సుబేదారి, జూన్ 21 : బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అక్రమ అరెస్ట్ బీఆర్ఎస్ భగ్గుమంది. శనివారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయం వద్ద పోలీసుల నిర్బంధం మొదలు రాత్రి 8గంటల దాకా హెటెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధకాండపై పార్టీ శ్రేణులు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపట్టడంతో సుబేదారి పోలీస్‌స్టేషన్ ప్రాంగణం అట్టుడికింది. అక్రమ అరెస్టులను నిరసిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిప్పులు చెరిగారు. కాంట్రాక్టర్ కట్టా మనోజ్‌రెడ్డి భార్య ఉమాదేవి ఫిర్యాదు మేరకు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై ఏప్రిల్ 22న సుబేదారి పోలీసులు బీఎన్ఎస్ 308(2), 308(4), 352 సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలో భాగంగా శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కౌశిక్‌రెడ్డిని వరంగల్ పోలీసు కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్బంధించి, సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. మధ్యాహ్నం వరకు పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యేను నిర్బంధించారు. అదనంగా నాన్ బెయిలబుల్ సెక్షన్ 308(5) జత చేసి పక్కాప్లాన్‌తో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత పోలీసు అధికారులు భారీ భద్రత మధ్య కౌశిక్‌రెడ్డిని వైద్య పరీక్షల కోసం ఎంజీఎంకు తీసుకెళ్లారు. ఆ తర్వాత కాజీపేట రైల్వే కోర్టులో మెజిస్ట్రేట్ సీహెచ్ సుస్మిత ముందు హాజరుపరచగా, జడ్జి బెయిల్ మంజూరు చేశారు. దీంతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిన న్యాయ మే గెలిచిందంటూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పటాకలు కాల్చుతూ సంబురాలు జరుపుకొన్నారు. బెయిల్ మంజూరైన తర్వాత కౌశిక్‌రెడ్డి కోర్టు నుంచి రావడంతోనే మాజీ మంత్రి దయాకర్‌రావు, మాజీ చీఫ్ వినయ్‌భాస్కర్ ఆలింగనం చేసుకొని హర్షం వ్యక్తం చేశారు.
కౌశిక్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ బీఆర్ఎస్ విద్యార్థి సంఘం నాయకులు సుబేదా రి పోలీసుస్టేషన్ ఎదుట సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రేవంత్‌రెడ్డి ప్రభు త్వం రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగిస్తూ, ప్రధాన ప్రతిపక్ష నేతలను అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓటుకు నోటు కేసు దొంగ రేవంత్‌రెడ్డి అని నినాదాలు చేశారు. ఈక్రమంలో విద్యార్థి నాయకులను పోలీసులు ఈడ్చుకెళ్లి వాహనాల్లో పడేయడం తో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని వాహనాల్లో కాజీపేట, మడికొండ పోలీస్స్టేషన్లకు తరలించారు. అరస్టైన వారిలో బీఆర్ఎస్వీ నాయకలు శరత్ చంద్ర, వీరేందర్, సదంత్, రాంముర్తి, చోటు, శ్రవ ణ్, రాజ్‌కుమార్, అరూరి రంజిత్, రాజ్‌గోపాల్ తదితరులు ఉన్నారు. కౌశిక్‌రెడ్డిని పోలీ సు స్టేషన్ నుంచి ఎంజీఎంకు తీసుకువెళ్తున్న క్రమంలో మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్ జై తెలంగాణ నినాదాలు చేయడంతో ఓ ఎస్సై కాలర్‌పట్టి అత్యుత్సాహం ప్రదర్శించాడు. దీంతో బీఆర్ఎస్ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సీఎం రేవంత్‌రెడ్డికి జై తెలంగాణ నినాదం అంటే గిట్టదని, తెలంగాణ కోసం కోట్లాడినోడు కాదు కదా.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి పోలీసులు కొమ్ము కాస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నాపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. ఏకే47 అవుతా. నాకు బెయిల్ మంజూరు కావడానికి కృషిచేసిన బీఆర్ఎస్ లీగల్ టీమ్‌కు చేతులు జోడించి నమస్కరిస్తున్నా. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్న బండారాన్ని రేపు హైదారాబాద్‌లో ప్రెస్‌మీట్ ద్వారా బయటపెడుతా. నాకు అండగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు పేరుపేరున ధన్యావాదాలు. – ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
జనగామ, (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కాంగ్రెస్ నియంతృత్వానికి తలొగ్గే ప్రసక్తే లేదు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అక్రమ అరెస్టు ఖండిస్తున్నా. శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేసి కేసులు బనాయించడం దుర్మార్గమైన చర్య. ఇప్పటికే కౌశిక్‌రెడ్డిపై ఎన్నో తప్పుడు కేసులు బనాయించారు. వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలి. అకడ ఎవరు ఏమిటో ఆ గ్రామ ప్రజానీకానికి, మండలానికి బాగా తెలుసు. కాం గ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని, దుర్మార్గాలను అడుగడుగునా ప్రశ్నిస్తున్నందుకే బీఆర్ఎస్ నేతలపై కక్ష సాధింపుగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మాకు న్యాయస్థానాలపై విశ్వాసం ఉంది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, తప్పుడు కేసులు పెట్టినా ప్రజల కోసం, ప్రజల పక్షాన పోరాటం ఎప్పటికీ ఆగదు. – జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
కౌశిక్‌రెడ్డి అక్రమ అరెస్ట్ సందర్భంగా వరంగల్ పోలీసు కమిషనరేట్ నుంచి పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు సుబేదారి పోలీస్‌స్టేషన్ ముందు మోహరించాయి. రోడ్లను బ్లాక్ చేసి పీఎస్ లోపలికి ఇతరులు ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు అడ్డుపెట్టి, భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ సందర్భం గా కౌశిక్‌రెడ్డిని పరామర్శించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. మీడియా ప్రతినిధులను సైతం లోపలికి అనుమతించలేదు. కాగా పోలీసుల ఓవర్‌యాక్షన్‌పై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసి ఆందోళనకు దిగారు. పోలీసులు రోజంతా వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది.
కౌశిక్‌రెడ్డి అరెస్ట్ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, శంకర్‌నాయక్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రాకేశ్రెడ్డ్డి, బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ నాయకులు సహోదర్‌రెడ్డి, పలువురు న్యాయవాదులు, హుజూరాబాద్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి నాయకులు పెద్ద సంఖ్యలో సుబేదారి పోలీసుస్టేషన్ తరలివచ్చారు. కౌశిక్‌రెడ్డిని పరామర్శించడానికి బీఆర్ఎస్ నేతలు స్టేషన్ లోపలికి వెళ్లే క్రమంలో పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు ఘర్షణ జరిగింది. చివరికి ముఖ్య నాయకులను లోపలికి వెళ్లడానికి అనుమతించారు. అనంతరం కుట్రపూరితంగా పెట్టిన నాన్ బెయిలబుల్ కేసులను రద్దు చేయాలని సీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ను కలిసి కోరారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయభాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, శంకర్‌నాయక్, రాకేశ్‌రెడ్డి, పలువురు నాయకులు పోలీసుస్టేషన్లో అరస్టైన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని పరామర్శించి ధైర్యం చెప్పారు. కౌశిక్‌రెడ్డి సతీమణి షాలిని, సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు పరామర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కూట్రపూరితంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులపై పెట్టే తప్పుడు కేసులకు భయపడేది లేదు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై, ప్రజా సమస్యలపై పోరాడుతాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
– చల్లా ధర్మారెడ్డి, దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు
రేవంత్‌రెడ్డి తప్పులను ఎండగడుతున్న ఎమ్మెల్యే పాడికౌశిక్రెడ్డిపై అక్రమ కేసు పెట్టారు. బెయిల్ రాకుండా చేయాలని సెక్షన్లు కూడా మార్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది కొన్ని రోజులే. పోలీసులపై ఒత్తిడి ఉంది. కౌశిక్‌రెడ్డికి బెయిల్ కోసం గొప్పగా వాదించిన బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్‌కు కృతజ్ఞతలు. కాంగ్రెస్ నేతలను తన్ని తరిమే రోజులు దగ్గరలోనే రానున్నాయి.
– మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై పెట్టిన కేసు కుట్ర కేసు అని తేలిపోయింది. కౌశిక్రెడ్డిను రి మాండ్‌కు పంపిస్తున్నారని సోషల్‌మీడియాలో తప్పడు కథనాలు ప్రసా రం అయ్యాయి. మూడున్నర గంటల పాటు వాదనలు విన్న తర్వాత బెయిల్ మంజూరైంది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టి నా పార్టీ లీగల్ సెల్ ద్వారా ఎదుర్కొం టాం. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్సే.
– ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్
హనుమకొండ చౌరస్తా : రాజకీయ కక్షసాధింపులో భాగంగానే పాడి కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ఎప్పటికప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నందుకే అరెస్ట్ చేశారు. ఒక ఎమ్మెల్యే అని కూడా చూడకుండా కనీసం ములాఖాత్‌కు కూడా అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం హింసించాలని చూస్తున్నదని. ఇది ప్రజాపాలనలా లేదు, పైశాచిక పాలనలా ఉన్నది. అక్రమ మైనింగ్ చేస్తున్న దళారులను ప్రశ్నించి, ప్రజల కోసం నిలబడిన నాయకుడిపై అక్రమ కేసులు పెట్టడం దారుణం. అక్రమ కేసులతో విచారణ పేరుతో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను సైతం వేధిస్తున్నారు.
– బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి