BRS | తొర్రూరు, అక్టోబర్ 5: ఆరు గ్యారంటీల పేరుతో మోసగించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఇచ్చిన గ్యారంటీల్లో ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయకపోవడంతో తెలంగాణ ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారని తెలిపారు. ఆరు గ్యారంటీలను పూర్తిగా అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడగాలని డిమాండ్ చేశారు.
తొర్రూరు మండలంలోని గుర్తూర్, నాంచారి మడూరు గ్రామాల్లో జరిగిన గ్రామ సమావేశాల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు మంగళపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇంటింటికి గ్యారంటీ కార్డులు పంచి తప్పుడు వాగ్దానాలు చేసి, 100 రోజుల్లో అన్ని అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఓట్లు దండుకుందని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. ప్రజలు ఇప్పుడు వాస్తవం గ్రహించారని.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.