మహబూబాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి మహబూబాబాద్ జిల్లాను రద్దు చేస్తా అంటున్నడు.. మీ జిల్లా ఉండాలా? వద్దా? ఉండాలంటే మాలోత్ కవితను గెలిపించుకోవాలని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. బుధవారం మహబూబాబాద్ పట్టణంలోని ఇందిరాగాంధీ సెంటర్లో కేసీఆర్ రోడ్‌షో నిర్వహించారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. మహబూబాబాద్ జిల్లా ఉండాలన్నా, జిల్లాను రద్దు చేస్తా అన్న సీఎం రేవంత్‌రెడ్డి మెడలు వంచాలన్నా ఇక్కడ మాలోత్ కవితను గెలిపించాలని కోరారు. మహబూబాబాద్ ప్రాంతం పోరాటాల ఖిల్లా అని, ఆ విషయాన్ని గుర్తించే తాను మహబూబాబాద్‌ను జిల్లా చేశానని, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు రద్దు చేస్తాం అంటున్నారని తెలిపారు.
ఎస్సారెస్పీ స్టేజ్-2 ద్వారా నీళ్లు తెచ్చి వెన్నవరం ద్వారా మహబూబాబాద్, డోర్నకల్ ప్రాంతాల్లోని చివరి ఆయకట్టు వరకు కాళేశ్వరం ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు ఇచ్చిందని అన్నారు. ‘ఇప్పుడు మీకు నీళ్లు వస్తున్నాయా? మీకు రైతుబంధు వచ్చిందా? మీకు తులం బంగారం ఇచ్చారా?’ అంటూ కేసీఆర్ ప్రజలను అడుగగా, రాలేదు.. రాలేదు అంటూ సమాధానమిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒక్కటి ఇచ్చి ఆటో కార్మికుల పొట్ట కొట్టిందని, ఒక పథకం అమలు చేసే ముందు మంచీచెడు ఆలోచించాలని, ప్రజలకు పథకాలు ప్రవేశపెట్టినప్పు డు ఇంకో వర్గాన్ని దెబ్బతీసేలా ఉండొద్దన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు ఉంటున్నదా? బోర్లలో నీళ్లు ఉన్నయా? వడ్లకు బోనస్ ఇచ్చారా? మహిళలకు రూ.2500 చొప్పున ఇస్తామని ఇచ్చారా? ఏదీ అమలు కాలేదన్నారు.
ఈ కాంగ్రెస్‌కు ఓటు వేస్తే పథకాలు ఇయ్యకున్నా ఏమీ కాదని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని, పథకాలు కావాలన్నా.. జిల్లా మీకు ఉండాలన్నా మాలోత్ కవితను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఖమ్మం, మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట ప్రాంతాల్లో తాగునీటికి బదులు మురికినీళ్లు వస్తున్నాయని, నాలుగైదు నెలల్లోనే మిషన్ భగీరథ నీళ్లు ఎటుపోయాయని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో గిరిజనులు ఎకువగా ఉన్నారని, గిరిజనుల కోసం బంజారా భవన్ కట్టించామని, పది శాతం రిజర్వేషన్ పెంచామని, తండాలను గ్రామపంచాయతీలు చేశామని, ఇన్ని చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలన్నారు.
తన ప్రాణం ఉన్నంతవరకు తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరగదని, జరగనీయనని స్పష్టంచేశారు. కవిత బ్రహ్మాండంగా పనిచేస్తుందని, మచ్చలేని నాయకురాలని, పోయినసారి అవకాశం ఇస్తే ఐదేళ్లు నిస్వార్థంతో సేవ చేసిందని, మరోసారి అవకాశం కల్పిస్తే అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుందని తెలిపారు. మహబూబాబాద్‌లో ఈ రోడ్‌షోను చూస్తుంటే నేల ఈనిందా అన్నట్టుగా ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిక్షణం ప్రజల కోసం, ప్రగతి కోసం పనిచేస్తుందని, ఈ విషయం గుర్తుంచుకొని బీఆర్ఎస్ను ఆదరించి కారు గుర్తుపై ఓటు వేసి కవితను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో కార్యకర్తలు, ప్రజలు సీఎం.. సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.