పాలకుర్తి రూరల్, మే 3 : అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేర మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయనందున ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులను ప్రజలు నిలదీయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారితో కలిసి పాలకుర్తి మండలంలోని గ్రామాల్లో సన్నాహక సమావేశాల్లో ఎర్రబెల్లి పాల్గొని మాట్లాడారు. కేవలం ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. ఆగస్టు 15లోపు రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి దేవుళ్లపై ప్రమాణం చేస్తూ దొంగ ఒట్లు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి మాటలన్నీ అబద్ధాలేనని పేర్కొన్నారు. ప్రజలను మోసం చేయడంలో రేవంత్‌రెడ్డిని మించిన నాయకుడు లేడన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీలకు బుద్ధి చెప్పి బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్‌కుమార్‌ను గెలిపించాలని కోరారు.
బీఆర్ఎస్ కార్యకర్తల కష్టార్జితంతో ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి అధికార దాహంతో కాంగ్రెస్‌లో చేరిన ఓ రాజకీయ బ్రోకర్ అని ఎర్రబెల్లి విమర్శించారు. శ్రీహరికి రాజకీయ జీవితం తాను పెట్టిన భిక్షేనన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్‌రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, జీసీసీ మాజీ చైర్మన్ ధరావత్ గాంధీనాయక్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ మదార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముస్కు రాంబాబు, ఎఫ్ఎస్సీఎస్ బ్యాంక్ చైర్మన్ బొబ్బల ఆశోక్‌రెడ్డి, మాజీ చైర్మన్ అడ్డూరి మాధవరావు, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, మాజీ సర్పంచ్‌లు వీరమనేని యాకాంతారావు, ఇమ్మడి ప్రకాశ్, నకీర్త యాకయ్య, మాటూరి యాకయ్య పాల్గొన్నారు.
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి వాటిని నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీని ఎండగట్టాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి కోరారు. బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త, నాయకుడు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతదేశంలో అన్ని రంగాల్లో వెనుకబడిన తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ సీఎం అయ్యాకే అభివృద్ధి సాధించిందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. బీజేపీ మతం పేరుతో రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రజల గొంతుకై పోరాడే ఇంటి పార్టీ బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు.