వరంగల్, మార్చి 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ నిర్వహణ కోసం ఏర్పాట్లు మొదలయ్యాయి. వరంగల్ నగర శివారులోని దేవన్నపేట, కోమటిపల్లి పరిసరాలను మాజీ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం పరిశీలించారు. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
హైదరాబాద్-భూపాలపట్నం జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ స్థలంలో సభ నిర్వహణకు అనుకూలం గా ఉం టుందని బీఆర్ఎస్ సీనియర్ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి వరంగల్ నగరానికి వచ్చే వారికి ఈ జాతీయ రహదారితో అనుసంధానమ య్యే రవాణా వ్యవస్థ ఉన్నదని అభిప్రాయపడ్డారు. రజతోత్సవసభకు వచ్చే లక్షాలాది జనం రవాణా, తాగునీరు, ఇతర విషయాల్లో ఇబ్బంది పడకుండా ఉండేందుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు బీఆర్ఎస్ నే తలు ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లో, ప్రత్యేక రాష్ట్రంలోని సెంటిమెంట్‌గా ఉంటున్న వరంగల్‌లో బీఆర్ఎస్ రజతోత్సవ సభను లక్షలాది మందితో వరంగల్‌లో ఏప్రిల్ 27న నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ ఈనెల 7న నిర్ణయించారు. సభ ఏర్పాట్లు, బహిరంగ సభ వేదిక ఎంపిక కోసం మాజీ మంత్రి హరీశ్‌రావు ఈ నెల 10న వరంగల్ నగర శివారులోని భట్టుపల్లి, ఉనికిచర్ల స్థలాలను పరిశీలించారు. శుక్రవారం మరోసారి వరంగల్‌కు వచ్చి బహిరంగసభ నిర్వహణకు అనుకూలంగా ఉండే స్థలాలను పరిశీలించారు.