కొన్ని బ్యాంకుల్లో దళారుల దందా నడుస్తున్నది. రైతుల అవసరాలను వారు ఆసరాగా చేసుకొని, అందినకాడికి దోచుకుంటున్నారు. అడిగేవారు లేకపోవడంతో అమాయక రైతులను మోసం చేసి క్యాష్ చేసుకుంటున్నారు. బ్యాంకుల్లో తీసుకున్న బంగారం, క్రాఫ్ లోన్లు తిరిగి చెల్లించేందుకు ఇబ్బందిపడుతున్న రైతుల రుణం మొత్తం వారే చెల్లించి, రూ.లక్షకు ఇంత చొప్పున కమీషన్ల వసూలు చేస్తున్నారు. గూడూరు మండల కేంద్రంలోని ఓ బ్యాంకులో ఈ కమీషన్ల దందా యథేచ్ఛగా సాగుతున్నది. రైతుల అవసరాలను గుర్తించడం.. వారి రుణం మొత్తం చెల్లించడం.. ముక్కుపిండి మరీ కమీషన్లు వసూలు చేయడం.. ప్రతి రోజూ వారికిదే బిజినెస్ కాగా, రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు.
– గూడూరు, జూన్ 15
వ్యవసాయ సీజన్ రాగానే పంట పెట్టుబడికి రైతు కు డబ్బులు అవసరముంటాయి. ఈ క్రమం లో తమ భూములు, బంగారాన్ని బ్యాంకులో తనఖా పెట్టి రుణాలను తీసుకుంటారు. బ్యాంకు లో రుణం పొందాలంటే గతంలో తీసుకున్న రుణాలు చెల్లిస్తేనే తిరిగి బ్యాంకు అధికారులు రు ణం ఇస్తారు. ఇందు లో రెండు రకాలు ఉంటాయి. బంగారంపై రుణం తీసుకున్న రైతు తిరిగి రుణం పొందాలంటే ఇంతకుముందు తీసుకున్న రుణం, వడ్డీతో సహా చెల్లించి, బంగారాన్ని విడిపించాలి. మళ్లీ అదే బంగారాన్ని తనఖా పెడితే.., అప్పుడున్న ధర ప్రకారం నిబంధనల మేరకు రుణం ఇస్తారు. ఇక క్రాఫ్లోన్ కావాలంటే గతంలో తీసుకున్న రుణం వడ్డీతో సహా చెల్లించడంతోపాటు ఆ రైతు లావాదేవీలు మెరుగ్గా ఉంటే గతంలో కంటే ఎక్కువ మొత్తంలో రుణం పొందే అవకాశం ఉం టుంది.
రైతు వద్ద మొత్తం డబ్బులు లేకపోతే కేవ లం వడ్డీ మాత్రం తీసుకొని మళ్లీ అదే ఖాతాపై గ తంలో తీసుకున్న రుణం మొత్తాన్ని రెన్యూవల్ చేస్తారు. కాగా, ఇక్కడే దళారులు ఎంటర్ అవుతారు. రైతు తాను తనఖా పెట్టిన బంగారం, తీసుకున్న క్రాఫ్లోన్లు విడిపించేందుకు ఇబ్బందిపడుతున్న రైతులను గుర్తిస్తారు. తామే బ్యాంకులో మొత్తం డబ్బు చెల్లిస్తామని అందుకు రూ.50వేల వరకు రూ.వెయ్యి నుంచి రూ.1500, రూ.60వేల నుంచి రూ.లక్ష వరకు రూ.2వేల నుంచి రూ.3 వేల వరకు కమిషన్ ఇవ్వాలని బేరమాడి, ఒప్పం దం చేసుకొని రైతులకు డబ్బులు చెల్లిస్తున్నారు. ఒకవేళ రైతుపై నమ్మకం లేకపోతే రైతుకు తెలిసిన వ్యక్తిని జమానత్గా తీసుకొని రైతులకు డబ్బులు ఇస్తున్నారు.
ఇలా మండలకేంద్రంలో ఓ బ్యాంకు లో దళారులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగుతున్నది. రైతులకు డబ్బులు చెల్లించి తిరిగి తమ డబ్బులు తాము పొందేందుకు దళారులు నిరంతరం బ్యాంకులోనే ఉంటున్నారు. ఏకంగా వీరు బ్యాంకు ఉద్యోగుల క్యాబిన్లోపలికి కూడా వెళ్లి పనులను చక్కబెట్టుకుంటున్నారని పలువురు ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. క్యూలైన్లలో నిలబడిన ఖాతాదారులకు సకాలంలో సేవలు అందడంలేదని, దళారుల పని తొందరగా అవుతున్నదని వాపోతున్నారు. కాగా, దళారులు తాము డబ్బులు ఇచ్చిన రైతుల వద్ద విత్ డ్రా వోచర్లను ముందుగానే తీసుకొని రైతు బ్యాంకు ఖాతాలో డబ్బులు పడగానే దగ్గరుండి విడిపించుకొని వెంటనే కమీషన్ తీసుకుంటున్నారు.
కొంతమంది దళారులు రైతు ద్వారా విత్డ్రా వోచర్ రాయించుకొని నేరుగా తమ ఖాతాకు జమ చేయించుకుంటున్నారు. ఇలా రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని దళారులు ఎక్కువ మొత్తంలో కమీషన్లు తీసుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారుల వల్ల తాము ఎక్కువగా నష్టపోతున్నామని, వ్యవసాయ సీజన్లో రైతులకు మేలు చేసేలా ప్రభుత్వం కొన్ని నిబంధనలు సడలించాలని రైతులు కోరుతున్నారు. గతంలో వడ్డీలు చెల్లించి రెన్యూవల్ చేసుకొనే వారమని, ఇప్పుడు కూడా క్రాఫ్లోన్, బంగారం రుణాలపై కేవలం వడ్డీలు చెల్లిస్తే, తిరిగి తమ రుణాలను రెన్యూవల్ చేసి, అవసరమున్న మేరకు అదనంగా రుణం ఇచ్చేలా ప్రభుత్వం నిబంధనలు మార్చి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.