చేర్యాల, డిసెంబర్ 19 : ప్రజల్లో కేసీఆర్ పై చెక్కు చెదరని అభిమానం ఉందని, పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సైనికుల పోరాటంతో ఘన విజయం లభించిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. చేర్యాల పట్టణంలోని రేణుక గార్డెన్స్‌లో శుక్రవారం చేర్యాల, కొమురవెల్లి, మద్దూ రు, ధూళిమిట్ట మండలాల్లో విజయం సాధించిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులతో ఆత్మీయ అభినందన సమ్మేళనం నిర్వహించా రు.
ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ గులాబీ శ్రేణులు రానున్న ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేక పోలీస్ బృందాలు, అధికారుల టీంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పోటీలో ఉన్న వారిని ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా మొక్కవోని దీక్షతో శ్రేణులు పని చేయడంతో ప్రజలు ఆశీర్వదించినట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా పార్టీలోనే ఉంటూ కుట్రలు, కుతంత్రాలు చేసిన వారిని ఇప్పటికే గుర్తించామని, వారిపై సరైన సమయంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. సర్పంచ్‌లుగా ఓడిపోయిన గ్రామాల్లో పార్టీ పరంగా వారే మా సర్పంచ్‌లని, వారికి తానే అండగా ఉంటానని సమస్యలు ఏర్పడితే తన దృష్టికి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
నూతనంగా ఎన్నికైన వారు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలని సూచించారు. రేవంత్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి పంచాయతీ ఎన్నికల విజయాలపై తప్పుడు లెక్కలు చెప్పారని, అయినప్పటికీ గ్రామాల్లో ఎవరు గెలిచారో, ఓటమి చెందారో ప్రజలకు తెలుసన్నారు. జనగామ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆయన స్వగ్రామంలో ఓటు హక్కు లేన ప్పటికి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా గ్రామంలో కుర్చీ వేసుకుని ఓటుకు రూ.5వేలు ఇచ్చినా ప్రజలు కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థికి ఓటు వేయలేదని బీఆర్ఎస్ పార్టీని బెదిరించినట్లు తెలిపారు. అధికారం, డబ్బులు ఎన్ని ఖర్చు చేసినా బీఆర్ఎస్ శ్రేణులు వాటిని తిప్పికొట్టాయని, చేర్యాల ప్రాంతంలో అత్యధిక స్థ్ధానాల్లో బీఆర్ఎస్ పార్టీకి విజయం సాధించిపెట్టిన ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు.