నమస్తే నెట్వర్క్, ఆగస్టు 5 : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన వక్రీకరణ నివేదికపై బీఆర్ఎస్ కన్నెర్ర చేసింది. మొదటి నుంచీ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలనే తన రిపోర్టులో పొందుపర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ర్టానికే వరప్రదాయినిగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించిన కేసీఆర్‌ను బద్నాం చేసే కుట్రలకు తెరలేపిన కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడింది. ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించింది.
కుట్రపూరిత వ్యవహారాలు, డైవర్షన్ పాలిటిక్స్‌ను మానుకోవాలని సూచించింది. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్పై బురదజల్లే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా అదేదారిలో పయనిస్తున్నదని ఆరోపించింది. స్థానిక సంస్థల్లో లబ్ధిపొందే ఆలోచనతో కమిషన్ నివేదికను రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నదని విమర్శించింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీశ్‌రావు ‘కాళేశ్వరంపై కుట్రలు.. కమిషన్ వక్రీకరణ.. వాస్తవాలు’ పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఉమ్మడి ఆరు జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా లైవ్ టెలీకాస్ట్‌ను బీఆర్ఎస్ శ్రేణులు వీక్షించాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులతో పాటు ఇతర వర్గాలకు చేకూరిన లాభాలను అవగాహన చేసుకున్నాయి. అనంతరం సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు గ్రామాల్లో చర్చలు పెట్టి వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని ప్రతినబూనాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చాయి.
కాగా, జనగామ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ నాయకుడు పల్లా సుందరరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. హనుమకొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మారపెల్లి సుధీర్‌కుమార్, మర్రి యాదవరెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, కార్పొరేటర్లు చెన్నం మధు, సోదా కిరణ్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ఎస్ఎస్ గార్డెన్లో పరకాల, నర్సంపేట, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులకు లైవ్ టెలీకాస్ట్ నిర్వహించారు. ఇందులో మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, మాజీ జడ్పీటీసీలు పోలీసు ధర్మారావు, సుదర్శన్‌రెడ్డి, శ్రీనివాస్, నాయకులు నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, రాయిడి రవీందర్‌రెడ్డి, నల్లా మనోహర్‌రెడ్డి, వెంకట్‌నారాయణ, సత్యనారాయణ, ప్రవీణ్, సోషల్ మీడియా కన్వీనర్లు పాల్గొన్నారు.
మహబూబాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లునావత్ అశోక్‌నాయక్, నాయిని రంజిత్‌కుమార్, సుదగాని మురళి, దాము నాయక్, రామచంద్రు, నవీన్‌నాయక్ పాల్గొన్నారు. అలాగే మరిపెడలో డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే నిర్వహించిన విలేకరుల సమావేశంలో మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్‌రావు, మాజీ ఎంపీపీ గుగులోత్ వెంకన్న, మాజీ వైస్ ఎంపీపీ గాదె అశోక్‌రెడ్డి, అయూబ్ పాషా, రవీందర్, పానుగోతు వెంకన్న, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
ములుగులోని బీఆర్ఎస్ భవన్లో నిర్వహించిన లైవ్ టెలీకాస్ట్‌లో నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి, జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సిం హారావు, ములుగు, వెంకటాపూర్, తాడ్వాయి మండలాల అధ్యక్షు లు రమేశ్‌రెడ్డి, రమణారెడ్డి, నర్సింహానాయక్, మల్లయ్య, పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పోరిక గోవింద్‌నాయక్, నాయకులు కాకులమర్రి ప్రదీప్‌రావు, తాటి కృష్ణ, వేములపల్లి భిక్షపతి ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర, అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్, మున్సిపల్ మాజీ చైర్మన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధు, మాజీ వైస్ చైర్మన్ గండ్ర హరీశ్‌రెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ నూనె రాజు, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్‌కుమార్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి
గీసుగొండ : రాష్ట్రంలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి బీఆర్ఎస్పై బురద జల్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డికి ఆలవాటుగా మా రింది. స్థానిక ఎన్నికలు పెట్టే దమ్ములేక కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని పత్రికలు, ఛానల్స్‌కు లీకులిస్తూ విష ప్రచారం చేస్తున్నది. దీనిని బీఆర్ఎస్ శ్రేణు లు తిప్పికొట్టి స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి. కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు ఆ పార్టీ నాయకులు భయపడుతున్నారు. కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాన్ని ఆ పార్టీ ఎ మ్మెల్యేలే తప్పు పడుతున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కలిసి పనిచేసి గులాబీ జెండా ఎగురవేద్దాం. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పు డు ప్రచారాలను శ్రేణులు తిప్పికొట్టాలి. కార్యకర్తలను ఎవరు ఇబ్బంది పెట్టినా పార్టీతో పాటు మేమంతా అండగా ఉంటాం.
– పెద్ది సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
కమిటీ నివేదిక కాంగ్రెస్ కుట్ర పత్రం
జనగామ (నమస్తే తెలంగాణ), ఆగస్టు 5 : కాంగ్రెస్ కుట్ర పత్రం గా ఘోష్ కమిటీ నివేదిక తయారైంది. ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజలు, రైతులు నమ్మొద్దు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జస్టిస్ ఘోష్ కమిటీ సమర్పించిన నివేదికను కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రచారం చేస్తుంది. రాష్ట్ర అభివృద్ధికి ప్రాణ వాయువుగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టును కళంకితం చేయాలన్న కుట్రలో భాగం ఇది. హరీశ్‌రావు సమగ్ర విశ్లేషణ, ఆధారాలతో కూడిన ప్రజెంటేషన్ కుట్రను పూర్తి స్థాయిలో ఛేదించింది. వాస్తవాలను వెలికితీస్తూ, ప్రజల్లో నిజాలను చాటేలా ఈ ప్రజెంటేషన్ సాగింది. కేసీఆర్‌ను బద్నాం చేయాలని ప్రయత్నిస్తే తెలంగాణ రైతాంగం, ప్రజలు నమ్మరు. వారి కుట్రలను తిప్పికొడతారు.
– డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే, జనగామ
తెలంగాణకు జీవధార కాళేశ్వరం
హనుమకొండ : తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్ట్ జీవధార, ప్రాణధార. ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ కుట్రపూరిత వైఖరి అవలంబిస్తున్నది. కేసీఆర్‌ను బద్నాం చేయాలని చూస్తున్నది. తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాలు ఎజెండాగా సాగింది. 60 ఏళ్ల స్వరాష్ట్ర కలను 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటంతో సాధించారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు కాళేశ్వరం సహా పలు భారీ ప్రాజెక్టులను కేసీఆర్ హయాంలో నిర్మించారు. అత్యంత వేగంగా కాళేశ్వరాన్ని పూర్తిచేసి సాగు, తాగు నీటి అవసరాలు తీర్చారు.
జలయజ్ఞాన్ని ధన యజ్ఞంగా మార్చిన కాంగ్రెస్ కాళేశ్వరానికి సైతం అవినీతి మరకలు అంటించాలని చూస్తున్నది. మేడిగడ్డ వద్ద మూడు పిల్లర్లు కుంగితే ప్రాజెక్ట్ మొత్తాన్ని కాంగ్రెస్ బద్నాం చేస్తున్నది. ఈ అసత్య ప్రచారాలను తిప్పికొడదాం. 420 హామీలు, 6 గ్యారెంటీలు అమలు చేసే ధైర్యం లేక కాంగ్రెస్ కుట్రలు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది. రోజుకో కమిషన్, విచారణ పేరుతో ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తున్నది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కేసీఆర్‌పై బురద చల్లే ప్రయత్నం, కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నది. కాంగ్రెస్ తీరును ప్రజాక్షేత్రంలోనే ఎండగడతాం.
– దాస్యం వినయ్‌భాస్కర్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు
కాళేశ్వరంపై గ్రామాల్లో చర్చ పెట్టాలి
గీసుగొండ : బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కన్వీనర్లు కాళేశ్వరం ప్రాజెక్టుపై గ్రామాల్లో చర్చ పెట్టాలి. ప్రాజెక్టు వల్ల రైతులకు జరిగిన ప్రయోజనాన్ని వివరించాలి. రూ. 90 వేల కోట్లతో కాళేశ్వరం నిర్మిస్తే రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల తర్వాత రైతు భరోసా రాదు. సంక్షేమ పథకాలు అమలు కావు. రైతులు మళ్లీ మోసపోవద్దు. జాగ్రత్తగా ఉండి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి. ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలకు తెరపడుతుంది. రైతులకు సరిపడా యూరియా ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి వారి గురించి మాట్లాడే హక్కు లేదు. రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతుంటే మంత్రులు, అధికారులు కొరత లేదని చెప్పడం సిగ్గుచేటు.
– చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పరకాల
ఓర్వలేకనే కాళేశ్వరంపై కుట్రలు
ములుగు, (నమస్తేతెలంగాణ) : రాష్ర్టానికి గుండెకాయలాంటి కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారనే అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నది. కమిషన్లు, కమిటీ నివేదికల పేరుతో కాళేశ్వరంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కేసీఆర్ దూరదృష్టితో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టి లక్షల ఎకరాలకు నీరందించిన విషయం కండ్లకు కనిపిస్తున్నా సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరం కూలిందని ప్రచారం చేస్తున్నారు. కమిషన్ నివేదిక పేరుతో స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్ దుష్ప్రచారాలను బీఆర్ఎస్ కార్యకర్తలు తిప్పికొట్టాలి.
– బడే నాగజ్యోతి, ములుగు నియోజకవర్గ ఇన్చార్జి కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
గులాబీ జెండా ఎగురవేద్దాం
గీసుగొండ : కాంగ్రెస్, బీజేపీ కుటిల రాజకీయాలను ప్రజలు నమ్మొద్దు. ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్కు వచ్చే నష్టం ఏమీలేదు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి. మీకు పార్టీ, జిల్లా నాయకులం అండగా ఉంటాం. గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకొని గులాబీ జెండా ఎగురవేద్దాం. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ముందంజలో ఉండాలి. త్వరలో సోషల్ మీడియా జిల్లా స్థాయి సమావేశం వరంగల్‌లో నిర్వహించుకుందాం.
– నన్నపునేని నరేందర్, మాజీ ఎమ్మెల్యే, వరంగల్ తూర్పు
కాళేశ్వరంపై కాంగ్రెస్ విషం
కృష్ణకాలనీ : అన్ని అనుమతులతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం విషం చిమ్ముతున్నది. ఎంతో కమిట్మెంట్తో కట్టిన ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది. కేసీఆర్ పేరు చెడగొట్టేలా తప్పుడు ప్రచారం చేస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా కుంగిన పిల్లర్లను రిపేర్ చేయడంలో, పంపులను ఆన్ చేయడంలో పూర్తిగా విఫలమైంది. ఇప్పటికీ వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నా ప్రభుత్వానికి పట్టింపులేదు. కుంగిన పిల్లర్లను పకకు పెట్టి కేవలం మోటర్లు ఆన్ చేస్తే హైదరాబాద్ వరకు నీళ్లు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో కరువు పరిస్థితులు కనబడుతున్నాయి. రాష్ట్రంలో అప్పుడప్పుడు తప్ప రైతులకు ఉపయోగపడే వానలు పడడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు ఎండగడతాం.
– గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, భూపాలపల్లి
తప్పుడు ఆరోపణలు మానుకోవాలి
మహబూబాబాద్ రూరల్ : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు మానుకోవాలి. మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను అతి తక్కువ కాలంలో నిర్మించి రైతుల రెండు పంటలకు నీరందించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ కుటుంబంపై అసత్య ప్రచారాలు చేస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డి పరిపాలనపై దృష్టి పెట్టాలి. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం తెలంగాణకు ఒక మణిహారం. ఎండాకాలంలో సైతం కాళేశ్వరం ద్వారా చెరువులు నింపిన ఘనత కేసీఆర్‌ది. కాళేశ్వరంపై కాంగ్రెస్ చేస్తున్న ఆసత్య ప్రచారాలను శ్రేణులు తిప్పకొట్టాలి. వాస్తవాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి.
– బానోత్ శంకర్‌నాయక్, మాజీ ఎమ్మెల్యే, మహబూబాబాద్
అది కాంగ్రెస్ కమిషన్ రిపోర్టు
మరిపెడ : కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చింది కాంగ్రెస్ రిపోర్టు. మేడిగడ్డ బరాజ్‌లో మూడు పిల్లర్లు కుంగడాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సాకుగా చూపి బీఆర్ఎస్, కేసీఆర్‌ను బద్నాం చేస్తున్నడు. మిగతా బరాజ్‌ల నుంచి సాగునీరందించకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నడు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్, హరీశ్‌రావు అన్ని అనుమతులతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించి 50 ఏళ్ల కరువుకు పరిష్కారం చూపారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వకపోవడంతో లక్షలాది ఎకరాలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నరు. కేసీఆర్ హయాంలో ఎండాకాలంలోను జలాశయాలు అలుగులు పోశాయి. రేవంత్‌రెడ్డి రైతుల భవిష్యత్తు నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నడు. ఒక ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పర్యవేక్షించడం ముఖ్యమంత్రి బాధ్యత. దానిని తప్పుగా చూపడం హాస్యాస్పదం. పీసీ ఘోష్ కాంగ్రెస్ కార్యకర్తలాగా పనిచేసి నివేదిక ఇచ్చారు.
– డీఎస్ రెడ్యానాయక్, మాజీ ఎమ్మెల్యే, డోర్నకల్