకర్ మాటలని మండిపడ్డారు.
అబద్ధాలతో గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి త్వరలోనే గద్దె దిగక తప్పదన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్పై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిపై ఆగ్రహంతో ఉన్నారన్నారు. మంత్రి పదవుల కోసం 32మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో మీటింగ్ పెట్టినా ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారన్నారు.
ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలైనా పూర్తిస్థాయి మంత్రి వర్గ విస్తరణ చేయకపోవడం సిగ్గుచేటన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పాలకుర్తి గడ్డ నుంచే పోటీ చేస్తానని చెప్పారు. ఓటమి తర్వాతే కేసీఆర్, దయాకర్‌రావు విలువ ప్రజలకు తెలిసిందన్నారు. కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత నెలకొందన్నారు. రజతోత్సవ సభకు పాలకుర్తి నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, బ్యాంక్ చైర్మన్ బొబ్బల ఆశోక్‌రెడ్డి, వైస్ చైర్మన్ కారుపోతుల వేణు, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్ పాల్గొన్నారు.