హనుమకొండ, ఆగస్టు 11 : రాష్ట్రంలో భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు జలమయమై, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇలాంటి విపతర పరిస్థితుల్లో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు వరద బాధితులకు అండగా నిలువాలని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇప్పటికే అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నా, తీసుకోకపోయినా ప్రతిపక్షంగా మన బాధ్యత ఎకువని గుర్తుచేశారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు వెంటనే వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి తాగునీరు, పాలు, ఆహారం, మందులు, దుస్తులు వంటి కనీస అవసరాలను అందించాలని కోరారు. అత్యవసర వైద్యం కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. సహాయక చర్యల్లో స్థానిక ప్రభుత్వ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని కేటీఆర్ సూచించారు.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొవద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వరంగల్, మహబూబాబాద్ ఖమ్మం, జిల్లాల్లో వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున ఆయా జిల్లాల పార్టీ నేతలు, శ్రేణులు సహాయక చర్యల్లో మరింత చొరవ చూపాలన్నారు. ఈమేరకు ఆ మూడు జిల్లాల పార్టీ నేతలతో కేటీఆర్ బుధవారం మాట్లాడారు. ఈ కష్టకాలంలో బీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని, అందరూ ధైర్యంగా ఉండాలని కేటీఆర్ పేర్కొన్నారు.