కేసముద్రం, ఫిబ్రవరి 12 : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం ఎర్రబంగారం పోటెత్తింది. ఒక్క రోజే సుమారు 8వేల మిర్చి బస్తాలు విక్రయానికి వచ్చాయి. మార్కెట్‌కు పరిమితికి మించి మిర్చి రావడంతో వ్యాపారులు ఈ టెండర్ వేలం పాటలను ఆలస్యం చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు విడుదల కావాల్సిన ఈ టెండర్‌ను సాయంత్రం 5గంటలకు విడుదల చేశారు. ‘ఈ నామ్’ విధానం ద్వారా టెండర్ వేసి మధ్యాహ్నం తర్వాత కాంటాలు పెట్టాల్సి ఉంది. అయితే భారీగా మిర్చి బస్తాలు రావడాన్ని సాకుగా చూపుతూ వ్యాపారులు మిర్చి కొనుగోళ్లను వాయిదా వేశారు.
సోమవారం టెండర్ వేసి, మంగళవారం కాంటాలు నిర్వహించనున్నారు. కొనుగోళ్లను వాయిదా వేయడంతో రైతులు మార్కెట్లోనే రెండు రోజులు పడిగాపులుగాయాల్సిన పరిస్థితి నెలకొంది. వ్యాపారులు కావాలనే మిర్చి కొనుగోళ్లను వాయిదా వేసి, ధరలు తగ్గించి కొనుగోలు చేయాలని చూస్తున్నారని రైతులు వాపోయారు. క్వింటాల్ మిర్చికి గరిష్ఠంగా రూ.21,809, కనిష్ఠంగా రూ.10వేల ధర పలికింది. పరిమితికి మించి మిర్చి విక్రయానికి రావడంతో అధికారులు 13, 14 తేదీల్లో సెలవు ప్రకటించారు. 15న ప్రారంభిస్తామని పేర్కొన్నారు.