సిటీబ్యూరో, ఆగస్టు 8(నమస్తేతెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ డబుల్ గేమ్ ఆడుతున్నది.. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు బాధితులను విభజించి, మభ్యపెట్టి ఇండ్లు, ఫ్లాట్లు ఖాళీ చేయించేందుకు కుట్ర చేస్తున్నది. ఇందులోభాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు భూసేకరణ చేసేందుకు అధికారులు బాధితులను తికమట పెట్టి తమ స్థలాలు, ఇండ్లను ప్రభుత్వానికి అప్పగించేలా ప్లాన్ చేస్తున్నారు. ముందుగా మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు ఫ్లాట్ వారీగా నోటీసులు జారీ చేశారు. అందరినీ ఒకేసారి అభిప్రాయ సేకరణకు పిలవకుండా పక్కా ప్లాన్ ప్రకారం పది మంది చొప్పున పిలుస్తూ గందరగోళానికి గురిచేస్తున్నారు. తమ అపార్ట్మెంటును ప్రాజెక్టు కోసం ఇచ్చేందుకు అంగీకరించాలని రకరకాలుగా ఒత్తిడి తెస్తున్నారు. నోటీసులు అందుకున్న వారికి.. ఇప్పటికే సగానికి పైగా మంది ఫ్లాట్లను ఖాళీ చేసేందుకు అంగీకరించారని చెబుతున్నారు. ఫ్లాట్‌లో ఒక చదరపు గజానికి రూ.5 వేలు ఇచ్చినా చాలు.. ఖాళీ చేసి వెళ్తామని చెప్తున్నారని మభ్యపెడుతున్నారు.
ప్రభుత్వం డబుల్ గేమ్
గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు భూసేకరణ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మొదట మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు ఫ్లాట్ వారీగా నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత గజానికి రూ.5 వేల చొప్పున ఒక్కో ఫ్లాట్‌కు పరిహారం చెల్లిస్తామని… అందుకు ఒప్పుకోవాల్సిందేనని తేల్చి చెప్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. అలా తీసుకుని ఖాళీ చేస్తామని ఫ్లాట్ల యజమానులే తమ దగ్గరకు వచ్చి చెప్తున్నారని అధికారులు బాధితులను తప్పుదారి పట్టించేందుకు కుట్ర చేస్తున్నారని అభిప్రాయ సేకరణకు వెళ్లిన వారు స్పష్టం చేస్తున్నారు. దీంతో అపార్ట్మెంట్ వాసులు గందరగోళానికి గురవుతున్నారు. ఒకరికి తెలియకుండా మరొకరిని ఫ్లాట్లు ఇచ్చేందుకు అంగీకరించేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.

మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు ఫ్లాట్లు ఇచ్చేందుకు మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంటులోని సగానికి పైగా అంగీకరించారని అధికారులు ప్రచారం చేస్తున్నారు. మరికొంత మంది స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని అబద్ధాలు చెప్తున్నారు. అపార్ట్మెంట్లోని ఏ బ్లాక్ వాళ్లు ఒప్పుకొన్నారని బీ బ్లాక్ వాళ్లకు.. బీ బ్లాక్ వాళ్లు ఒప్పుకొన్నారని ఏ బ్లాక్ వాళ్లకు చెప్తూ రెవెన్యూ అధికారులు డబుల్ గేమ్ ఆడుతున్నట్లు ఆవేదన చెందుతున్నారు. మెజార్టీ మంది ఒప్పుకున్నారు కాబట్టి మిగతా వారు కూడా అంగీకరించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఫ్లాట్లను అప్పజెప్పేందుకు ఒప్పుకోని వారికి పరిహారం అసలే రాదు.. కాబట్టి చెప్పినట్లు వినాల్సిందేనని హుకూం జారీచేస్తున్నట్లు బాధితులు ఆవేదన చెందుతున్నారు.
బాధితులను ఏదో ఒకరకంగా ఇబ్బందులకు గురిచేస్తూ.. వారిలో అభద్రతాభావం కల్పించేలా పథకం రచిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొంత మంది ఫ్లాట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారని చెప్తున్నారు కానీ.. వాళ్ల వివరాలు మాత్రం ఎందుకు చెప్పడం లేదని నిలదీస్తున్నారు. ఇదంతా తమను ఒకేతాటిపై ఉండకుండా విభజించి అపార్ట్‌మెంట్‌ను లాక్కునే కుట్ర అని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఒకరిని చూపి మరొకరిని మోసం చేయడంలో భాగంగానే అధికారులు ఇలాంటి కుయుక్తులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు ఎన్ని రకాల కుయుక్తులు పన్నినా తమ ఫ్లాట్లు అప్పగించబోమని తేల్చి చెబుతున్నారు.