మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వాలు ప్రణాళికలను రూపొందించడం పరిపాటే. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అన్ని దేశాలు యుద్ధప్రాతిపదికన పరిశ్రమలు, సైన్స్, టెక్నాలజీ పరంగా అనేక మార్పులకు ఉపక్రమించాయి. పరిశ్రమలు, టెక్నాలజీ, మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు, ఇంధన అవసరాలను మెరుగు పరచుకోవలసిన ప్రాముఖ్యతను గుర్తించాయి. పెట్రోలియం నిల్వలు అపరిమితంగా ఉన్న గల్ఫ్ దేశాలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకోవడానికి, వాటి నుంచి నిరంతరం పెట్రోలియంను తక్కువ ధరకు దిగుమతి చేసుకోవడానికి అమెరికా సిద్ధమైంది.
బలహీన దేశాలు, తమ మాట వినని దేశాలను గుప్పిట్లో పెట్టుకొన్నది. బెదిరింపులకు పాల్పడుతూ, యుద్ధాలను ప్రకటిస్తూ ఆ యా దేశాల ప్రభుత్వాలను హస్తగతం చేసుకొని, అస్థిర పరచి ఇంధన వనరులను హస్తగతం చేసుకోవడం తెలిసిందే. ఈ స్వార్థపూరిత యుద్ధాల వ ల్ల ప్రపంచ దేశాలన్నీ ఇంధన సమస్యలను ఎదుర్కొంటూ ఆర్థికంగా ఇక్కట్లను ఎదుర్కొంటున్నాయి. భారతదేశ పరిస్థితి మరింత ఘోరంగా ఉన్నది. మన దేశం ఇంధన అవసరాలకు 90% దిగుమతుల పైనే ఆధారపడింది. 2017 జూన్‌లో ఇండియా డైనమిక్ ఇంధన ధరల విధానానికి మారింది. అప్పటి నుంచి కొన్నేండ్లు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజల్ ధరలు ఖరారయ్యాయి. కానీ కొవిడ్, లాక్డౌన్ వల్ల ఆదాయంలో లోటును కారణంగా చూపుతూ, ఇంధన ధరల సవరణకు పూనుకొన్నది. ఎక్సైజ్ సుంకాలు, సెస్‌ల పేరిట ధరలను పెంచింది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పుడు పెరుగుదలను ప్రజలపై రుద్దుతున్నది.
కానీ అంతర్జాతీయంగా ధరలు తగ్గినపుడు వినియోగదారులకు మాత్రం తగ్గించడం లేదు. అంతేకాక, ఈ మధ్య కాలంలో ఇంధన దిగుమతులపై డాలర్ల రూపంలో చెల్లింపులు ఎక్కువ అవుతున్నాయనే నెపంతో మొదట 10% ఆల్కహాల్ కలిపిన పెట్రోల్‌ను మార్కెట్లోకి తెచ్చింది. దీంతో అన్ని వాహన తయారీ పరిశ్రమలు ఈ తరహా పెట్రోల్‌కు అనుగుణమైన వాహనాలను తయారు చేయడం ప్రారంభించాయి. ఇప్పుడు 20% ఆల్కహాల్ కలిపిన పెట్రోల్ వాడడం వల్ల అంతర్జాతీయ కరెన్సీని ఆదా చేయవచ్చని, భారతదేశం మొత్తంగా 10% పెట్రోల్‌కు బదులుగా ఈ-20 పెట్రోల్‌ను ప్రవేశపెట్టింది.
నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో శ్రీరాకేశ్ సావల్ అధ్యక్షత వహించిన కమిటీ సమర్పించిన రోడ్‌మ్యాప్ ఫర్ ఇథనాల్ బ్లెండింగ్ ఇన్ ఇండియా 2020-2025 రిపోర్ట్ ఆధారంగా కేంద్రం ఈ-20 పెట్రోల్‌ను ప్రవేశపెట్టింది. ప్రభుత్వ వర్గాలు చెప్తున్నట్టు ఈ-20 పెట్రోల్ వాడకం మన దేశ పరిస్థితులకు అనుగుణంగా ఉన్నదా, ఇది లాభసాటేనా (ప్రభుత్వానికి, ప్రజలకు) అనే విషయంపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. ఈ-20 పెట్రోల్ వల్ల వాహనాల మైలేజీ తగ్గడంతోపాటు, వాహనాల్లోని ప్లాస్టిక్ భాగాలు, ఇంధనాన్ని ఇంజెక్ట్ చేసే భాగాలకు కూడా నష్టం కలుగుతుందని వాహన ఉత్పత్తిదారులు కూడా అంగీకరించారు. ఈ విషయాలన్నీ వాహనాలకు సంబంధించిన విషయాలు.
ఇక ప్రజలు, దేశ ఆర్థిక వ్యవస్థకు జరిగే నష్టాలను పరిశీలిద్దాం. ఇంతకుముందే పెరిగిన ఎక్సైజ్ సుంకం, సెస్‌లతో సతమవుతున్న ప్రజానీకానికి ఇది ఆర్ధికంగా మోయలేని భారమే. ఈ లెక్కన ప్రతీ నెల ఓ కుటుంబం ఆర్థ్ధిక ప్రణాళికలు పట్టుతప్పుతాయి. ఇది ప్రత్యక్షంగా ప్రజానీకానికే కాక ప్రభుత్వంపై కూడా భారాన్ని మోపుతున్నది. ఇది ఏ విధంగా పొదుపు చర్యనో ప్రభుత్వ పెద్దలే ఆలోచించాలి. ఆల్కహాల్ కలిసిన పెట్రోల్ వల్లర సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. పెట్రోల్‌ను వాహనాలలోకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎక్కువ శాతం నీరు ఉన్న పెట్రోల్ వల్ల బంక్
నిర్వాహకులు, వాహనదారులకు గొడవలు జరుగుతున్నాయి.
ప్రభుత్వం ఈ-20 పెట్రోల్‌తో ఆగకుండా సమీప భవిష్యత్తులో ఈ-85 పెట్రోల్‌ను ప్రవేశపెట్టడానికి ప్రణాళికలను రచిస్తున్నట్టు కేంద్రం సంకేతాలిస్తున్నది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మన దేశంలోని ప్రజానీకం ఇంధన అవసరాలను, ప్రతి సంవత్సరం పెరుగుతున్న పరిశ్రమ అవసరాల కోసం కావలసిన పెట్రో ఉత్పత్తుల పరిమాణం ఉహించలేనిది. ఈ-85 పెట్రోల్‌ను వినియోగంలోకి తెచ్చేముందు ప్రస్తుత మౌలికవసతులలో చేయాల్సిన మార్పులను పరిశీలిద్దాం. ఇప్పుడు దేశంలో ఈ-10 పెట్రోల్‌ను నిల్వపరిచే అన్ని బంక్‌లను అత్యవసరంగా ఈ-20 పెట్రోల్ కోసం మార్పులు చేయవలసి ఉంటుంది. ఇది ప్రభుత్వ పరంగా చేస్తుందా లేక పెట్రోల్ డీలర్లకు అప్పజెప్తుందా లేక పెట్రోల్ బంక్ యజమానులపైనే భారం మోపుతుందా అనేది వేచిచూడాల్సిందే. ఇక ఈ-85 పెట్రోల్‌ను నిల్వ చేయడానికి మౌలిక వసతులను పెంపొందించాలి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంత భారంగా మారుతుందో ఊహకందనిది. ఇప్పుడున్న అన్ని పెట్రోల్ వాహనాలను పూర్తిగా తొలగించి ఈ-85 పెట్రోల్‌కు అనుగుణంగా కొత్త తరం వాహనాలను ప్రవేశపెట్టాలి. తీసివేయాల్సిన వాహనాల స్క్రాప్‌ను ప్రాసెస్ చేయడానికి, కొత్త వాహనాల డిజైన్ కోసం జరిపే రీసెర్చ్‌పై ఎంతవరకు ప్రజల సొమ్మును వెచ్చించాల్సి వస్తుందో అంచనాలకు అందనిది. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రజలు డీజిల్ వాహనాల వైపు మొగ్గుచూపినా ఆశ్చర్యపోవలసిన పని లేదు. కానీ డీజల్ వాహనాల వల్ల జరుగుతున్న వాతావరణ కాలుష్యం కారణంగా ప్యాసింజర్ కార్లకు డీజిల్ ఇంజిన్లను తయారుచేయడాన్ని ఇప్పటికే నిలిపివేశాయి.
మళ్లీ వెనుకకు వెళదామా లేక ప్రత్యామ్నాయంగా విద్యుత్తు వాహనాలను ప్రోత్సహిద్దామా అనేది ప్రజలు, ప్రభుత్వం ముందున్న ప్రశ్న. ఇప్పటికే గృహావసరాలు, పరిశ్రమలు, వ్యవసాయ రంగానికి అవసరమైన విద్యుత్తును అందించడానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపసోపాలు పడుతున్నాయి. వీటన్నింటి విషయమై అన్ని రకాలుగా ఎదురయ్యే సమస్యలను కూలంకషంగా నిపుణులతో చర్చించి ప్రణాళికలను రూపొందించాలి. ఏదో ప్రధాన మంత్రి లేదా ఆర్థిక/పరిశ్రమ శాఖల మంత్రుల కార్యాలయాల్లో మంత్రుల సూచనలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి ప్రజలపై రుద్దుతే అవి బెడిసికొడుతాయే తప్ప లెక్కల ప్రకారం ఫలితాలనివ్వవు.ప్రభుత్వ ప్రస్తుత ప్రణాళికల వెనుక ఉన్న అంశాలను, ఆల్కహాల్ కలిపిన పెట్రోల్‌ను ప్రవేశపెట్టడం వెనుకనున్న మతలబుల గురించి చర్చిద్దాం. ఈ మధ్య కాలంలో రాజకీయ, ప్రభుత్వ, కార్పొరేట్ వర్గాలు ఆల్కహాల్ పరిశ్రమలకు లాభాన్ని ప్రోత్సహించే ప్రణాళికలు రచిస్తున్నాయి. దీని వెనుక ప్రజల బాగోగులకన్నా, వారి ఆర్థిక, సామాజిక అభ్యున్నతిపైన గాని ఈ రంగాలకు ఎటువంటి ప్రేమానురాగాలు లేవు.
రోడ్ మ్యాప్ ఫర్ ఇథనాల్ బ్లెండింగ్ ఇన్ ఇండియా 2020-2025 రిపోర్ట్ బ్రెజిల్, అమెరికా, యూరోపియన్ యూనియన్, చైనా, థాయిలాండ్ లాంటి దేశాల్లోని ఇథనాల్ బ్లెండింగ్ పాలిసీలను పరిశీలించి రిపోర్ట్‌లో పొందుపరిచింది. వాహనాల తయారీలో ముందున్న దేశాలు, పెట్రోల్ యంత్రాల అభివృద్ధిలో ఏండ్లుగా పరిశోధనలు చేస్తున్న దేశాలు ఇంతవరకు ఈ-85ను పూర్తిగా వినియోగించే సాహసం చేయలేకపోతున్నాయి. అంటే ఈ విషయం ఎంత క్లిష్టమైనదో గ్రహించవచ్చు. మౌలిక సదుపాయాలు, ఆర్థిక వెనుకబాటు, పెట్రో-డీజల్ యంత్రాలను దిగుమతి చేసుకొనే పరిస్థితుల్లో ఉన్న భారత్ ఈ విషయమై తొందరపడటం సరైందేనా?
కొంతమంది రాజకీయ నాయకులు, ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కొందరికి ఇథనాల్ పరిశ్రమలతో ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధాలు ఉన్నాయి. ఆయా కంపెనీలకు లాభం చేకూర్చేందుకు దేశంలో ఇథనాల్ అవసరాన్ని పెంచే ప్రణాళికలను రూపొందించే పనిని ప్రభుత్వం ముందేసుకొన్నదని స్పష్టమవుతున్నది.తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రైవేట్ రంగంలో ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. దీని కోసం రాష్ట్రంలో పెద్ద ధన్వాడ, గద్వాల, సూర్యాపేట, నిర్మల్, దిలావర్పూర్లో ప్రైవేట్ పారిశ్రామికవేత్తలు భూసేకరణకు చేస్తున్న యత్నాలకు ప్రజలు, రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్నది. ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సిందే. ఈ పరిశ్రమల వల్ల వందల ఎకరాల భూమిని కేటాయించాల్సి ఉంటుంది. వేలాది మంది రైతులు జీవనాధారం కోల్పోవలసి వస్తుంది. ఈ పరిశ్రమలు ఉత్పత్తి దశకు వచ్చిన తర్వాత వాటి నుంచి వెలువడే కాలుష్య కారకాల వల్ల ఆ ప్రాంతంలోని నేల, నీరు పనికి రాకుండా పోతాయనేది వాస్తవం. అలాంటి దుస్థితి రాకుండా ఉండేందుకు నిరసన తెలుపుతున్న ప్రజలను ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ ద్వారా అణచివేస్తున్నది.
రెండు దశాబ్దాలుగా దేశాన్ని పాలిస్తున్న రాజకీయ పార్టీలు వారి వారి ప్రయోజనాల కోసం రూపొందిస్తున్న ప్రణాళికలను ప్రజలపై రుద్దటానికి యత్నిస్తూనే ఉన్నాయి. అంతేకాకుండా ఈ ప్రభుత్వాలు జవాబుదారీతనాన్ని పరిహాసం చేస్తున్నాయి. ప్రపంచ దేశాలన్నింటిలో మన భారతదేశ ప్రజలే ఎంతో సహనం, ఓర్పు గలవారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మన దేశ ప్రజలు ఉద్యమాలు లేవనెత్తిన ఘటనలు చాలా అరుదు. ఇప్పుడు మనం చూస్తున్న సీజేపీ ఉద్యమం తీవ్రరూపం దాల్చినా ఉద్యమకారులు ఎక్కడా వారి హద్దు దాటలేదు. పోలీసుల నుంచి ఎంత అణిచివేతలు ఎదురైనా యువత ప్రదర్శించిన సహనం నిజంగా అభినందనీయం. కేంద్ర ప్రభుత్వం అనేక ప్రజావ్యతిరేక, ఆర్థికపరమైన అవకతవకలతో కూడిన, ప్రభు త్వ రంగ సంస్థలను నిర్వీర్య పరిచే నిర్ణయాలను తీసుకొంటున్నది. ప్రభుత్వ రంగ సంస్థలను అతి తక్కువ ధరలకు ప్రైవేట్ సంస్థల పరం చేస్తూ యువత ఉద్యోగ అవకాశాలకు తూట్లు పొడుస్తున్నది. ఇలాంటి వైనాన్ని, దేశ విదేశాల నుంచి విపరీతంగా చేస్తున్న అప్పుల లెక్కలను, రాజ్యాంగ పరమైన సంస్థల దుర్వినియోగాన్ని ప్రశ్నించవలసి ఉన్నది.
(వ్యాసకర్త: కాకతీయ విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్)
-ఆచార్య జగన్నాథస్వామి
9849272970