తొర్రూరు : కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని వెంటనే కాంటాలు వేసి మిల్లులకు తరలించాలని తొర్రూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ..రైతులు కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయకపోవడంతో ధాన్యం వర్షాల కారణంగా పాడవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని రైతన్నలు కన్నీరు పెట్టుకుంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. తొర్రూరు మండలంలోని 19 కొనుగోలు కేంద్రాల్లో ఒక్క కేంద్రంలో కూడా పూర్తిగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగియలేదని ఆరోపించారు.
రైతులు కొనుగోళ్ల కోసం ఎండలో నిలబడి ఎదురు చూస్తూ వడదెబ్బతో అస్వస్థతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. రైతు సమస్యల పట్ల కాంగ్రెస్కు ఎలాంటి చిత్తశుద్ధి మిల్లులకు తరలించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. మరోవైపు, రైతులను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, మాజీ జెడ్పీటీసీ మంగళంపల్లి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు బిందు శ్రీనివాస్, పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.ప్రదీప్ రెడ్డి, పార్టీ కార్యదర్శి కుర్ర శ్రీనివాస్, ఎన్నమనేని శ్రీనివాసరావు, శామకూర ఐలయ్య, సింగిల్ విండో డైరెక్టర్ జనార్దన్ రాజు, లేగల వెంకటరెడ్డి, కుమారస్వామి, గుగులోత్ శంకర్, భూసాని ఉప్పలయ్య, తదితరులు పాల్గొన్నారు.