వరంగల్, మే 14 : వరంగల్ నగరంలోని చిరు వ్యాపారులకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. ప్రపంచ సుందీరమణుల నగర పర్యటనలో భాగంగా జీడబ్ల్యూఎంసీ అధికారులు రోడ్డు పక్కన ఉన్న వ్యాపార సముదాయాలను తొలగించడంపై మండిపడింది. బుధవారం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఎదుట మహా ధర్నా చేపట్టింది. హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ హాజరై మాట్లాడారు. గ్రేటర్ అధికారులు, పోలీసులు చిరు వ్యాపారుల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. అందాల భామల కోసం రోడ్డు పక్కన బతుకులీడుస్తున్న పేదలను ఆగం చెయొద్దని సూచించారు.
నగర చారిత్రక నేపథ్యాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి తాము వ్యతిరేకం కాదని, పేదల వ్యాపార సముదాయాలను తొలగించడాన్ని నిరసిస్తున్నామని అన్నారు. 48గంటల్లో తొలగించిన సముదాయాలను పునరుద్ధరించాలని, లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో చిరు వ్యాపారులకు రక్షణ కల్పించామని, మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ ఉన్న సమయంలో కోట్లాది నిధులు ఖర్చు చేసి నగరంలో వెండింగ్ జోన్లు నిర్మించామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలపై ప్రేమ, చిరు వ్యాపారులపై ప్రతాపం చూపుతున్నదన్నారు.
ఇచ్చిన హమీలు మరిచి పేదలపై దౌర్జన్యం చేస్తున్నదని దాస్యం అన్నారు. అనంతరం దాస్యం నేతృత్వంలో ర్యాలీగా ఎంజీఎం జంక్షన్లో రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రాఫిక్‌జామ్ కావడంతో పోలీసులు చేరుకోగా కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఆందోళనలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, కార్పొరేటర్లు మరుపల్ల రవి, సిద్దం రాజు, ఇండ్ల నాగేశ్వర్రావు, చెన్నం మధు, సంకు నర్సింగ్, సోదా కిరణ్, ఇమ్మడి లోహితరాజు, మాజీ కార్పోరేటర్ జోరిక రమేష్, మేకల బాబురావు, ఉడుతల సారంగపాణి, పశ్చిమ నియోజవర్గ కోఅర్డినేటర్ పులి రజనీకాంత్, నాయకులు టీ రమేశ్‌బాబు, నయీముద్దీన్, కొడకండ్ల సదాంత్, ఎండీ షఫీ, బజ్జూరి వాసు, జానకీరాములు, రామూర్తి పాల్గొన్నారు.