వరంగల్, ఫిబ్రవరి 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీజేపీలో బీసీ చిచ్చు రగులుకున్నది. బీజేపీ జిల్లా అధ్యక్షుల నియామక ప్రకియపై బీసీ నేతలు భగ్గుమంటున్నారు. ఆగ్రవర్ణాల పార్టీ అనే ముద్రను కొనసాగించేలా రాష్ట్ర నాయకత్వం తీరు ఉన్నదని మండిపడుతున్నారు. ఇటీవలి వరకు రెండు దఫాలుగా బీజేపీ జిల్లా అధ్యక్ష పదవిలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన రావు పద్మ ఉన్నారు. తాజాగా కొలను సంతోష్‌రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకున్నది. హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవిని మరోసారి రెడ్డి సామాజికవర్గం వారికే కట్టబెట్టడంపై ఆ పార్టీలోని బీసీ నేతలు, కార్పొరేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర నాయకత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్పొరేటర్లు రావుల కోమల, బైరి లక్ష్మి, గుజ్జుల వసంత, వన్నాల వెంకటరమణ సోమవారం సమావేశమయ్యారు. బీజేపీలో ఎమ్మెల్యే టిక్కెట్లు, పార్టీ జిల్లా అధ్యక్ష పదవులన్నీ ఒక వర్గం వారికే కేటాయించడం సరికాదని అసంతృప్తి వెల్లగక్కారు. జిల్లాల పునర్విభజన జరిగి దాదాపు పదేండ్లు కావస్తున్నదని, ఇప్పటికి ఒక్కసారి అయినా బీసీలకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వలేదని చెబుతున్నారు. పార్టీలో బీసీలకు అన్యాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకపోవాలని సమావేశంలో నిర్ణయించారు.
బీజేపీలో బీసీలకు కీలక పదవులు దక్కడం లేదనే అభిప్రాయం ఉన్నది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రావు పద్మ రెండు సార్లు బీజేపీ జిల్లా అధ్యక్ష పదవిలో ఉన్నారు. ఆదివారం సాయంత్రం వరకు బీసీ వర్గానికి చెందిన రా వుల కిషన్‌కు జిల్లా అధ్యక్ష పదవి ఖరారైందని బీజేపీ వర్గా లు చెప్పాయి. అర్ధరాత్రి తర్వాత రెడ్డి వర్గం నేతల రాజకీయంతో బీసీకి అన్యాయం జరిగిందంటున్నారు. మూడు దశాబ్దాలుగా ఉన్న కిషన్‌కు మరోసారి అన్యాయం జరిగిందని, బీసీ వర్గాలకు అన్యాయం చేయడంతో పార్టీకి నష్టం జరుగుతుందని చెబుతున్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మకు టిక్కెట్ ఇచ్చారని, అన్ని పదవులు ఒకే వర్గం వారికి ఇవ్వడం సరికాదంటున్నారు. ఉమ్మడి జిల్లా బీజేపీ చరిత్రలో రెండుసార్లు మినహా అన్నిసార్లు ఒకే వర్గం వారికి బీజేపీ అధ్యక్ష పదవి చేపట్టారని, ఇప్పుడు అదే తరహాలో బీసీలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి పరిస్థితిని వివరించి అల్టిమేటం ఇవ్వాలని బీసీ నేతలు నిర్ణయించారు. తగిన చర్యలు తీసుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సదరు నేతలు నిర్ణయించారు.