హనుమకొండ, మార్చి 28 : బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ వచ్చే 25 ఏండ్ల తెలంగాణ ప్రగతికి ప్రణాళికగా ఉంటుందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. కొత్త తరానికి కొత్త ఆలోచనలు కలిగించే వేదికగా ఈ బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఒడితల సతీశ్‌కుమార్, నన్నపునేని నరేందర్, బానోత్ శంకర్‌నాయక్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, కే వాసుదేవారెడ్డితో కలిసి వినోద్‌కుమార్ శుక్రవారం బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 25 ఏండ్ల క్రితం బీఆర్ఎస్ పుట్టినప్పుడు.. మూణ్నాళ్లకే పోతుందని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పీసీసీ అధ్యక్షుడు వైఎస్ఆర్ లాంటి వారి మాట్లాడారని చెప్పారు. సమైక్య పార్టీల విమర్శలు తప్పని రుజువు చేస్తూ బీఆర్ఎస్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిందని, కొత్త రాష్ర్టాన్ని అభివృద్ధి చేసిందన్నారు. తెలంగాణ వచ్చేది కాదు, సచ్చేది కాదని మాట్లాడిన సమైక్య రాష్ట్ర పార్టీల నాయకులకు బీఆర్ఎస్ ప్రస్థానమే పెద్ద జవాబు అని చెప్పారు. ఏప్రిల్ 27న హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ గొప్పగా నిలుస్తుందన్నారు.
బీఆర్ఎస్ 25 ఏండ్ల సభను ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిర్వహించాలని నిర్ణయించిన బీఆర్ఎస్ అధినేతకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఎలతుర్తి మండలకేంద్రంలో 1,214 ఎకరాల్లో సభ నిర్వహించేందుకు రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని చెప్పారు. భూములు ఇచ్చి సహకరించిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ గతంలో లక్షలాది మందితో సభలు నిర్వహించిందన్నారు. సభ నిర్వహణకు అవసరమైన అన్ని అనుమతులకు దరఖాస్తులు చేసినట్లు తెలిపారు.
తెలంగాణ ప్రజల కోసం పుట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ తెలంగాణలో రాజకీయంగా గొప్ప మలుపులకు కారణమవుతుందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా ఉద్యమించిన బీఆర్ఎస్కు వరంగల్‌తో సెంటిమెంట్ ఉన్నదని, ఇప్పుడు హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ 25 ఏండ్ల పండుగ జరుగనున్నదని చెప్పారు. లక్షలాదిగా తరలివచ్చే జనాలకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు లక్షలాదిగా తరలి రావాలని కోరారు.
హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి మండలకేంద్రంలో లక్షలాది మందితో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను నిర్వహిస్తున్నట్లు పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ తెలిపారు. తెలంగాణ ప్రజల 60 ఏండ్ల కలను సాకారం చేసిన పార్టీ బీఆర్ఎస్ ఒక్కటేనన్నారు. ఒకే ఒకడిగా మొదలైన కేసీఆర్ ప్రాణాలకు తెగించి కొట్లాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారని చెప్పారు. 25 ఏండ్ల పాటు ప్రజల ఆకాంక్షల మేరకు బీఆర్ఎస్ పనిచేసిందన్నారు. దేశమంతా తెలంగాణ వైపు చూసేలా చేసిన నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల పార్టీ అన్నారు.