నయీంనగర్/ములుగురూరల్/మహబూబాబాద్ రూరల్, మార్చి20 : వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆశ వర్కర్లు పోరుబాట పట్టారు. శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు, మంత్రుల ఇండ్ల ముట్టడితో కదంతొక్కారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం వేతనం రూ.18 వేలకు పెంచడంతో ఇతర బెనిఫిట్స్ కల్పించాలని కోరారు. హ నుమకొండలో వరంగల్, హనుమకొండ జిల్లాల ఆశవర్కర్లు సీఐటీయూ నాయకులతో కలిసి మంత్రి సురేఖ ఇంటిని ముట్టడించారు. అంతకుముందు రాంనగర్‌లోని సుందరయ్య కార్యాలయం నుంచి సురేఖ ఇంటి వరకు ర్యాలీ నిర్వహించారు. పోలీసులు మంత్రి ఇంటి వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు.
దీంతో సీఐటీయూ నాయకులు, ఆశవర్కర్లతో పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. రెండు గంటలకుపైగా అకడే బయట నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేశ్ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశవర్కర్లకు రూ.18 వేల వేతనం చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వేతనాలు పెంచాలని పోరాడుతున్న ఆశవర్కర్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించడం సరైంది కాదన్నారు. తమది ప్రజాప్రభుత్వమని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోరాటాలను అణచివేయాలనే ఆలోచనను విరమించుకొని సమస్యలను పరిషరించాలని కోరారు. ఆశవర్కర్లకు గతంలో ఇచ్చిన హామీ ప్రకారం రూ.50 లక్షల ఇ న్సూరెన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ప్రసూతి సెలవు లు, ఆదివారం, పండగ సెలవులు నిర్ణయిస్తూ వెంటనే జీవో జా రీ చేయాలని కోరారు. ఆశ వరర్స్ యూనియన్ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ కాసు మాధవి, సీఐటీయూ వరంగల్ జిల్లా కార్యదర్శి అరూరి కుమార్ మాట్లాడుతూ ఆశవర్కర్లను నాలుగో తరగతి ఉద్యోగులకు ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేశారు.
దీనిపై ఈ నెల 28న చలో అసెంబ్లీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుంచు రాజేశ్వరి, బైరి శోభ, జనగామ శ్వేత, సీహెచ్ శ్రీవాణి, పద్మ, సీహెచ్ రాణి, రమ, కవిత, రజిత, ఈసంపల్లి శోభ పాల్గొన్నారు. అలాగే ములుగు జిల్లా బండారుపల్లి రోడ్డులో ఉన్న మంత్రి సీతక్క క్యాంపు కార్యాలయాన్ని సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు ముట్టడించారు. అంతకుముందు డీఎల్ఆర్ ఫంక్షన్‌హాల్ జాతీయ రహదారి మీదుగా బండారుపల్లి రోడ్డు నుంచి క్యాంపు కార్యాలయానికి వెళ్తుండగా, పోలీసులు అగ్నిమాపక కేంద్రం వద్ద అడ్డుకున్నారు. దీంతో వారు రోడ్డుపైనే బైఠాయించి ధర్నా చేపట్టారు. కొద్దిసేపు రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేసిన ఆశ వర్కర్లు ఒక్కసారిగా లేచి క్యాంపు కార్యాలయం వరకు పరుగులు తీశారు. పోలీసులు అడ్డుకునేందుకు యత్నించినా వాటిని ఛేదించుకొని సీతక్క క్యాంపు కార్యాలయానికి చేరుకొని, గేటు ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం క్యాంపు కార్యాలయ ఇన్చార్జికి అందజేశారు.
ఈ సందర్భంగా సీటీయూసీ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ మాట్లాడుతూ తాను అధికారంలోకి వస్తే ఆశవర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ.18వేలు అందిస్తానని హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే మరిచిపోయాడని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్ల్లో ప్రభుత్వం వేతనాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుండెబోయిన రవిగౌడ్, ఆశ వర్కర్లు ప్రభావతి, శోభ, చంద్రవాని, దేవి, సంధ్య, పూర్ణ, మాధవి, అనిత, నాగమణి, సుదా, స్వరూప, పాప, రాజ్యలక్ష్మి, సత్యవతి, వెంకటరమణతోపాటు 400మంది పాల్గొన్నారు. మహబూబాబాద్ ఎమ్మార్వో సెంటర్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఆశవర్కర్లు ర్యాలీ నిర్వహించారు. అధికారంలో రాగానే ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పి రేవంత్‌రెడ్డి మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.