ఎల్ఆర్ఎస్(ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం) ఫీజు వసూలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ కదం తొక్కింది. ఈమేరకు ఫీజును రద్దు చేసి ఉచితంగా చేయాలనే డిమాండ్‌తో బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ధర్నాలు నిర్వహించి కాంగ్రెస్ సర్కారును ఎండగట్టింది. ఆయా చోట్ల తలపెట్టిన నిరసన కార్యక్రమాల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులతో కలిసి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనగా ప్లకార్డుల ప్రదర్శనలు, నినాదాలతో మున్సిపల్ కేంద్రాలు హోరెత్తాయి. ఎన్నికలప్పుడు అనేక సభల్లో ‘ఎల్ఆర్ఎస్ ఉచితం’ అంటూ మోసపూరిత ప్రకటనలు చేసి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాటమార్చి ప్రజలను దగా చేస్తున్నదంటూ ధ్వజమెత్తారు. ప్రజలపై ఆర్థిక భారం మోపకుండా ఫీజును రద్దు చేయాలంటూ ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 6
వరంగల్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు ప్లకార్డులు చేతబూని నిరసనలతో హోరెత్తించారు. నర్సంపేటలో మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేసి అధికారులకు వినతిపత్రం అందజేశారు. గతంలో అదే విధానాన్ని రద్దు చేయాలని గొంతు చించుకున్న కాంగ్రెస్ నాయకులు నేడు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజల సొమ్మును దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నదని ధ్వజమెత్తారు.
జనగామ ఆర్టీసీ చౌరస్తాలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. మార్చి 31 వరకు ఎల్ఆర్ఎస్ కట్టి తీరాలని ప్రజల మెడమీద కత్తి పెట్టారని, ఎల్ఆర్ఎస్ ప్రభుత్వ ఖజానా నింపడానికే అన్నట్లుగా ఉందని పల్లా ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన మాట ప్రకారం 25 లక్షల 44 వేల మంది దరఖాస్తుదారులకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పార్టీ శ్రేణులతో కలిసి బైఠాయించి నిరసన తెలిపారు. ఎల్ఆర్ఎస్ ఫీజు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలప్పుడు ఉచితం అని ఇప్పుడేమో ప్రజల నుంచి రూ.20వేల కోట్లు వసూలు చేసేందుకు సిద్ధపడిందని, దీని వల్ల 25లక్షల పైచిలుకు కుటుంబాలపై భారం పడుతుందన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే విరమించుకొని ఉచితంగా చేయాలన్నారు.
హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్ద బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్నాలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. అమలు సాధ్యంకాని, ‘ఉచిత’ హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని దాస్యం ధ్వజమెత్తారు. ఎల్ఆర్ఎస్ విషయంలో నేడు కలెక్టర్లకు, మున్సిపల్ కమిషనర్లకు వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాల్సిందేనని.. లేకపోతే పోరాటం ఉధృతం చేస్తామని సారయ్య హెచ్చరించారు. ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ తీరు మారాల్సిందేనన్నారు.
వర్ధన్నపేటలో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా, రాస్తారోకో చేసి అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఎలాంటి రుసుము లేకుండా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.