ఒక అడవిని మ్యాప్‌లో చిత్రీకరించవచ్చు. ఒక కొండను కొలవవచ్చు. ఒక నదికి ఆనకట్ట కట్టవచ్చు. కానీ, ఒక ఆదివాసీ సమాజం వేల సంవత్సరాలుగా ప్రకృతితో నిర్మించుకున్న సంబంధాన్ని కొలువడం అసాధ్యం. మరోవైపు ప్రపంచం నేడు వాతావరణ మార్పుల గురించి ఆందోళన చెందుతున్నది. కార్బన్ ఉద్గారాలను తగ్గించాలంటున్నది. జీవ వైవిధ్యాన్ని కాపాడాలని పిలుపునిస్తున్నది. కానీ ప్రకృతికి హాని చేయకుండా ఎలా జీవించాలో, అడవిని దోపిడీ చేయకుండా ఎలా వినియోగించాలో, ప్రకృతితో మమేకమై జీవనం ఎలా సాగించాలో ఎన్నో శతాబ్దాల కిందటే ఆచరణలో చూపిస్తున్నది ఆదివాసీ సమాజం. అయితే నేడు వారి సంస్కృతి, భూమి, అడవులు, భాషలు, సాంప్రదాయ విజ్ఞానం సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. 1982 ఆగస్టు 9న ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో వర్కింగ్ గ్రూప్ ఆన్ ఇండీజినస్ పాపులేషన్స్ మొదటిసారి సమావేశమైంది. 1994లో ఆదివాసీల చరిత్రను గుర్తుచేసుకుంటూ, ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ప్రతి సంవత్సరం ఆగస్టు 9ని ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించింది.
ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం అంటే కేవలం శుభాకాంక్షలు చెప్పడం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీల హక్కులను గుర్తించడం, వారి సంస్కృతిని పరిరక్షించడం, భాషలను కాపాడడం, అటవీ హక్కులను రక్షించడం, అభివృద్ధి పేరుతో జరుగుతున్న అన్యాయాలను ప్రపంచ దృష్టికి తీసుకురావడమే ప్రధాన లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90 దేశాల్లో సుమారు 47 కోట్ల మందికిపైగా ఆదివాసీలు నివసిస్తున్నారు. ప్రపంచ జనాభాలో వారి వాటా కేవలం ఆరు శాతం మాత్రమే అయినప్పటికీ, ప్రపంచ జీవ వైవిధ్యంలో అత్యంత సంపన్నమైన ప్రాంతాల్లో ఎక్కువ భాగం వారి నివాస ప్రాంతాలే. అందుకే అడవుల సంరక్షణలో వారి పాత్ర అత్యంత కీలకమైనదిగా ప్రపంచం గుర్తిస్తున్నది. ప్రపంచంలోనే అత్యధికంగా ఆదివాసీ జనాభా కలిగిన దేశాల్లో భారతదేశం ఒకటి. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో సుమారు 10.45 కోట్ల మంది గిరిజనులు ఉన్నారు.
అంటే దేశ జనాభాలో దాదాపు 8.6 శాతం. దేశంలో అధికారికంగా గుర్తింపు పొందిన 700కు పైగా గిరిజన తెగలు ఉన్నాయి. గోండులు, కోంధ్‌లు, చెంచులు, కోయలు, కొలాములు, లంబాడీలు, సవరలు, జాతాపులు, నాగాలు… ఇలా ప్రతి తెగకు ప్రత్యేకమైన జీవన విధానం, భాష, సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయి. తెలంగాణలో గోండులు, కొలాములు, కోయలు, నాయకపోడులు, చెంచులు, పర్ధాన్లు, తోటి, లంబాడీలు వంటి అనేక తెగలు నివసిస్తున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కొండరెడ్లు, సవరలు, జాతాపులు, బగతలు, గదబలు, కొండదొరలు, కోంధ్‌లు, వాల్మీకులు వంటి అనేక తెగలు తమ ప్రత్యేక సంస్కృతిని నేటికీ కొనసాగిస్తున్నాయి. ఆదివాసీ సంస్కృతి అంటే ప్రకృతితో కలిసి జీవించే ఒక జీవన తత్వం. వారి పండుగలు వర్షాలతో ముడిపడి ఉంటాయి. వారి పాటల్లో అడవి ఉంటుంది, కథల్లో నదులు ఉంటాయి, దేవతల్లో కొండలు ఉంటాయి, పూజల్లో చెట్లు ఉంటాయి. నేడు ప్రపంచం ‘సుసధ్థర జీవనం’గా పిలుస్తున్న జీవన విధానాన్ని వారు శతాబ్దాలుగా ఆచరిస్తున్నారు.
ఏ మొక్క ఔషధం? ఏ విత్తనం ఎప్పుడు వేయాలి? ఏ పక్షి కూత వర్షానికి సంకేతం? ఏ ఆకుతో జ్వరాన్ని తగ్గించవచ్చు? ఏ చెట్టు భూగర్భ జలాలను నిల్వ ఉంచుతుంది? ఇలాంటి అనేక విషయాలు గిరిజన సమాజంలో తరతరాలుగా నోటి మాట ద్వారా వస్తున్న జ్ఞానం. వారు తాతల కాలం నుంచి వస్తున్న సొంత విత్తనాలనే పంట కోసం వాడుతుంటారు. సంప్రదాయ విత్తనాలే విలువైన సంపద అని భావిస్తారు. ఏడాది కాలం వరకు అవి చెక్కుచెదరవు. వాటినే తర్వాత పంటకు నాటుకుంటారు. పాడేరు మండలం సంగోడి ఆవాసంలో కూరగాయలు, మిల్లెట్స్ పండిస్తున్న కల్యాణం అనే రైతు తనకున్న రెండు గదుల చిన్న ఇంటిలో ఒక గదిని విత్తనాలకే కేటాయించారు. ఈ విజ్ఞానం విశ్వవిద్యాలయాల్లో పుట్టలేదు. ప్రకృతిలో పుట్టింది. ప్రయోగశాలల్లో కాదు… జీవితంలో పరీక్షలను ఎదుర్కొన్నది. నేడు ప్రపంచవ్యాప్తంగా ఔషధ పరిశోధనలు, జీవ వైవిధ్య అధ్యయనాలు, వాతావరణ మార్పుల పరిశోధనల్లో ఈ సంప్రదాయ విజ్ఞానం విలువ మరింత పెరుగుతున్నది.
బ్రిటిష్ పాలనలో అడవులన్నీ ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించిన తర్వాత శతాబ్దాలుగా అడవిలో జీవిస్తున్న గిరిజనులు తమ సొంత నేలలోనే పరాయివారిగా మారిపోయారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఈ సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. ఈ చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దేందుకు 2006లో కేంద్రం అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా వ్యక్తిగత సాగు హక్కులు, సామూహిక అటవీ హక్కులు, చిన్న అటవీ ఉత్పత్తుల సేకరణ హక్కులు, సంప్రదాయ వినియోగ హక్కులకు చట్టబద్ధ గుర్తింపు కల్పించే అవకాశం వచ్చింది. అయినప్పటికీ అమలులో ఇంకా అనేక సవాళ్లు కొనసాగుతున్నాయి. 1996లో వచ్చిన పెసా చట్టం షెడ్యూల్ ప్రాంతాల్లో గ్రామసభకు ప్రత్యేక అధికారాలు కల్పించింది. భూమి, నీరు, అడవి వంటి సహజ వనరుల నిర్వహణలో గ్రామసభ అభిప్రాయానికి ప్రాధాన్యం ఇచ్చింది. అయినా ఈ చట్టం కూడా అనేక ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులకు ఇంకా పునరావసం కల్పించకపోవడమే ఇందుకు నిదర్శనం. పెద్ద ఆనకట్టలు, మైనింగ్ ప్రాజెక్టులు, పరిశ్రమలు, రహదారులు, విద్యుత్తు ప్రాజెక్టులు… ఇవన్నీ అభివృద్ధికి అవసరమే. కానీ ఆ అభివృద్ధి కోసం ఎక్కువగా తమ పూర్వీకుల భూమిని కోల్పోయేది ఆదివాసీలే. అందుకే అభివృద్ధితో పాటు పునరావాసం, జీవనోపాధి, సంస్కృతి, హక్కుల పరిరక్షణ కూడా సమానంగా ముఖ్యమైన అంశాలుగా చూడాల్సిన అవసరం ఉన్నది.
ఒక భాష అంతరించిపోతే కేవలం కొన్ని పదాలు మాయమవ్వవు. ఒక నాగరికత కనుమరుగవుతుంది. ఆ భాషలో దాగి ఉన్న ప్రకృతి విజ్ఞానం, ఔషధ జ్ఞానం, వ్యవసాయ అనుభవం, చరిత్ర, సంస్కృతి అన్నీ కలిసి కోల్పోతాం. అందుకే గిరిజన భాషలను పరిరక్షించడం అంటే ఒక జాతి జ్ఞాన సంపదను కాపాడటమే. అస్తిత్వాలు కోల్పోయిన జాతుల భవిష్యత్తు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. నేడు కోయ జాతిలో జరుగుతున్న ప్రమాదకరమైన పరిణామం ఇదే. కోయ జాతి ప్రాంతాల్లోకి గిరిజనేతరుల వలసలు పెరిగి క్రమంగా వాళ్ల జనాభా శాతం పెరుగటంతో, కోయ జాతి జనాభా తగ్గుతూ వచ్చింది.
గిరిజనేతరులు వారి వ్యాపార స్వలాభం, వారి మనుగడ కోసం కోయ భాషను నేర్చుకుంటున్నారు. ఎవరైనా కొత్త భాషలు నేర్చుకోవటంలో తప్పులేదు. అయితే తమ అస్తిత్వానికి మూలాధారమైన సొంత భాషను వీడి ఇతర భాషలపై మోజు పెంచుకొని, కొందరు కోయ భాషను మర్చిపోతున్నారు. తమ పిల్లలకు కూడా కోయ భాషను నేర్పించకుండా పరాయి భాషలపై ఆధారపడుతూ, పరాయి భాషలతోనే విద్యను అభ్యసించడం వల్ల కోయ భాష అంతరించే ప్రమాదం ఉన్నది. ఈ విషయంపై ప్రభుత్వాలు ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నదని ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకుడు కుంజా శ్రీను వంటి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గిరిజనులను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా, ప్రకృతి విజ్ఞానానికి వారసులుగా చూడాలి. వారికి నాణ్యమైన విద్య అందించాలి. వారి మాతృభాష, సంస్కృతిని కాపాడాలి. అటవీ హక్కులను పూర్తిగా అమలు చేయాలి. చిన్న అటవీ ఉత్పత్తులకు న్యాయమైన ధర కల్పించాలి. వారి సంప్రదాయ వైద్య విజ్ఞానానికి తగిన గుర్తింపు ఇవ్వాలి. ఆగస్టు 9 కేవలం ఒక దినోత్సవం కాదు. ప్రకృతిని కాపాడే ప్రజలకు ప్రపంచం చెప్పే కృతజ్ఞత.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
-శ్యాంమోహన్
9440595858