పోరాటం మా జెన్ జీ హక్కు!
ప్రతి తరానికీ ఓ కచ్చితమైన అభిప్రాయం ఉంటుంది. తన తర్వాత తరానిది అనుభవరాహిత్యమనీ, తన ముందు తరానికేమో అంత తెలివిలేదని! తాము చూసినన్ని మార్పులు, మరెవరూ చూడలేదనీ వాళ్ల నమ్మకం. తమ తరానికి ఉన్న పరిణతి, అనుభవాలు.. నభూతో న భవిష్యత్ అన్న అతిశయం. కానీ, ప్రతి శతాబ్దానికీ తనదైన ప్రయాణం ఉంటుంది.
ప్రతి తరానికీ ఓ కచ్చితమైన అభిప్రాయం ఉంటుంది. తన తర్వాత తరానిది అనుభవరాహిత్యమనీ, తన ముందు తరానికేమో అంత తెలివిలేదని! తాము చూసినన్ని మార్పులు, మరెవరూ చూడలేదనీ వాళ్ల నమ్మకం. తమ తరానికి ఉన్న పరిణతి, అనుభవాలు.. నభూతో న భవిష్యత్ అన్న అతిశయం. కానీ, ప్రతి శతాబ్దానికీ తనదైన ప్రయాణం ఉంటుంది. చరిత్రలో ప్రతి పుటకీ ప్రత్యేకత ఉంటుంది. ఓ తరం ప్రపంచ యుద్ధంతోపాటు స్వాతంత్రపు తొలి రేయినీ చూసి ఉంటుంది. మరో తరం సైకిళ్ల నుంచి విమానాల వరకు ప్రయాణించి ఉంటుంది. ఇంకో తరం ఇంటర్నెట్లో పుట్టినా కృత్రిమమేధ కుదుపులకీ సాక్ష్యంగా ఉంది. ఇందులో ఏ మజిలీని తక్కువగా అంచనా వేయగలం. ఇప్పటి జెన్ జీ తరానికీ ఇదే వర్తిస్తుంది. స్మార్ట్ఫోన్ల మధ్య పెరిగినవాళ్లు, కాయకష్టం ఎరగనివాళ్లు, ఇన్‌స్టా లోకంలో జీవించేవాళ్లు, పిజ్జా లేకపోవడం పేదరికం అని భావించేవాళ్లు, సాటి మనిషితో పనిలేదని భావించేవాళ్లు, నమ్రత తెలియనివాళ్లు.. అంటూ వాళ్ల మీద చాలా నిందలే ఉన్నాయి. వాళ్ల వేషభాషల్నీ, అభిప్రాయాలనీ చటుక్కున కొట్టిపారేసేంత చులకనగా చూసే అపనమ్మకమూ ఉంది. కానీ, అప్పటిదాకా ఉన్న అభిప్రాయాలను కాస్త పక్కనపెట్టి, కాసేపు వారితో సమయం గడిపితే… జీవితంలోని ప్రతి పార్శ్వం మీదా వారి స్పష్టతకి ఆశ్చర్యం కలగడం ఖాయం. మరి అలాంటి యువత దృష్టిలో స్వేచ్ఛ అంటే ఏంటి? ఏ విలువలకి వాళ్లు ప్రాధాన్యం ఇస్తున్నారు? వాళ్ల మాటలను ఎందుకు పట్టించుకోవాలి?
వాళ్లకి రాజ్యాంగ సభ అంటే ఏమిటో తెలియకపోవచ్చు. కానీ, ప్రాథమిక హక్కులు, బాధ్యతల పట్ల అవగాహన ఉంది. వాళ్లు దేశంలో ఉన్న రాష్ర్టాల పేర్లన్నీ టకటకా చెప్పేయకపోవచ్చు. కానీ, వివిధ సంస్కృతులను గౌరవించే మనసుంది. వాళ్ల దృష్టిలో దేశభక్తి కొన్ని ప్రశ్నల సమాహారం కాదు.. కొన్ని విలువల ఆచరణ. వాళ్లతో కలిసి ప్రయాణించాల్సిందే! మరీ ముఖ్యంగా మన దేశంలో. ఎందుకంటే మన జనాభాలో 37 నుంచి 40 కోట్ల మంది జెన్ జీలే. ప్రపంచ జెన్ జీ జనాభాలో ఇది ఐదో వంతు. ఇంతకీ జెన్ జీ అంటే ఏ వయసు వాళ్లు అనే విషయం మీద రకరకాల వాదనలు ఉన్నా.. చాలామంది PEW Research Centre సూచించిన 1997-2012 మధ్య పుట్టినవాళ్లను జెన్ జీలుగా అంగీకరిస్తున్నారు.

అన్నీ చూసేశారు!
చాలామంది అనుకున్నట్టు జెన్ జీ పూలపాన్పుల మధ్య పుట్టి పెరగలేదు. ట్విన్ టవర్ల కూల్చివేత దగ్గర్నుంచి ఇరాన్ యుద్ధం వరకూ భయంకరమైన తీవ్రవాదాన్నీ, ప్రపంచ అస్థిరతను చూశారు. నూరేండ్ల తర్వాత ఎన్నడూ లేనంత అర్థిక మాంద్యాన్ని దాటారు. కొవిడ్ విరుచుకుపడటం గమనించారు. మధుమేహం నుంచి మనోవేదన వరకూ ప్రతీ ఆరోగ్య సమస్యా రోజువారీ జీవితంలో భాగం కావడం అర్థం చేసుకున్నారు. 1998లో మొదలైన గూగుల్ సెర్చ్ ఇంజన్ మూడు దశాబ్దాలు తిరిగకుండానే ‘జెమినై’ అనే కృత్రిమమేధగా రూపాంతరం చెందడం చూశారు. ఎల్ నినో కరువులు, విదేశీ చదువులు, గ్లోబలైజేషన్ మెరుపులు.. అన్నిటినీ అనుభవిస్తున్నారు. ఇంత చూసినవాళ్ల అనుభవాన్ని ఎలా తోసిపుచ్చగలం.
స్వేచ్ఛ గురించి, మానవతా విలువల గురించి ఈ తరానికి స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. ఫ్రెడరిక్ నౌమన్ ఫౌండేషన్ చేసిన ఓ సర్వేలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ సమానమైన మానవ హక్కులు ఉండాలనే అభిప్రాయాన్ని ఏకంగా 88 శాతం మంది జెన్ జీలు బలపరిచారు. అయితే తమ దేశంలో ఉన్న ప్రభుత్వం ఆ హక్కుల పట్ల నిబద్ధతగా ఉందా అంటే కేవలం 40 శాతం మంది మాత్రమే ఒప్పుకొన్నారు.

మన చుట్టూ ఉన్న యువతే ఇలా ఆలోచిస్తున్నది అనుకుంటున్నారేమో. ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్, అమెరికా లాంటి ఆధునిక దేశ యువత కూడా చెప్పిన అభిప్రాయమిదే! అంతేకాదు! ఒకవేళ ఎక్కడన్నా అణచివేత కనిపిస్తే దానికి వ్యతిరేకంగా గళమెత్తుతామని దాదాపు మూడో వంతుమంది వెల్లడించారు. అందుకు సాక్ష్యంగా చాలా సంఘటనలే కనిపిస్తాయి. అమెరికాలోని పార్క్‌లాండ్ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో 17మంది చనిపోయారు. దీంతో ఒళ్లుమండిన విద్యార్థులు ‘గన్ కల్చర్’కి వ్యతిరేకంగా కఠినమైన చట్టాలు తీసుకురావాలంటూ నినదించారు. చిన్నగా మొదలైన ఈ ఉద్యమం లక్షల మంది భాగస్వామ్యంతో ప్రభుత్వం తల వంచేలా చేసింది. చట్టంలో మార్పు వచ్చింది. స్వరం వినిపించేందుకు సమస్య తమదే కానక్కర్లేదనేది జెన్ జీ అభిమతం. అందుకే శ్వేత జాతీయుల దురహంకారానికి వ్యతిరేకంగా జరిగిన ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ లాంటి ఉద్యమాల్లో వారిదే పైచేయిగా కనిపించింది.
ఇక జెన్ జీ దృష్టిలో ఆన్లైన్ కేవలం విద్య, వినోదం కోసం మాత్రమే కాదు… విప్లవం కోసం కూడా! ఇండోనేషియాకి చెందిన నెగెరి విశ్వవిద్యాలయం పరిశోధన ప్రకారం, జెన్ జీ తమ అభ్యుదయ భావాలను పంచుకునేందుకు 67 శాతం సామాజిక మాధ్యమాలనే ఎంచుకుంటున్నారు. వీటిలో టిక్ టాక్, యూట్యూబ్, ఇన్‌స్టా లదే ప్రాధాన్యం. అందులోనూ 64 శాతం పర్యావరణం గురించి, 55 శాతం విద్య అందుబాటు గురించి మాట్లాడుతున్నారు. ఈ రెండు రంగాలూ, వాళ్ల దృక్పథం ఎంత విశాలంగా ఉందో చెబుతున్నాయి.

అలాగని వాళ్ల దృష్టిలో స్వేచ్ఛ కేవలం భౌతికం అనుకుంటే పొరపాటే! ఏం చదవాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఎప్పుడు మానేయాలి, ఎలా ఖర్చు చేయాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎవరిని ఎంత వరకు దగ్గరికి రానివ్వాలి? అన్నిటిలోనూ స్వతంత్రమైన ఆలోచనతో ఉన్నారు. ఆ స్పష్టత ఉండబట్టే వాళ్ల తీరు ముక్కుసూటిగా ఉంటుంది. కేవలం వ్యక్తిగత విషయాల్లోనే కాదు.. పర్యావరణం లాంటి దీర్ఘకాలిక సమస్యల పట్లా వాళ్లు జాగ్రత్తగా ఉన్నారు. పర్యావరణానికి హాని తలపెట్టని ఉత్పత్తులే వాడుతున్నాం అంటూ 64 శాతం మంది చెబుతుంటే, పర్యావరణ వ్యతిరేకంగా ఉన్నందుకు తాము పనిచేసే సంస్థనే వదిలిపెట్టబోతున్నాం అని 46 శాతం మంది పేర్కొన్నారు.
విలువైన పౌరులు
జెన్ జీది ఉడుకు రక్తం.. అయితే ఉద్యమం లేకపోతే సామాజిక మాధ్యమం అనుకుంటే పొరపాటే! ప్రజాస్వామ్యంతోనూ అనుకున్నది సాధిస్తారు. ఫ్రాన్స్, ఆస్ట్రియా, జర్మనీ, పోలాండ్లలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలను పరిశీలించిన British Elections Study లాంటి సంస్థలు చేసిన విశ్లేషణలో.. జెన్ జీ ఓటు చీలలేదు. ఫలితంగా మార్పు తెస్తుందని వారు కోరుకున్న పార్టీలే గెలిచాయి. గుస్తావ్ పెట్రో అనే అభ్యర్థి కొలంబియ అధ్యక్షునిగా ఎన్నిక కాలేడు అని అంతా ఊహిస్తే… జెన్ జీ మూకుమ్మడి ఓటుతో తన పీఠాన్ని చేరుకున్నాడు.
కుటుంబం విషయంలోనూ వారికి స్పష్టత ఉంది. PEW రీసెర్చ్ సెంటర్ చేసిన ఓ సర్వేలో వేర్వేరు జాతుల మధ్య వివాహాలు వివక్ష లేని సమాజాన్ని నిర్మిస్తాయని ఏకంగా 62 శాతం మంది భావించారు. ఇక ఇంటిపనులు, పిల్లల పెంపకం, దంపతులిద్దరూ ఉద్యోగం చేయడం లాంటి విషయానికి వస్తే ఈ బాధ్యతల్ని భార్యాభర్తలు ఇద్దరూ కూడా పంచుకోవాలని ఏకంగా 79 శాతం జెన్ జీ అభిప్రాయపడ్డారు. కేవలం 13 శాతం మాత్రమే పిల్లల పెంపకంలో తల్లిదే ఎక్కువ పాత్ర అన్న భావనలో ఉన్నారు. మొత్తానికి స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమే అన్న విషయాన్ని మాత్రం దాదాపు 90 శాతం మంది అంగీకరించారు. చాలామంది ఊహిస్తున్నట్టుగా తాత్కాలిక బంధాల పట్ల జెన్ జీ అంత సుముఖంగా లేదు. మిగతా తరాల కంటే జెన్ జీనే దీర్ఘకాలిక బంధాలను కోరుకుంటున్నదని Pew Research Center చెబుతున్నది. అంతేకాదు! పెండ్లికి ముందు ఆర్థిక స్థిరత్వం ఉండితీరాలని గట్టిగా కోరుకునే తరం కూడా ఇదే!

సమస్యలూ ప్రత్యేకమే!
జెన్ జీకి అందుబాటులో ఉన్న సాంకేతికత, సౌకర్యాలు చూసి వాళ్లు చాలా సుఖపడిపోతున్నారమే భ్రమ సహజం. కానీ, వాటితో పాటు సమస్యలు కూడా లేకపోలేదు.
- రోజురోజుకీ విజ్ఞానం ఎదుగుతున్నది. ఎక్కడ ఏ పరిశోధన జరిగినా, ఏ నిపుణుడు అభిప్రాయం చెప్పినా అది క్షణాల్లో అరచేతుల్లో ఉంటున్నది. దానివల్ల ఏది నిజం, దేన్ని పాటించాలి, మెదడంతా నిండిపోయిన సమాచారాన్ని ఏం చేయాలో తెలియని Information Overload సమస్యతో బాధపడుతున్నది జెన్ జీ.
- మార్కెట్ విపరీతంగా విస్తరిస్తున్నది. ఓ టీవీ కొనాలన్నా, ఫోన్ తీసుకోవాలన్నా, ఆఖరికి ఓటీటీలో సిరీస్ చూడాలన్నా వేలాది ఎంపికలు ఊరిస్తున్నాయి. అగ్గిపెట్టె కొనేందుకు కూడా హైపర్ మాల్‌కు వెళ్తున్న తరం ఇది. కళ్లముందున్నీ ఈ ఎంపికలు మెదడు మీద విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తాయి. దీన్ని Decision Fatigue అంటారు. ప్రతి సందర్భంలోనూ విలువైన సమయం నిర్ణయాలకే సరిపోతుంది. ఫలితంగా తప్పుడు ఉత్పత్తి ఎంచుకోవడమో, తీరా కొన్నాక అసంతృప్తితో మిగిలిపోవడమో జరుగుతున్నది.
- సామాజిక మాధ్యమాలు ఓ వ్యసనంలా మారిపోయాయి. ఎంతలా నిభాయించుకున్నా.. ఆ వేదిక మీద కనిపించే విజయాలు, విలాసాలు, పోలికలకీ, అసంతృప్తికీ దారితీస్తున్నాయి. అందుకే ఏకంగా 58 శాతం జెన్ జీ ఫోన్లని చూసీ చూసీ నిస్సత్తువుగా (Digital Fatigue) మారుతున్నారని తేలింది.
- ఇప్పుడు ఏది కావాలన్నా ఎదురుచూడాల్సిన పనిలేదు. పచారీల దగ్గర్నుంచీ డేటింగ్ వరకూ అన్నీ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. ఫైల్ డౌన్లోడ్ దగ్గర్నుంచీ ప్రయాణాల వరకూ అన్నీ క్షణాల్లో అమరిపోతున్నాయి. దాంతో కాస్త ఆలస్యానికీ, చిన్నపాటి పొరపాటుకీ, తేడా వచ్చిన అంచనాలకీ.. విపరీతమైన అసహనానికి లోనవుతున్నారు.
- కెరీర్ ఒకప్పటిలా స్థిరంగా ఉండటం లేదు. ప్రతి సంస్థా లాభాన్ని బట్టి నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నది. పైగా విస్తృతం అయిపోయిన రంగాల్లో దేన్ని ఎంచుకోవాలో తెలియని పరిస్థితి. ఒకవేళ ఏదన్నా ఉద్యోగంలో స్థిరపడినా అక్కడి పరిస్థితులకు ఇమడలేకపోతున్నారు. జెన్ జీ తరచూ ఉద్యోగాలు మారడం వెనుక ఉన్న కారణాల్లో ఇదీ ఒకటి. ఈ సందట్లో AI వచ్చిపడింది. డెలాయిట్ సర్వే ప్రకారం, దాదాపు 60 శాతం మంది కృత్రిమ మేధతో తమ కెరీర్ దెబ్బతింటున్నదనే భయంతో ఉన్నారు.
- ఒకప్పుడు పది రూపాయలు వస్తే అయిదు రూపాయలు దాచుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడలా కాదు. పొరుగువాళ్ల ముందు తలదించుకోకుండా ఉండాలంటే తలకు మించిన ఖర్చు తప్పనిసరి. టాప్ వెల్ సంస్థ నివేదిక ప్రకారం ఏకంగా 61 శాతం మంది తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారు. అందుకు కారణాలు కూడా స్పష్టంగా తేల్చింది. 76 శాతం మంది పెరుగుతున్న ఖర్చులు, 48 శాతం మంది ఉద్యోగ అనిశ్చితి, 46 శాతం మంది ఇంటికోసం పెట్టుబడి భారంగా మారాయని వాపోయారు.

భవిష్యత్తు అప్పగించాల్సిందే!
ఇన్ని సవాళ్లని దాటుకుని కూడా జెన్ జీ తరం తనదైన వ్యక్తిత్వం కోసం పాటుపడుతున్నది. ఆ తెగువని గుర్తించాల్సిందే. మరి ఈ లోకాన్ని వాళ్ల చేతుల్లో పెట్టే ధైర్యం చేయగలమా? అన్న ప్రశ్నకి చాలా జవాబులే వినిపిస్తాయి.
- వాళ్లున్న డిజిటల్ లోకం ప్రతీ సమస్యనీ ముందే పసిగడుతుంది. దానికి సిద్ధపడేలా చేస్తుంది.
- జెన్ జీ ఎలాంటి పరిస్థితికైనా ఇమిడిపోగలిగే తత్వమున్నవారు. మార్పునకు వాళ్లు వ్యతిరేకం కాదు!
- ఈ తరపు ప్రశ్నించే తత్వం అసౌకర్యంగా ఉండవచ్చు. కానీ, మెరుగైన సమాజం కోసం ఆ ప్రశ్నలు అవసరమే!
- జెన్ జీకి ఉన్న సామాజిక బాధ్యత చట్టాల నుంచి ఉపశమనం కోసమో, వైరల్ అవ్వడానికో కాదు.. తను వసుధైక కుటుంబంలో భాగం అనే భావన.
- విమర్శలకీ, ఒడుదొడుకులకీ, కష్టాలకీ వాళ్లు విముఖం కాదు. వాటిని దాటితేనే విజయం అన్న విచక్షణ ఉన్నవాళ్లు.
ఇప్పుడు సమస్య జెన్ జీలది కాదు. వారితో సాగుతున్న మిగతా తరాలది. స్కూళ్లు, ఆఫీసులు, ప్రభుత్వం.. ఇలా ప్రతి రంగంలో ఉన్న పెద్దలు వాళ్లను నిందించడం కాసేపు పక్కన పెట్టి, ఈ తరం తీరును తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏదన్నా కష్టం వస్తే పెద్దమనసుతో అండగా నిలబడాలి. ఎవరికి తెలుసు?! ఇన్నాళ్లుగా చరిత్ర పొడవునా కలలుగన్న సమసమాజం వాళ్లతోనే సాకారం అవుతుందేమో!
ప్రతిరంగానికీ ప్రాతినిధ్యం!

ప్రతీ రంగంలోనూ అద్భుతాలు చేస్తున్నవారి వయసుని గమనిస్తే చాలు.. వారిలో చాలామంది జెన్ జీ తరానికి చెందినవారని అర్థమవుతుంది. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత చదరంగంలో భారతీయుల ప్రభ మసకబారిపోతుందనే ఊహించారంతా. మరీ ముఖ్యంగా కార్ల్సన్ హవా మొదలైన తర్వాత! కానీ అనూహ్యంగా గుకేష్, ప్రజ్ఞానంద వంటి జెన్ జీ.. భారతీయులు ప్రపంచానికి ఇచ్చిన ఆటలో తన స్థానాన్ని నిలబెట్టారు.
నీళ్లలో సీసం కలిస్తే, జీవితం నరకంలా మారిపోతుందని చాలామందికి తెలుసు. కానీ, తాము తాగే నీటిలో సీసం ఉందని తెలుసుకోవడమే కష్టం. ‘టెటిస్’ అనే ఓ చిన్న చౌకైన పరికరాన్ని కనిపెట్టి, పరిష్కారం చూపించింది గీతాంజలి రావ్. అప్పటికి తన వయసు 12 ఏండ్లే! అంతేకాదు రక్త పరీక్షతో డ్రగ్ అడిక్షన్ గుర్తించే ఎపియోన్, సైబర్ వేధింపులని అడ్డుకునే కైండ్లి లాంటి ఆవిష్కరణలతో ఏకంగా టైమ్ పత్రిక కవర్ పేజి మీదకి చేరుకుంది గీతాంజలి.
కొవిడ్ సమయంలో జెన్ జీ కంగారుపడుతూ కూర్చోలేదు. ఆన్లైన్ శక్తిని గుర్తించారు. చదువు నుంచి సేవల దాకా దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో గమనించారు. అందుకు సాక్ష్యం ఆదిత్ పలీచా! జెప్టో సహ వ్యవస్థాపకుడు. తనే కాదు ప్రపంచంలోనే అతి చిన్న వయసు వెబ్ డిజైనర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలక్ష్మి సురేష్, World’s Youngest Serial Entrepreneurగా పేరు తెచ్చుకున్న అఖిలేంద్ర సాహు.. అందరూ ఈతరం కుర్రాళ్లే!
వీళ్లే కాదు! పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి విజయానికి పరిమితులు లేవని నిరూపించిన అవని లేఖర, తన యూట్యూబ్ చానెల్ ద్వారా లక్షల మందికి సాంకేతిక నైపుణ్యాలని చేరువ చేస్తున్న ఇషాన్ శర్మ.. లాంటి పేర్లు చాలానే వినిపిస్తాయి.

రకరకాల పేర్లు!
- నిర్ణయాల నుంచి ఇంటర్నెట్ వరకూ వేగంగా సాగుతున్నందుకు Zoomers.
- చదువులు అయిపోయాక తిరిగి తల్లిదండ్రులతో పాటే జీవించాలనుకుంటున్నందుకు Boomerang Generation.
- ఒంటరితనం, ఉద్వేగం, సామాజిక ఐక్యత కోసం తపన, తిరుగుబాటు తత్వం.. ఈ లక్షణాల ఆధారంగా Katniss అనే ఓ పాత్ర పేరు మీదుగా వీరికి పెట్టిన పేరు Generation K.
- చైనాలాంటి దేశాల్లో జనాభాని తగ్గించుకునేందుకు ఇంటికి ఒక్కరే జెన్ జీ పుట్టారు. వంశానికి ఒక్కరే కాబట్టి వీళ్లని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అందుకని పెట్టిన పేరు – Little Emperors.
- చాలా సున్నితంగా ఉంటారనీ, త్వరగా అలసిపోతారనీ, ఒత్తిడిని తట్టుకోలేరనీ.. తైవాన్ వాళ్లు పెట్టిన పేరు Strawberry Generation.
- వాళ్ల బొటనవేలితో నిరంతరం మెసేజీలు చేస్తూ గడిపేస్తున్నారని జపనీస్ పెట్టిన పేరు Thumb Tribe.
- Digital Native, iGen, 9X Generation.. జెన్ జీకి ఇలాంటి చాలా పేర్లే ఉన్నాయి.
– కె.ఎల్.సూర్య
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

