బచ్చన్నపేట సెప్టెంబర్ 10 : తెలంగాణ రైతంగ సాయుధ పోరాట నిప్పు కనిక చాకలి ఐలమ్మ అని సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్ అన్నారు. బుధవారం జనగామ జిల్లా బచ్చన్నపేటలోని సిపిఎం కార్యాలయంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరురాలు చిట్యాల ఐలమ్మ చిత్రపటానికి సిపిఎం పార్టీ బచ్చన్నపేట మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.. ఆనాడు భూస్వాములు, దొరల పాలనకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం విరోచితంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో విరోచితంగా పోరాడిందన్నారు.
విసునూరు దేశ్ముఖ్ రాపాక రామచంద్రారెడ్డి ఆగడాలను వ్యతిరేకిస్తూ దగా పడుతున్న పేద ప్రజలకు అండగా తెలంగాణ రైతంగ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ నడుంబిగించి తన పంటను కాపాడుకుందన్నారు. దేశ్ముఖ్ గుండాలను ఎదిరిస్తూ సామాజిక వివక్ష అణిచివేత మీద అన్ని తరగతుల ప్రజలను ఐక్యం చేసి పోరాటాలు నడిపిన అటువంటి చరిత్ర చాకలి ఐలమ్మదనిఅన్నారు.
ఐలమ్మ పోరాటస్ఫూర్తితో భవిష్యత్తులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలను ఇళ్ల స్థలాల కోసం పోరాటం నిర్వహిస్తామని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎర్రజెండా నిలబడుతుందని అన్నారు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు బైరగోని బలరాములు, పార్టీ నాయకులు బోదాసు సుధాకర్, కృష్ణ,రంగారావు ఐలయ్య, రామయ్య, కొమ్ము శిరీష, తదితరులు పాల్గొన్నారు.