Mulkanuru | భీమదేవరపల్లి, మార్చి 18 : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ కేంద్రంగా 30 పడకల ప్రభుత్వాసుపత్రిని కేటాయించకపోతే హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడిస్తామని బీజేపీ జిల్లా నాయకులు పైడిపల్లి పృధ్విరాజ్ హెచ్చరించారు. మంగళవారం ముల్కనూరులో సిద్దిపేట – హనుమకొండ ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్కన్నపేట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలకు రవాణా సౌకర్యం కలిగి ఉన్న ముల్కనూర్‌లో 30 పడకల ప్రభుత్వాసుపత్రిని వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి, కనీసం పేద ప్రజలకు వైద్యాన్ని అందించలేని దౌర్భాగ్య పాలన రాష్ట్రంలో కొనసాగుతుందన్నారు. ఎమ్మెల్యేగా గెలిచే ముందు రోజుకో గ్రామంలో పాదయాత్ర చేస్తా అని చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్ 15 నెలల్లో ఒక్క గ్రామంలో కూడా పాదయాత్ర చేయలేదని, కనీసం పేద ప్రజలను కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎల్కతుర్తి నుండి మెదక్ వరకు రూ. 850 కోట్లతో నాలుగు లైన్ల రోడ్డు వేస్తుంటే రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలనకు వచ్చారని తెలిపారు. అంతేగానీ పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ ఆసుపత్రిని మాత్రం కట్టించలేకపోతున్నారని విమర్శించారు. నెలరోజుల్లోగా ముల్కనూరులో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కేటాయించకపోతే 24 గ్రామాల ప్రజలతో కలిసి హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు శ్రీరామోజు శ్రీనివాస్, నాయకులు దొంగల కొమురయ్య, గండు సారయ్య, గుండెల్లి సదానందం, తీగల రాజు, దొంగల వేణు, లక్కిరెడ్డి మల్లారెడ్డి, రాణా ప్రతాప్, బొజ్జపురి పృధ్విరాజ్, భైరి సదానందం, సిద్దమల్ల రమేష్, కోడేటి బిక్షపతి, ప్రదీప్ రెడ్డి, శ్రీకాంత్, సాయి, నవీన్, భాస్కర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.