కాశీబుగ్గ, నవంబర్ 17 : ఒకవైపు ప్రకృతి.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పత్తి రైతులపై పగబట్టాయి.. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.. ఇటీవల కురిసిన వర్షాలకు పంటంతా దెబ్బతినగా.. చేతికొచ్చిన పత్తిని అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సీసీఐ పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం.. చేసినా అమ్ముకునేందుకు కపాస్ కిసా న్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలనే నిబంధన పెట్టడం తలనొప్పిగా మారింది. దీనికి తోడు అకాలంతో పంటను కోల్పోయిన అన్నదాతకు మద్దతు ధర దక్కకపోవడం మరింత ఆర్థిక నష్టానికి కారణమవుతున్నది.
ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసంబద్ధ విధానాలు, నిర్లక్ష్య వైఖరి ఆశనిపాతంలా మారింది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాటన్ మిల్లర్స్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (టీసీఎంటీడబ్ల్యూఏ) సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లను నిరవధికంగా నిలిపివేసింది. అయినా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటి వరకు కాంగ్రెస్ సర్కారు అనాలోచిత నిర్ణయాలతో అనేక కష్టా లు పడుతున్న అన్నదాతలకు అండగా ఉంటున్న బీఆర్ఎస్ ఇప్పుడు పత్తి రైతుల పక్షాన పోరాటానికి సిద్ధమైంది. మంగళవారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఎదుట నిరసన తెలిపేందుకు నిర్ణయించింది.
పత్తి కొనుగోళ్లు నిలిపివేయడంతో ఎనుమాముల మార్కెట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. రైతులతో పాటు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే పత్తి రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆరుగాలం శ్రమించి పంట పండించిన పత్తి రైతుకు మద్దతు ధర అందని ద్రాక్షలా మారిందన్నారు. రైతులు ఇబ్బందులకు గురవుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, దీంతో రైతులు ఆగమవుతున్నారని పెద్ది, నన్నపునేని ధ్వజమెత్తారు.
కాశీబుగ్గ, నవంబర్ 17 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు బంద్ అయ్యాయి. ఎప్పుడూ పత్తి బస్తాలతో కళకళలాడే యార్డు వెలవెలబోయింది. తెలంగాణ కాటన్ మిల్లర్స్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (టీసీఎంటీడబ్ల్యూఏ) నిరవధిక కొనుగోళ్ల బంద్ నిర్ణయం మేరకు రైతులు తమ పత్తిని మార్కెట్‌కు తీసుకురాలేదు. ఇద్దరు రైతులు మాత్రం సుమారు 30 బస్తాలు తీసుకురాగా యార్డులోని షెడ్లో భద్రపర్చారు. కొనుగోళ్లు ప్రారంభమైనప్పుడే అమ్ముకుంటామని రైతులు తమ ఇంటికి వెళ్లిపోయారు. కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా క్రయవిక్రయాలు నిలిపివేసినట్లు టీసీఎంటీడబ్ల్యూఏ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి తెలిపారు. తమ సమస్యలను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి విన్నవించినా ఫలితం లేదన్నారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అవలంభిస్తున్న అసమతుల్య అలాట్మెంట్, స్లాట్ బుకింగ్ విధానాలతో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యం వహించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తమ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీసీఐ జాబ్ వర్క్ టెండర్ ఫైనలైజేషన్ ద్వారా రూ. 1,440 ధర నిర్ణయించి 322 కాటన్ జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేసిన రాష్ట్ర ప్రభుత్వం వారికి సరిపడా పని కల్పించడం లేదన్నారు. ఎల్1, ఎల్2, ఎల్3 విధానంతో వెసులుబాటు కల్పించి అన్ని మిల్లులు నడిచేలా చూస్తామన్న హామీ అమలుకావడం లేదన్నారు. దీంతో జాబ్ వర్క్ అలాట్మెంట్ కొన్ని మిల్లులకే చేసి మిగతా వాటికి చేయకపోవడం వల్ల ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన లేబర్ పనిలేక వెనుతిరిగిపోతున్నారని తెలిపారు. మిల్లుల నెలసరి మెయింటనెన్స్ చార్జీలు అదనంగా పడుతున్నాయని, దీంతో ఆర్థికంగా నష్టపోతున్నట్లు తెలిపారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు ప్రైవేట్, సీసీఐ పత్తి కొనుగోళ్లు నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.