హనుమకొండ, నవంబర్ 21: జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్ పెంచాలని డెడికేటెడ్ బీసీ కమిషన్కు బీసీ కుల సంఘాలు విన్నవించాయి. గురువారం హనుమకొండ కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల గుర్తింపు అంశంపై ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని వివిధ బీసీ కుల సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలతో కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వర్రావు బహిరంగ విచారణ నిర్వహించారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 105 మంది తమ అభ్యర్థనలు అందించినట్లు బీసీ సంక్షేమ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ కమిషన్ రెకమండ్ మాత్రమే చేస్తుందని, తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. కార్యక్రమంలో డెడికేటెడ్ బీసీ కమిషన్ సెక్రటరీ సైదులు, హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఏ వెంకట్రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ జిల్లా డీడీ జీ రాంరెడ్డి, వరంగల్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, జనగామ జిల్లాల బీసీ సంక్షేమ అధికారులు పుష్పలత, నరసింహస్వామి, రవీందర్ రెడ్డి, శైలజ, రవీందర్ పాల్గొన్నారు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్లలో 50 శాతం బీసీ సభ్యులను నియమించాలని, అంతే మొత్తంలో రిజర్వేషన్లు కల్పించాలని బీసీ పొలిటికల్ జాక్ జేఏసీ నేత సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ కోరారు. స్థానిక సంస్థల్లో 42 శాతానికి రిజర్వేషన్లు పెంచడానికి ఉన్న మార్గాలను నివేదిక రూపంలో బీసీ జాక్ రాష్ట్ర చైర్మ న్ డాక్టర్ తిరుణహరి శేషు చైర్మన్కు అందజేశారు. గాండ్ల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, రెడ్డి గాండ్ల కులస్తులకు బీసీ-బీ సర్టిఫికెట్ ఇవ్వొద్దని అఖిల గాండ్ల తేలికుల రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు బొల్లేపల్లి అన్నపూర్ణ, కోటయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిల్లలమర్రి శివ వినతిపత్రం అందజేశారు.
మేదరలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలని మన్న భిక్షపతి, చిలువేరు సురేందర్, కోరుట్ల రమేశ్, ప్రతాపగిరి వెంకట రమణమూర్తి విన్నవించారు. మైనార్టీలకు వర్తించే పథకాలు తమకు అందేలా చూడాలని దూదేకుల సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు. బీసీ-డీలో ఎక్కువ కులాలున్నాయని, ఏబీసీడీలుగా వర్గీకరించాలని బీసీ రాజ్యాధికార సమితి నాయకుడు వీరగోని తిరుపతి కోరారు. చేతివృత్తిదారులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ కాడబోయిన లింగయ్య చైర్మన్కు వినతి పత్రం అందజేశారు.