ములుగు, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు ప్రభుత్వ కానుకగా మహిళా సంఘాల సభ్యు లు, 18 ఏళ్లు నిండిన గిరిజన మహిళలకు చీరెలను పంపిణీ చేసేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గిరిజన జిల్లాలైన ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో చీరెలను అందించేందుకు అధికారు లు సిద్ధమయ్యారు.
ఇందులో భాగంగా ములు గు జిల్లాలోని 355 వీవో గ్రూప్‌లు, 7,123 స్వయంసహాయక సంఘాలకు చెందిన 72,295 మంది మహిళలకు చీరెలను అందించనుండగా, ఆయా మండల కేంద్రాలకు 61,440 (85శాతం) చీరెలు చేరాయి. అదేవిధంగా జిల్లాలోని 18 ఏళ్లు నిండిన గిరిజన మహిళలకు 33,155 చీరెలను అందించనున్నారు. తాడ్వా యి, గోవిందరావుపేట మండలాలకు చెందిన బతుకమ్మ చీరెలు చల్వాయి గ్రామంలోని ప్రభుత్వ అతిథి గృహానికి చేరాయి.
ములుగు, వెంకటాపూర్ మండలాలకు చెందిన చీరెలు ఇంచర్ల గ్రామ శివారులోని ఎర్రిగట్టమ్మ దేవాలయం వద్ద ఉన్న ఫంక్షన్ హాల్‌కు చేరాయి. మిగిలిన అన్ని మండలాల చీరెలు ఏటూరునాగారంలోని గిరిజన భవన్‌కు చేరాయి. వాటిని వీవో గ్రూప్‌లు, మహిళా సంఘాలకు అందజేశారు. వీటన్నింటిని ఆయా సంఘాల్లో సభ్యులైన మహిళలకు బతుకమ్మ పండుగ కానుకగా సోమవారం నుంచి పంపిణీ చేయనున్నారు.
తాడ్వాయి మండలానికి 5725 మంది మహిళలకు చీరెలు రావాల్సి ఉండగా, 4870 చీరెలు మండల కేంద్రానికి చేరాయి. గోవిందరావుపేటకు 7506 మందికి 6380 చీరెలు, ములుగుకు 15933 మందికి 13540 చీరెలు, వెంకటాపూర్‌కు 8051 మందికి 6840 చీరెలు, కన్నాయిగూడేనికి 3025 మందికి 2570 చీరెలు, ఏటూరునాగారానికి 7205 మందికి 6120 చీరెలు, మంగపేటకు 12107 మందికి 10300 చీరెలు,
వెంకటాపురానికి (నూగూరు) 7205 మందికి 6120 చీరెలు, వాజేడుకు మండలంలోని 5538 మందికి 4700 చీరెలు వచ్చాయి. అదేవిధంగా జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో ఉన్న గూడేలకు చెందిన గిరిజన మహిళల్లో 18 ఏళ్లు నిండిన మహిళలు 33155 ఉండగా, వీరికి చీరెలను ఇంకా సరఫరా చేయలేదు. బతుకమ్మ పండుగ లోపు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నేటి నుంచి మహిళా సంఘాల ద్వారా బతుకమ్మ చీరెలను పంపిణీ చేయనున్నారు.
వాజేడు : మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి ఆదివారం లారీలో బతుకమ్మ చీరెలు వచ్చాయి. మండలంలోని మహిళా సంఘాల ద్వారా 4700 బతుకమ్మ చీరెలను పంపిణీ చేయనున్నట్లు గిర్దావర్ కుమారస్వామి తెలిపారు.