‘ఎండిపోయిన చేన్లను చూస్తుంటె బాధేస్తున్నది. మీ కన్నీళ్లు తుడిచి గుండె ధైర్యం నింపేందుకే వచ్చిన. అధైర్యపడొద్దు. మీరు ధైర్యంగ ఉంటెనే నేను గుండె నిబ్బరంతో ఉంటా. అందరికీ నేనున్నా. అందరం కలిసి పోరాటం చేద్దాం’ అని రైతులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భరోసానిచ్చారు. అన్నదాతలకు అండగా ఉండేందుకు పొలంబాట పట్టిన కేసీఆర్, ఆదివారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్‌తండాలో ఎండిన పంటలను పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకొని భుజం తట్టి ఓదార్చారు. ధరావత్‌తండాకు చెందిన అంగోత్ సత్తెమ్మ ఇంట్లో రెండురోజుల్లో జరిగే పెండ్లికి రూ.5 లక్షల సాయం ప్రకటించారు.
ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రం నుంచి రోడ్డు మార్గంలో ప్రత్యేక బస్సులో వచ్చిన కేసీఆర్‌కు జనగామ జిల్లా పెంబర్తి నుంచి నెల్లుట్ల, నవాబ్‌పేటలో రహదారి పొడవునా ప్రజలు ఘనస్వాగతం పలికారు. జనగామ-సూర్యాపేట ప్రధాన మార్గంలోని ధరావత్‌తండా వద్దకు కేసీఆర్ మధ్యాహ్నం 12.06 గంటలకు చేరుకుని 12.28 గంటల వరకు ఉన్నారు. ఎండిన పొలాలను స్వయంగా పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడారు. అంగోత్ సత్తెమ్మకు చెందిన ఎనిమిదెకరాల్లో ఎండిన వరిని పరిశీలిస్తుండగా ఆమె మాట్లాడుతూ ‘మీరు లేరు.. అంతా ఆగమైపోతాంది. ఎనిమిదెకరాల్లో వేసిన వరి నీళ్లు లేక కండ్ల ముందే ఎండింది. రూ.1.82 లక్షలు ఖర్చుపెట్టి నాలుగు బోర్లు వేసినా లాభం లేదు. పెట్టుబడికి తెచ్చిన రూ.3 లక్షల అప్పు మీద పడ్డది. నాలుగో తారీఖున కొడుకు రాజేందర్ పెండ్లి పెట్టుకున్నం. బిడ్డ పెండ్లికి కూడా అప్పయింది. పంట పండితే లగ్గం ఘనంగా చేయాలనుకున్నం.. ఇప్పుడు చేతిల చిల్లి గవ్వలేదు’ అని కన్నీటిపర్యంతమైంది. అదే తండాకు చెందిన రైతులు బానోత్ గేమానాయక్, పులుసోత్ ధన్సింగ్, గుగులోత్ లక్ష్మణ్, గుగులోత్ రాజమ్మ, కునుసోత్ జ్యోతి తమ కష్టాలను కేసీఆర్‌కు వివరించారు. ‘మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచిగుండె సార్. ఇప్పుడు అంతా అగమైంది. తొమ్మిదేండ్లు చెరువులు, కుంటల్లో నీళ్లుండేది.
కాలువల్లో నీళ్లు వచ్చేవి. బోర్లల్ల మంచిగ నీళ్లుండేది. అవన్నీ పోయినయ్.’ అంటూ రైతులు రాజమ్మ, జ్యోతి తమ బాధను వెళ్లగక్కారు. ‘తొమ్మిదేండ్ల తర్వాత పంటలన్నీ ఎండిపోయినయ్.. ఇప్పటికే నాలుగుసార్లు మోటర్లు కాలిపోయినయ్.. మళ్లీ కరువొచ్చింది. మేమెట్ల బతకాలె. అప్పులు ఎట్ల తీరాలె.. రూ.2లక్షల రుణమాఫీ కాలేదు. రైతు భరోసా సాయం మొత్తం పడలేదు. అప్పు చేసి తింటున్నం సారూ’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వారి గోడు విన్న కేసీఆర్ ‘నేనున్నా.. అధైర్యపడొద్దు.. అందరం కలిసి పోరాటం చేద్దాం.. మీరు ధైర్యంగ ఉంటెనే నా గుండెకు నిబ్బరం.. మళ్లీ వచ్చేది మనమే’ అంటూ భుజం తట్టి భరోసా ఇచ్చారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, జీ జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, వీ శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్రావు, సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య, మానుకోట ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, రెడ్యానాయక్, బానోత్ శంకర్‌నాయక్, చల్లా ధర్మారెడ్డి, ఫైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత, గ్యాదరి బాలమల్లు, జడ్పీ చైర్మన్ శ్రీరాం సుధీర్‌కుమార్, కేతిరెడ్డి వాసుదేవారెడ్డి, లింగంపల్లి కిషన్‌రావు, బీరవెళ్లి భరత్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.
జనగామ రూరల్/ పాలకుర్తి రూరల్ : ఎండిన పంటలను పరిశీలించేందుకు వచ్చిన రైతుబాంధవుడు కేసీఆర్‌కు ఉమ్మడి జిల్లా ముఖ ద్వారమైన పెంబర్తి కళాతోరణం, అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ‘జై కేసీఆర్.. జైజై కేసీఆర్’.. అంటూ నినాదాలతో హోరెత్తించారు. దారిపొడువునా మహిళలు స్వాగతించగా ప్రతి ఒక్కరికీ కేసీఆర్ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. కేసీఆర్‌ను చూసి ఒక్కసారిగా ప్రజలు సంతోషంతో కేరింతలు కొట్టారు. మధ్యాహ్నం 12.06గంటలకు చింతబావి తండాకు చేరుకున్న కేసీఆర్, 12.10గంటల నుంచి 12.33 గంటల వరకు రైతుల బాధలు తెలుసుకొని, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలానికి బయల్దేరారు.
అంగోత్ సత్తెమ్మ ఇంట్లో రెండురోజుల్లో జరిగే పెండ్లికి కేసీఆర్ రూ.5 లక్షల సాయం ప్రకటించారు. వెంటనే అందించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు సూచించారు. ‘నా పరిస్థితి అంతా పెద్దసారుకు చెప్పుకున్న.. ఆయన దయతలచి మా ఇంట్ల పెండ్లి ఖర్చులకు సాయంజేస్తనన్నడు.. కొడుకు పేరు మీద రూ.2.50లక్షలు, బిడ్డ పేరు మీద రూ.2.50లక్షలు ఇస్తామని చెప్పిండు. పంట ఎండి అప్పుల పాలైన మా కుటుంబం కష్టాలు తీర్చిన దేవుడు కేసీఆర్’ అంటూ సత్తెమ్మ కృతజ్ఞతను చాటుకుంది.
దేవరుప్పుల, మార్చి 31: కాంగ్రెస్ పాలకుల నిర్వాకంతో రిజర్వాయర్లలో నీళ్లుండీ రైతులకు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పంటల పరిశీలనలో ఎర్రబెల్లి మాట్లాడుతూ దేవరుప్పుల మండలంలో ముఖ్యంగా గిరిజన రైతులు సాగునీరు లేక అరిగోస పడుతున్నారన్నారు. అప్పులు తెచ్చి బోర్లు వేస్తున్నారని, అయినా నీరు రాక పొలాలు ఎండి బోరున ఎడుస్తున్నారని చెప్పారు. కనీసం పంటలు ఎండడానికి కారణాలు తెలుసుకొని సాగునీరందించే నాయకులు కనిపించడం లేదన్నారు. వంద రోజుల్లోనే ఇంత దారుణమైన మార్పు రావడం పాలకుల వైఫల్యమేనన్నారు. ఎండిన పంటలను చూసి కేసీఆర్ చలించిపోయారని, రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకిచ్చిన మాట నిలుపుకోవాలని, రైతుబంధును మొత్తం వేసి యాసంగి పంట క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కొడకండ్ల : ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కొడకండ్ల మండలం గిర్నితండా ఎక్స్‌రోడ్డు చెక్ పోస్టు వద్ద ఆదివారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాన్వాయ్‌ని అధికారులు తనిఖీ చేశారు. వారికి కేసీఆర్ సహకరించారు. ధరావత్ తండా పంటలను పరిశీలించి సూర్యాపేట జిల్లాకు వెళ్తున్న క్రమంలో ఆయన కాన్వాయ్‌ని ఆపి చెక్ చేశారు.
పాలకుర్తి రూరల్ : కేసీఆర్ పర్యటనకు బందోబస్తు కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ధరావత్‌తండా శివారు చింతబావి తండాకు చేరుకున్న సమయంలో తగిన బందోబస్తు లేక పార్టీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు, రైతులు ఒక్కసారిగా తరలిరావడంతో అందరూ ఇబ్బందులు పడ్డారు. కేసీఆర్‌కు పోలీసులు కాకుండా మాజీ మంత్రులు ఎర్రబెల్లి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ రక్షణ వలయంగా నిలిచారు. ఒక ఏసీపీ, సీఐ, ముగ్గురు ఎస్ఐలు మాత్రమే బందోబస్తు విధుల్లో ఉండడంతో స్థానికులను అదుపుచేయడం సాధ్యం కాలేదు.
దేవరుప్పుల, మార్చి 31 : ‘యాసంగి పంట మీద పుట్టెడు ఆశతోని కొడుకు పెండ్లి పెట్టుకున్న సారూ.. పదేండ్ల నుంచి ఎన్నడూ పొలం ఎండలే. అదే ఆశతో ఉన్నకాడికి నాటు పెట్టిన. మొత్తం అగ్గిపెట్టినట్లయింది. నీళ్ల కోసం యమ యాతన పడ్డం. రూ.1.80 లక్షలు ఖర్చు పెట్టి నాలుగు దిక్కులు నాలుగు బోర్లు వేసినం. ఒక్క దాంట్ల చెమట చుక్క ఎల్లలే. మరీ అన్యాయమైంది సారూ.’ అంటూ కొడుకు పెండ్లి పత్రిక కేసీఆర్ చేతికిచ్చింది.
కేసీఆర్: బాధపడకు సత్తెమ్మా.. నేనున్నా.. చేతగాని ప్రభుత్వం వచ్చింది. మళ్లీ మంచి రోజులు వస్తయి. పెండ్లికి ఎంతఖర్చయితది
సత్తెమ్మా.., నేను రూ. 5లక్షలు సాయం చేస్త. దయాకర్తోని పైసల్ పంపుత..
సత్తెమ్మ : మీరున్నన్ని రోజులు నీళ్లు ఫుల్లు వచ్చినయ్. కాంగ్రెస్ సర్కారు వచ్చింది.. నీళ్ల కరువచ్చింది. దయన్న ఉన్నప్పుడు రెండు కార్లు నీళ్లు వదిలేది. పచ్చర్లబాయి కుంట నిండేది.. బోర్లల్లకు నీళ్లు వచ్చేది. ఈ సారి సుక్క నీళ్లు లేవు. బోర్లెండిపోయినయి.
కేసీఆర్: బాధపడకు బిడ్డా నేనున్న. ఈ సారి ఎండి పోయింది. వచ్చే సారి పారుతదిలే..
‘గింత కరువు పదేళ్ల నుంచి చూడలే సారూ, మీరున్నప్పుడు నీళ్ల కరువు తెల్వదు.
కేసీఆర్: సరే అధైర్యపడకమ్మా.. వాళ్లకు నీళ్ల సోయి లేదు. మళ్ల మంచి రోజులు వస్తయ్. నేను చూసుకుంట..
జ్యోతి : పొలంల గింజ చేతికి రాలేదు. పసుల మేపినమ్. ఎనమిదెకరాలు నాటు పెడితే పొట్టమీద రెండెకరాలు ఎండింది. రెండు బోర్లు చుక్కలేకుంట ఎండినయ్. కొత్తగ మూడ బోర్లు ఏయించినమ్. బాయిల పూడిక తీయించినం. ఉన్న ఆరు ఎకరాలు వసర తళ్లు పారిస్తున్నం. ఎప్పుడు ఎండేది తెల్వది. నీళ్లిడిస్తె ఇంత పాపం కాకపోవు సారూ..
కేసీఆర్: సరే జరిగిందేదో జరిగింది. భరోసగ ఉండు. కాంగ్రెస్ సర్కారు మాటకు కట్టుబడి ధాన్యానికి రూ. 500 బోనస్ ఇవ్వాలి. పంట నష్టం చెల్లించాలి. నేను మా వోళ్లను పంపిస్త వాళ్లకు వివరాలు చెప్పు..
‘యాసింగిల మూడెకరాల నాటు పెడితే మొత్తం చేతికిరాకుండ ఎండిపోయింది. బోర్లల్ల నీళ్లు రాక మరో రెండు బోర్లు వేస్తె బండ పడింది. నీళ్లు లేక ఉన్న కాడికి ఎండి పోతే ఎడ్ల మేపిన. గతంల కాలువలు పారి చెరువులు నిండేది. ఈ సారి చుక్క నీళ్లు వదులలే. ఎందుకు ఇడుస్తులేరంటే సర్కారు మారిందంటుర్రు. పదేండ్ల నుంచి ఇంత నీళ్ల కరువు చూడలే సారూ
కేసీఆర్ : అధైర్య పడొద్దు లక్ష్మణ్ నాయక్. నేనున్నా.. మళ్లీ మంచి రోజులు తెచ్చుకుందాం..
సారూ ఇంత నీళ్ల కరువు ఉమ్మడి రాష్ట్రంల చూసినం గని, గత పదేండ్ల నుంచి చూడలే.
కేసీఆర్ : సర్పంచ్ సాబ్ ధరావత్ తండా అబివృద్ధి చేసినవా..
గేమానాయక్ : మంత్రి దయన్న దయ వల్ల అన్ని తండాలు అభివృద్ధి అయినయ్..సీసీ రోడ్లు వేసినం, భగీరథ నీరు వచ్చింది. గుట్టమీద పల్లె ప్రకృతి వనం కట్టినం. తండాలు బాగుపడ్డయ్
కేసీఆర్ : ఈ నీళ్ల కరువు ముచ్చటేంది
గేమానాయక్ : మంత్రి దయన్న చొరవతో రెండు పంటలకు కాలువలు వచ్చేటియి. అప్పుడే చెరువులు నింపుకొనేది. బోర్లల్ల ఫుల్లు నీళ్లుండేది. రెండు పంటలు పండేది. ఇప్పుడు నీళ్లు వదిలేసారును ఓడగొట్టిండ్రు. ఇప్పుడు ఎమ్మెల్యే పట్టించుకుంట లేదు. మా తండాల 80 పంటలు ఎండినయ్. గిరిజన రైతులు బోర్లెయ్యలేక సస్తుండ్రు. కూడబెట్టిన పైసలన్నీ బోర్లకే సరిపోతున్నయ్. మోటర్లు కాలుతున్నయ్. రైతులు మొత్తు కుంటుండ్రు.
కేసీఆర్ : మళ్లీ మన రోజులు వస్తయ్. మీ రైతులకు ధైర్యం చెప్పు. మనం అండగా ఉందాం. పార్టీ పక్షాన భరోసా ఇయ్యి. నేనున్నానని చెప్పు
పచ్చర్లబావి తండాకు చెందిన రాజమ్మ ధరావత్ తండాకు కేసీఆర్ వస్తుండని తెలిసి వచ్చింది. కేసీఆర్‌తో అందరూ మాట్లాడుతుండగా ఏడుస్తూ కనిపించింది.. ఏమైందమ్మా అని కేసీఆర్ ఆమెను అడుగగా మూడెకరాల పొలం మొత్తం ఎండిపోయిందని, రెండు బోర్లుంటే ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేసింది. ‘ధైర్యంగ ఉండు రాజమ్మా.. ఏం గాదు. మళ్ల మంచి రోజులు వస్తయి’ అని కేసీఆర్ భరోసా ఇచ్చారు.